అంగరంగ వైభవంగా గంగమ్మ జాతర

రాయలసీమలోనే సుప్రసిద్ధ జాతరగా పేరొందిన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర మొదటి రోజు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నిన్న రాత్రి అవిలాల నుంచి చాటింపుతో పసుపు కుంకుమలు తీసుకురావటంతో జాతర ప్రారంభమైంది. జాతర మహోత్సవంలో తొలి రోజు భక్తులు బైరాగి వేషంతో గంగమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు.ఏడుకొండల వెంకన్నకు ఆడపడుచుగా భావించే గంగమ్మకు నిర్వహించే ఈ జాతరను వీక్షించేందుకు తిరుపతి పరిసర ప్రాంతాల నుంచే కాకుండా రాయలసీమ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో గంగమ్మ ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.పూర్వం చిత్తూరు జిల్లా ప్రాంతంలో పాలెగాళ్ల అరాచకాలు ఎక్కువగా ఉండేవని… వారి దురాగతాలు నానాటికీ ఎక్కువ కావటంతో అమ్మవారు గంగమ్మ తల్లిగా ఉద్భవించిందని స్థల పురాణం.అమ్మవారికి భయపడిన అప్పటి పాలెగాడు ఆమెకు కనపడకుండా దాక్కొని జీవించేవాడట. పాలెగాడిని బయటకి రప్పించేందుకు గంగమ్మ తల్లి రోజుకో వేషంతో సంచరించేదని ఆలయ ప్రశస్తి.నాటి నుంచి భక్తులు అమ్మవారికి ఏటా చైత్రమాసం చివరి వారంలో తొమ్మిది రోజుల పాటు రోజుకో వేషంతో వైభవోపేతంగా జాతర నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు భక్తులు బైరాగి వేషాన్ని ధరించి అమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్నారు.పొంగళ్లు, అంబలి సమర్పిస్తున్నారు. చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బైరాగి వేషం ధరించి అమ్మవారిని దర్శించటం తరతరాలుగా వస్తున్న సంప్రదాయమని భక్తులు అంటున్నారు. ఆఖరి రోజు చప్పరాల ఊరేగింపుతో గంగమ్మ జాతర ఘనంగా ముగుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *