కేంద్ర ప్రభుత్వ వైఖరిపై 3 లేఖలు

  • దొనకొండలో మెగా పారిశ్రామిక హబ్

  • రాయలసీమ ఉక్కు కార్పోరేషన్ ఏర్పాటు

  • ఎండీగా పి.మధుసూధన్ నియామకం

  • రూ.22వేల కోట్లతో గ్రామీణ నీటిసరఫరా

  • అన్నా క్యాంటిన్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు

  • పీపీపీ విధానంలో విశాఖ మెట్రో

  • అసైన్డ్ భూముల క్రమబద్దీకరణ

మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు

మీడియాకు వివరించిన మంత్రి కాలవ శ్రీనివాసులు

ఆంధ్రప్రదేశ్ విభజన హామీల అమలు విషయంలో కేంద్రప్రభుత్వ వైఖరిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రెండు లేఖలు, తిత్లీ తుఫాను సాయంపై కేంద్ర హోం మంత్రికి మరో లేఖ రాయాలని మంత్రి మండలి సమావేశం నిర్ణయించింది. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని మంత్రి మండలి సమావేశం మందిరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయడంలో కేంద్రం జాప్యం చేస్తుందనడంకంటే మోసం చేస్తుందని  అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై పీఎంకు  3 లేఖలు రాయాలని మంత్రి మండలి నిర్ణయించినట్లు తెలిపారు. విభజన ఒప్పందంలో భాగంగా కడపలో స్టీలు ప్లాంటు ఏర్పాటు చేయాల్సి ఉందని, కానీ ఆ దిశగా  కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి మొదటి లేఖ  రాయాలని  తీర్మానించినట్లు చెప్పారు. కేంద్ర హామీలు అమలు కావడం లేదని, తక్షణం వాటిని అన్నింటినీ అమలు చేయాలని రెండవ లేఖ రాయాలని నిర్ణయించామన్నారు. విభజన చట్టంలోని ఏ హామీ సంపూర్ణంగా నెరవేర్చడం లేదని, ప్రత్యేక హోదా ఇవ్వలేదని, వెనకబడిన జిల్లాలకు నిధులు నిలిపేశారని, ఏపీపై తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని,  పోలవరం డీపీఆర్ ఆమోదించలేదని, తిత్లీ తుఫానుకు పైసా కూడా ఇవ్వలేదని, ఇప్పటికైనా కేంద్రం హామీలు అమలు చేయాలని డిమాండ్ చేసినట్లు వివరించారు. కేంద్రం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేదన్నారు. ఈ అంశాలపై లేఖ రాస్తారని చెప్పారు. తిత్లీ తుఫాన్ విషయంలో కేంద్ర వైఖరిపై కేంద్ర హోం మంత్రికి ప్రత్యేకంగా మరో లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో కడప ఉక్కు కర్మాగారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని నిర్ణయించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే వంద శాతం పెట్టుబడి వ్యయాన్ని భరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ‘రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్’ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదించిందని చెప్పారు. వచ్చే నెలలో దీనికి పునాదిరాయి వేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టరుగా గతంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సీఎండీగా పని చేసిన పి.మధుసూధన్‌ను నియమించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అవసరమైతే ఈక్విటీకి వెళ్లాలని, ముందుకొచ్చే ప్రైవేటు సంస్థలతో జాయింట్ వెంచర్‌గా ముందుకెళ్లాలని సమావేశం భావించినట్లు తెలిపారు. కడప స్టీల్ ప్లాంట్ ప్రజల చిరకాల వాంఛ అని,  ఆ ప్రాంతంలో యువతకు ఉద్యోగాలు పెద్దఎత్తున రావాలని మంత్రి మండలి అభిప్రాయపడిందన్నారు. విభజన ఒప్పందంలో కడపలో నెలకొల్పాల్సిన ఉక్కు కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వం వివక్షతో నిరాకరించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకుందన్నారు.  స్వయంగా ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని నిశ్చయించినట్లు చెప్పారు. ‘రాయలసీమ స్టీల్ కార్పొరేషన్’కు ప్రాథమిక పెట్టుబడిగా రూ. 2 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.  మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 12 వేల కోట్లుగా అంచనా వేశారన్నారు.

విభజన చట్టంలో పేర్కొన్నవిధంగా విశాఖ మెట్రో ఏర్పాటుకు కేంద్రం ముందుకు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే దాని బాధ్యత తీసుకుని సత్వరం ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు సబంధించిన ఆర్ఎఫ్పీ, రాయితీ ఒప్పందంపై గతంలో జారీచేసిన ఉత్తర్వులకు ఆమోదం తెలపడంతోపాటు ఆర్ఎఫ్పీ, రాయితీ ఒప్పందాన్ని విడుదల చేయడానికి అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ (ఏఎంఆర్సీ) మేనేజింగ్ డైరెక్టరుకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో 42.55 కిలోమీటర్ల మేర 3 కారిడార్లుగా విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు తాజా అంచనా వ్యయం రూ.8300 కోట్లుగా పేర్కొన్నారు. ప్రాజెక్టు సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు నిమిత్తం బాహ్య వాణిజ్య రుణాలు లేదా ఏదైనా ఇతర విదేశీ ఫండ్ ఏజెన్సీలు/ఆర్థిక సంస్థల నుంచి  భారతీయ బ్యాంకుల కంటే తక్కువ వడ్డీ రేట్లతో రూ. 4200.00 కోట్లు మించకుండా రాష్ట్ర ప్రభుత్వ వన్‌టైమ్ సావరిన్ గ్యారంటీతో  అప్పుగా తీసుకోవడానికి ఏఎంఆర్సీని అనుమతిస్తారని చెప్పారు. ప్రారంభమైన తొలి 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధిదారుకు రూ.820 కోట్లకు మించకుండా సహాయం అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రన్నింగ్ సెక్షన్, స్టేషన్లు, పార్కింగ్ ప్రాంతాలు, డిపో ఏర్పాటుకు 83 ఎకరాల ప్రభుత్వ భూమిని అందించడమే కాకుండా మరో 12 ఎకరాల భూమిని సేకరించేందుకు జిల్లా కలెక్టర్‌ అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశించించినట్లు చెప్పారు. మెట్రో రైలు ప్రాజెక్టులో ఎస్జీఎస్టీ  కింద రీఇంబర్స్‌మెంట్ చేయాల్సిన మొత్తం రూ.527 కోట్లని తెలిపారు. మెట్రోరైలు ప్రాజెక్టుకు అవసరమయ్యే విద్యుత్ సరఫరాను గ్రిడ్ నుంచి నిరంతరాయంగా అందిస్తారన్నారు. ఈ ప్రాజెక్టు అభివృద్ధిలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయిస్తారని చెప్పారు.  ప్రాజెక్టు నిర్మాణంలోనూ, నిర్వహణలోనూ అవసరమైన భద్రత అంశాలను అందిస్తారన్నారు.

దొనకొండలో మెగా ఇండస్ట్రియల్ హబ్

ప్రకాశం జిల్లా దొనకొండలో మెగా ఇండస్ట్రియల్ హబ్ నిర్మాణానికి 2395.98 ఎకరాల ప్రభుత్వ భూమి ఏపీఐఐసీకీ ఉచితంగా కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. దొనకొండ మండలం  రాగమక్కపల్లి, భూమనపల్లి, రుద్రసముద్రం, ఇండ్లచెరువు గ్రామాల పరిధిలోని ఈ భూమిని దొనకొండ మెగా ఇండస్ట్రియల్ హబ్ నిర్మాణం కోసం  ప్రకాశం జిల్లా  ఏపీఐఐసీ జోనల్ మేనేజర్‌కు అప్పగించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు.

కేబినెట్ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, హాజరయిన మంత్రులు

2019 నాటికి ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్

దేశానికే గొప్ప నమూనాగా నిలిచిన ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును 2019 జూన్ నాటికి పూర్తిచేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించిందన్నారు. ఈ ప్రాజెక్టు అడ్ గ్రెడేషన్, అదనపు సీపీయూ బాక్సుల ఏర్పాటు నిమిత్తం అవసరమైన రూ.3,283 కోట్లను రుణ రూపంలో సమకూర్చుకునేందుకు  ప్రభుత్వం గ్యారంటీగా ఉండేందుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. సోషియో ఎకనామిక్ గ్రోత్ సాధించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న 5 గ్రిడ్లలో ఫైబర్ గ్రిడ్ ఒకటని తెలిపారు. 24 వేల కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలోని 13 జిల్లాలలో ప్రతి ఇంటికీ ఇంటర్‌నెట్, కేబుల్ టీవీ ప్రసారాలు, టెలిఫోన్ సదుపాయాలు కల్పించాలన్నది ఈ గ్రిడ్ ఏర్పాటు లక్ష్యంగా పేర్కొన్నారు. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏపీ స్టేట్ ఫైబర్ గ్రిడ్ లిమిటెడ్ పేరిట ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు.  కార్పొరేషన్ ద్వారా 13 జిల్లాలలో హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యం అని తెలిపారు. 24 వేల కిలోమీటర్ల పరిధిలో ఉన్న విద్యుత్ స్థంభాల ద్వారా ఆప్టికల్ కేబుల్ సమకూర్చడమే కాకుండా 2445 గుర్తించిన సబ్ స్టేషన్లలో పాయింట్స్ ఆప్ ప్రెజెన్స్  ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం నెట్‌వర్క్ కు విశాఖపట్నంలో స్టేట్ వైడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ ప్రధాన కేంద్రంగా ఉంటుందన్నారు.

జువ్వలదిన్నె గ్రామంలో  ఫిషింగ్ హార్బర్

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె గ్రామంలో  ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి 38.53 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించినట్లు తెలిపారు. తుఫానుల సమయంలో మత్స్యకారులు తమ సామగ్రిని సురక్షితంగా భద్రపర్చుకునేందుకు ఈ ఫిషింగ్ హార్బర్ నిర్మాణ ఉద్ధేశంగా పేర్కొన్నారు. విశాఖ జిల్లాలో  వేస్ట్ 2 ఎనర్జీ ప్లాంటు నిర్మాణం కోసం మార్కెట్ ధర ప్రకారం ఎకరా ఒక్కింటికి రూ. 3 కోట్ల ధర చెల్లించే ప్రతిపాదనతో 8.54 ఎకరాల ప్రభుత్వ భూమి గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పోరేషన్‌కు కేటాయించారు.  వేస్ట్ 2 ఎనర్జీ ప్లాంటు నిర్మాణం కోసం భీమునిపట్నం మండలం కాపులుప్పాడ గ్రామంలో 110.20 ఎకరాల ప్రభుత్వ భూమిని మార్కెట్ ధర ప్రకారం ఎకరా ఒక్కింటికి రూ. కోటి చెల్లించే షరతుతో జీవీఎంసీకి  కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బుచ్చవరంలో 8.60 ఎకరాల దేవాదాయ భూమి, షేర్ మహ్మద్ పేట గ్రామంలో 5 ఎకరాల  దేవాదాయ భూమిని  ఆక్రమించి ఇళ్లు నిర్మించుకుని ఉంటున్న పేదలకు,  ఆ స్థలాలకు బదులుగా ఇదే మండలంలోని గండ్రాయి గ్రామంలో అదే మొత్తంలో భూమిని కేటాయిస్తూ ప్రతిపాదనను ఆమోదించినట్లు తెలిపారు. విశాఖ సిటీ పోలీసులకు ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుకు విశాఖ జిల్లా ఆనందపురం మండలం కుశలవాడ గ్రామంలో 50 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పగించే  ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపినట్లు మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు.

బందరు పోర్టు భూసేకరణకు రూ.200 కోట్లు

బందరు పోర్టు అభివృద్ధికి అవసరమైన భూసేకరణ నిమిత్తం రూ.200 కోట్లు విడుదల చేసేందుకు ఆమోదించినట్లు తెలిపారు.          మచిలీపట్నం మండలంలోని 4 గ్రామాలలో డీప్‌ల్యాండ్ పోర్ట్- పోర్ట్‌ ల్యాండ్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి 2159.25 ఎకరాల భూమిని ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ కింద ఎకరం రూ.25 లక్షల ఏకరూప ధరను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కృష్ణాజిల్లా కలెక్టర్ సిపారసులకు అనుగుణంగా ఈ నిర్ణయాలు తీసుకున్నామన్నారు.

రూ.22 వేల కోట్లతో గ్రామీణ నీటి సరఫరా

రూ. 22 వేల కోట్లు వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో గ్రామీణ నీటి సరఫరా పనులను చేపట్టడానికి సమాయత్తం కావాలని ముఖ్యమంత్రి నిర్దేశించినట్లు చెప్పారు. తొలుత రూ.9,400 కోట్లతో కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో తాగునీటి సరఫరా పనులను చేపట్టేందుకు ఏపీడిడబ్లూఎస్సీ మేనేజింగ్ డైరెక్టర్‌కు అనుమతి ఇచినట్లు చెప్పారు. ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి ఊరుకు మురుగునీటి పారుదల వ్యవస్థ, ప్రతి వీధికి ఎల్‌ఈడీ వీధి దీపాలు, ప్లాంటేషన్, విలేజ్ టూరిజం అభివృద్ధి చేయడమే లక్ష్యం కావాలని నిర్దేశించినట్లు చెప్పారు. ఇంకుడు గుంతల నిర్మాణాన్ని సత్వరం పూర్తిచేసి వంద శాతం పారిశుధ్యం సాధించాలని నిర్ణయించినట్లు తెలిపారు. వచ్చే రెండేళ్లలో పట్టణాలను తలదన్నేలా మౌలిక సదుపాయాలు, స్వచ్ఛత, పచ్చదనంతో అన్ని పల్లెలను సమృద్ధిగా తీర్చిదిద్దాలని తీర్మానించినట్లు చెప్పారు. ఈ సంక్రాంతి నాటికి క్లీన్ విలేజెస్ లక్ష్యంగా పేర్కొన్నారు.

‘అన్న క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్’

‘అన్న క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్’ ఏర్పాటు చేయాలని  నిర్ణయించినట్లు తెలిపారు.  ఈ ట్రస్టుకు వచ్చే నిధుల ద్వారా భవిష్యత్తులో అన్నక్యాంటీన్లను నిర్వహించేలా పథకాన్ని బలోపేతం చేస్తారని చెప్పారు. పేదలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలన్న అన్న క్యాంటీన్ల లక్ష్యాన్ని ట్రస్టు ఏర్పాటు ద్వారా సాధించవచ్చునని మంత్రిమండలి అభిప్రాయపడినట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా మరికొన్ని అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడానికి  ఆమోదించామని, అయితే ఎక్కడెక్కడ వాటిని ఏర్పాటుచేయాలో నిర్ణయం తీసుకోవడానికి మరోసారి మంత్రులు చర్చించాలని ముఖ్యమంత్రి సూచన చేసినట్లు తెలిపారు. ఆర్థిక కార్యకలాపాలు ముమ్మరంగా ఉన్న ప్రదేశాలలో అన్నక్యాంటీన్లను ఏర్పాటు చేయడం ద్వారా కష్టపడి పనిచేసుకునే పేదలకు ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి సూచించారన్నారు. నవంబర్ 28వ తేదీన ఇ-భూధార్, ఎం-భూధార్  ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

అస్సైన్డ్ ల్యాండ్ భూముల క్రమబద్దీకరణ:

ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్స్ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ ఫర్స్) యాక్టు 1977కు సవరణకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు.   అసైన్డ్ ఇళ్ల స్థలాలలో ఐదేళ్లుగా నివసిస్తున్న వారి స్థలాలను క్రమబద్ధీకరిస్తారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ (ఆంధ్ర ప్రాంతం) ఈనాం ( ఎబాలిషన్ అండ్ కన్వెర్షన్ ఇన్ టు రైత్వారీ) యాక్టు-1956 సవరణకు ప్రతిపాదించిన ఆర్డినెన్స్ ను  ఆమోదించామన్నారు.  విజయనగరం జిల్లాలో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి భూముల బదిలీకి రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీని మినహాయిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. భోగాపురం మండలంలో గూడెపువలస, కంచేరు, కవులువాడ, రావివలస, సర్వేపల్లి గ్రామాలలో 63.76ఎకరాల ప్రైవేటు భూములను ఏపిఏడిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తారన్నారు.

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ పట్టణాలు, నగరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కింద ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2018-19)కు సంబంధించి ప్రభుత్వ గ్యారంటీ వ్యయం రూ.3 వేల కోట్లకు పరిమితం చేస్తూ మొత్తం  రూ.6 వేల కోట్లకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు.  సిఐపిపి ఇంటర్ సెక్టార్ నిధుల కేటాయింపులో మార్పులకు అనుమతించాలని, అమృత్ గ్యాప్ ఫండింగ్ రూ.344.89 కోట్లు నాన్ కాన్సిట్యూటెడ్ యుఎల్‌బిలకు (ఓవరాల్ ప్రాజెక్ట్ కాస్ట్ మించకుండా) ప్రస్తుత మొత్తం రూ.701.89 కోట్లకు అదనంగా జోడించాలని తీర్మానించారు.  దీంతో సిఐపిపి కింద అమృత్ గ్యాప్ ఫండింగ్ మొత్తం రూ.1046.78 కోట్లు అవుతుంది.   పార్కుల అభివృద్ధి నిధులను ప్రస్తుతం కేటాయించిన రూ.400 కోట్ల నుంచి రూ.200 కోట్లకు తగ్గించి ఆ మెత్తాన్ని స్మశాన వాటికలకు ప్రస్తుత కేటాయింపు రూ.200 కోట్ల నుంచి రూ.450 కోట్లకు పెంపు,  ఓపెన్ జిమ్ ఎక్విప్‌మెంట్ ఏర్పాటు వ్యయం రూ.36 కోట్లకు అనుమతి, రుణాలు చెల్లించేందుకు నగర పాలక సంస్థల  సామర్ధ్యం తగినంత లేనందున రుణం తిరిగి చెల్లింపు  పూర్తి అయ్యేవరకు ప్రతి ఏడాది బడ్జెట్ కేటాయింపులు జరిగేలా చేయడానికి ఆమోదం తెలిపినట్లు చెప్పారు.

ఐటీ అండ్ ఐటీఈఎస్ సిటీ :

విశాఖపట్నం మధురవాడలో 22.19 ఎకరాల అభివృద్ధికి ‘విశాఖపట్నం ఇండస్ట్రియల్ అండ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ (విఐఈడిసివో)’ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు సంబంధించి, ‘ముంబై సిడ్కో’ ప్రాతిపదికన ‘‘ఐటి అండ్ ఐటిఈఎస్ సిటి’’గా (జీవో ఎంఎస్ నెం 343) ర్యాటిఫికేషన్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు.         విశాఖపట్నంలో ఎలక్ట్రికల్ ఇనస్పెక్టర్ పోస్టును డిప్యూటి ఛీప్ ఎలక్ట్రికల్ ఇనస్పెక్టర్ పోస్టుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ఆమోదం తెలిపామన్నారు. రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ కాలేజికి ఒక ప్రిన్సిపాల్ పోస్టును మంజూరు చేసినట్లు తెలిపారు.     భాషా పండితులు/ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లను స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించడానికి ఆమోదం తెలిపామన్నారు. దీనివల్ల 12,827 మంది ఉపాధ్యాయులు ప్రయోజనం పొందుతారని చెప్పారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు 250 మంజూరుకు ఆమోదం తెలిపామన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్, క్రాఫ్ట్, డ్రాయింగ్, మ్యూజిక్ వంటి టీచర్ పోస్టులను అవుట్ సోర్సింగ్‌కు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అభిప్రాయపడినట్లు చెప్పారు. ఇటువంటి సేవలను అవుట్ సోర్సింగ్‌కు ఇవ్వడం ద్వారా విద్యార్ధులకు ఉత్తమ శిక్షణ అందుతుందని, దీనిపై అధ్యయనం చేసి తగు నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కొత్తగా మంజూరైన సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు సిబ్బంది మంజూరు చేయడంతో పాటు రికరింగ్, నాన్ రికరింగ్ వ్యయం మంజూరు చేసినట్లు చెప్పారు.

29.04.2015 నుంచి 13.06.2016 వరకు, లేదా ఆ తర్వాత ఇచ్చిన 47 భూ కేటాయింపులను లీజు ప్రాతిపదిక ద్వారా కాకుండా అవుట్ రైట్ సేల్ ప్రాతిపదికగా మార్పుచేయాలన్న ఏపీఐఐసీ  ప్రతిపాదనకు ఆమోదం తెలిపామన్నారు. విశాఖపట్నంలోని బ్రాండిక్స్ ఇండియా అప్పారెల్ సిటీకి కేటాయించిన 44.217 ఎకరాల భూమిని డి-నోటిఫై చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు.  ఈ భూమిని మరెవ్వరికీ విక్రయించకుండా లీజు ప్రాతిపదికన ఇవ్వడానికి అవకాశం ఇస్తూ అనుబంధ ఒప్పందం చేసుకోవడానికి వీలుగా డీ నోటిఫై చేస్తారన్నారు.  ఈ క్లష్టర్ మొత్తాన్ని గార్మెంట్స్‌ కే ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. 26-9-2014 నుంచి 12-6-2018 వరకు స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి మెగా ప్రాజెక్టులు, ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలను కొనసాగించడాన్ని ఆమోదించినట్లు తెలిపారు.

నిమ్జ్ కోసం భూసేకరణ

నేషనల్ ఇన్వెస్టుమెంట్ మాన్యుఫాక్ఛరింగ్ జోన్ (ఎన్ఐఎంజడ్) ఏర్పాటు నిమిత్తం ప్రకాశం జిల్లాలోని 6 గ్రామాలలో భూసేకరణకు వెళ్లేందుకు ఏపీఐఐసీకి  అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. భారత ప్రభుత్వ సూచన మేరకు ఎన్ఐఎంజడ్  ఏర్పాటుకు సంబంధించి 14,346 ఎకరాల భూమిని అభివృద్ధి చేయడానికి అవసరమైన బృహత్తర ప్రణాళిక, ఆకృతుల రూపకల్పనకు ఒక కన్సల్టెంటును ఆర్ఎఫ్పీ  విధానంలో ఎంపిక చేయడానికి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఈ జోన్ ఏర్పాటులో కేంద్ర, రాష్ట్ర వాటా ఎంతో తెలుసుకుని తదనుగుణంగా డీపీఆర్ రూపొందించి సమర్పిస్తారన్నారు.           రూ.43,700 కోట్ల పెట్టుబడుల అంచనాతో ఈ జోన్ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.  రూ.10,850 కోట్ల వ్యయంతో ఏర్పాటయ్యే దీని ద్వారా ప్రత్యక్షంగా లక్ష మందికి, పరోక్షంగా లక్షన్నర మందికి ఉద్యోగ-ఉపాధి అవకాశాలు దక్కుతాయని మంత్రి వివరించారు.    అనంతపురం జిల్లా కూడేరు మండలం ఇప్పేరు గ్రామంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు 4 ఎకరాల భూమి మెసర్స్ ఎస్సెల్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ముంబై)కు 25 ఏళ్ల పాటు రూ.84వేలకు లీజ్ మొత్తంగా ల్యాండ్ లీజ్ అగ్రిమెంట్ ను పూర్తిచేసేందుకు అనంతపురం మున్సిపల్ కమిషనరుకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. .వాణిజ్య, పారిశ్రామిక, గృహ అవసరాల కోసం సీఎన్జీ, సీఎన్జీ ముఖ్యకేంద్ర (మదర్ స్టేషన్) నిర్మాణానికి గోదావరి గ్యాస్ ప్రైవేటు లిమిటెడ్ కు పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు సమీపంలో 50 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించినట్లు తెలిపారు. మార్కెట్ ధర ప్రకారం ఎకరా ఒక్కింటికి ప్రభుత్వానికి  రూ. 2 కోట్ల ధర చెల్లించే షరతుపై భూ కేటాయింపు జరిగినట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం వట్లూరు గ్రామంలో సీఎన్జీ స్టేషన్ నిర్మాణానికి గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 0.50 సెంట్ల ప్రభుత్వ భూమి కేటాయించడంతోపాటు మార్కెట్ విలువ ప్రకారం ఆ కంపెనీ ప్రభుత్వానికి రూ.1.25 కోట్లు చెల్లించే షరతు మీద ఆమోదం తెలిపినట్లు చెప్పారు.  చిత్తూరు మండలం కట్టమంచి గ్రామంలో పోద్దార్ ఇంటర్నేషనల్ స్కూలు అభ్యర్ధన మేరకు స్కూలు నిర్మాణం కోసం షరతులకు లోబడి  2 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించారు.  ఎకరా ఒక్కింటికి రూ. 1,08,90,000 చొప్పున 33 ఏళ్ల పాటు లీజు చెల్లించే షరతు మీద ఆమోదముద్ర వేసినట్లు చెప్పారు.

విశాఖ ల్యాండ్ రికార్డుల ట్యాంపరింగ్‌పై చర్యలకు కమిటీ

విశాఖ భూముల ట్యాంపరింగ్‌కి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, ల్యాండ్ రికవరీ కోసం ఒక కమిటీ వేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. రెవెన్యూ, జీఏడీ, లా శాఖల సెక్రటరీలతో కమిటీ వేస్తారన్నారు. 30 రోజుల్లో ఈ కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. విశాఖ జిల్లాలో ల్యాండ్ రికార్డుల ట్యాంపరింగ్‌లో సిట్ సమర్పించిన విచారణ నివేదికను  మంత్రిమండలి ఆమోదించిందన్నారు. ట్యాంపరింగ్‌లో వున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై చర్చించినట్లు తెలిపారు. సిట్ కు 2875 ఫిర్యాదులు, 333 వినతులు, వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులు 11 అందినట్లు వివరించారు. భూ ఆక్రమణలో ప్రైవేటు వ్యక్తుల పాత్ర ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. అధికారులపై 49, ప్రైవేటు వ్యక్తులు 50 మందిపై కేసులు ఉన్నట్లు చెప్పారు.

భూసేకరణ మార్గదర్శకాల సడలింపు

విశాఖపట్నం జిల్లాలో ల్యాండ్ పూలింగ్ అమలు మార్గదర్శకాల సడలింపునకు కౌన్సిల్ తీర్మానం ప్రకారం కొమ్మాది, పరదేశిపాలెం, గాజువాక ట్రై జంక్షన్ దగ్గర డెవలపర్, వ్యక్తుల మధ్య భూమి పంపకంపై  ఆమోదం తెలిపినట్లు,  ఎకరానికి 1920: 450 చదరపు గజాలుగా ఉన్న నిష్పత్తిని 1970: 450 చదరపు గజాలుగా సవరించడం,  కొమ్మాది, పరదేశపాలెం ల్యాండ్ పార్సిల్స్‌ కు వుడా వద్ద డెవలప్‌మెంట్ ఎక్స్‌ పెన్సెస్‌కు ఉంచుకునే భూమి 10శాతంకు ఆమోదించామన్నారు. తుది ఉత్తర్వులలో  ఈ నిష్పత్తి 25 శాతంకు సవరించడం,  కొమ్మాది, పరదేశిపాలెం, గాజువాక ట్రై జంక్షన్ ల్యాండ్ పార్సిల్స్‌ లో  అభివృద్ధిపరిచిన భూమిని జిల్లా పరిపాలన, ఏపీ టిడ్కోకు స్వాధీనం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  తుది ఉత్తర్వులలో ‘‘జివిఎంసి’’కు అప్పగించడంగా సవరించడం,  గాజువాక ట్రై జంక్షన్ వద్ద ల్యాండ్ పూలింగ్ స్కీములో అభివృద్ధి చేసిన భూమిని  గృహ నిర్మాణం కోసం  సంబంధిత సంస్థకు 200 ఎకరాల విస్తీర్ణం స్వాధీనపరచాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీనిని తుది ఉత్తర్వులలో 400 ఎకరాలుగా సవరించడాన్ని కూడా ఆమోదించినట్లు తెలిపారు.

అగ్రిగోల్డ్ వ్యవహారాలకు సంబంధించి తాజా పరిస్థితులపై మంత్రి మండలి చర్చించినట్లు తెలిపారు. మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లో కూడా బాధితులు వీధులుపాలైనట్లు చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాధ్యతతో, శ్రద్ధతో వ్యవహరిస్తోందన్నారు.ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు.  ఇందులో అనేక సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్నట్లు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. బాధితులు ఇతర రాష్ట్రాలలో కూడా ఉన్నందున ఈ సమస్య పరిష్కారానికి, బాధితులకు న్యాయం చేయడానికి కేంద్రం కూడా సహాయసహకారాలు అందించాలని కోరారు. అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో చేయగలిగినంత చేస్తుందని మంత్రి కాలవ చెప్పారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *