లోకసభతో పాటు కశ్మీర్ కు ఎన్నికలు

ఫలిస్తున్న మోడీ వ్యూహం..

శ్రీనగర్ :  అనుకున్నట్లుగానే అయింది. మోదీ ముందుచూపుతోనే తీసుకున్న నిర్ణయం ఆయన పార్టీకి అనుకూల నిర్ణయాలు వస్తున్నాయి. 51 ఏళ్ల తర్వాత జమ్మూకాశ్మీర్ లో రాజకీయ నేపథ్యం ఉన్న సత్యపాల్ మాలిక్ గవర్నర్ గా నియమితులు అయిన వెంటనే జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు వస్తాయని దాదాపు అందరూ భావించారు. ఇది ఊహించని విషయమేమీ కాదు. వీలైతే బీజేపీతో కాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయించడం లేకుంటే రద్దు చేయడం సత్యపాల్ మాలిక్ గవర్నర్ గా వచ్చినప్పుడు విన్పించిన వ్యాఖ్యలు. ఇందులో మొదటిది సాధ్యం కాకపోవడంతో రెండోది తన చేతిలో ఉన్న పని కావడంతో మాలిక్ సులువుగా చేసేశారు. దీంతో జమ్మూకాశ్మీర్ కు కూడా లోక్ సభ ఎన్నికలతో పాటే పోలింగ్ జరిగే అవకాశాలున్నాయి.నిజానికి ఉత్తర, దక్షిణ ధృవాలైన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పీడీపీ వ్యవస్థాపకులు ముఫ్తీ మహ్మద్ సయ్యద్ ఉన్నంతకాలం సంకీర్ణం బాగానే నడిచింది. ఆయన మరణానంతరం కూతురు మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రి అయిన వెంటనే సంకీర్ణంలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. దీంతో గత జూన్ లో సంకీర్ణం నుంచి బీజేపీ తప్పుకోవడంతో అక్కడ గవర్నర్ పాలనను విధించారు. అయితే సత్యపాల్ మాలిక్ గవర్నర్ బాధ్యతలుగా చేపట్టిన వారంరోజులుకే చేసిన ప్రకటన అప్పట్లోనే ఎన్నికలు త్వరలోనే వస్తాయన్న సంకేతాలను పంపింది.నిజానికి కాశ్మీర్ లో ప్రభుత్వానికి 2020 వరకూ సమయం ఉంది. కాశ్మీర్ లో మొత్తం 87 మంది సభ్యులున్నారు. ఇందులో 28 స్థానాలను పీపుల్స్ డెమెక్రటిక్ పార్టీ, 25 స్థానాలు బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్ కు 13, కాంగ్రెస్ కు 14 స్థానాలు దక్కాయి. బీజేపీ గత జూన్ లో ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తూనే ఉంది. రాష్ట్ర పార్టీ ఇన్ ఛార్జి రామ్ మాధవ్ బీజేపీతో కలసి వచ్చే పార్టీల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తే బీజేపీ సులువుగా ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 19 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే రామ్ మాధవ్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ప్రత్యర్ధి పార్టీల్లో చీలిక తేవాలన్న స్ట్రాటజీ వర్క్ అవుట్ కాలేదు. లోయలో ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి రూపుదిద్దుకుంటోంది. పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు కలసి కాశ్మీర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. నేషనల్ కాన్ఫరెన్స్ తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ మెహబూబా ముఫ్తీ గవర్నర్ కు లేఖ కూడా రాశారు. ఈ పార్టీలు అన్నీ కలిస్తే మెజారిటీ సభ్యుల కంటే ఎక్కువ మంది మద్దతు ఉంది. మ్యాజిక్ ఫిగర్ 44 కాగా, వీరికి 55 మంది సభ్యుల మద్దతు ఉండటంతో గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారని భావించారు. కానీ సత్యపాల్ మాలిక్ ఉప్పు తిన్న బీజేపీకి ఎందుకు ద్రోహం చేస్తారు? వెంటనే శానసనభ ను రద్దు చేస్తూ ప్రకటన విడుదలయింది. కరడుగట్టిన బీజేపీ వాది సత్యపాల్ మాలిక్ తనను పంపించిన దానికి కమలం పార్టీకి ప్రతిఫలాన్ని అందించేశారు. విపక్షాలకు అవకాశమివ్వకుండా అసెంబ్లీని రద్దు చేయడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా మాలిక్ విమర్శలను ఎదుర్కొంటున్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *