తెరాసకు కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి రాజీనామా

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి తెరాసకు షాక్‌ ఇచ్చారు. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన అనూహ్యంగా ప్రకటించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు వారాల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో విశ్వేశ్వర్‌ రెడ్డి రాజీనామా సంచలనంగా మారింది.ఈ మేరకు తన రాజీనామా లేఖను తెలంగాణ భవన్‌కు పంపించారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆయన ఎక్కడా ప్రచారంలో పాల్గొనడంలేదు. రాజీనామా సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. పార్టీ గత రెండేళ్లుగా ప్రజలకు దూరమవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. అనేక సందర్భాల్లో పార్టీకి, ప్రజలకు అగాథం పెరిగిపోయిందని తనకు అన్పించిందని, ప్రభుత్వం కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని విశ్వేశ్వర్‌ రెడ్డి విమర్శించారు.తెలంగాణ ఉద్యమ సమయంలో తెరాసలో చేరిన విశ్వేశ్వర్‌ రెడ్డి ఆ తర్వాత చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగి గెలుపొందారు. రాజీనామాకు దారితీసిన కారణాలను ఆయన రేపు మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తెరాస నుంచి ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్‌లో చేరతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, కేటీఆర్‌తో భేటీ అనంతరం రేవంత్‌ వ్యాఖ్యలను కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఖండించారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *