500 కోట్లు రాబట్టిన 2.0

చెన్నై, నవంబర్ 24 : భారీ చిత్రాల దర్శకుడు శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్‌లో వస్తున్న ‘2.0’ విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. నవంబరు 29న ప్రపంచవ్యాప్తంగా సుమారు 10వేల థియేటర్లలో విడుదల అవుతున్న ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ కోసం అభిమానులు వేయి కళ్లలో ఎదురుచూస్తున్నారు. 2010లో వచ్చిన రోబో చిత్రానికి సీక్వెల్‌గా శంకర్ దీన్ని తెరకెక్కించారు. థియేటర్ల విషయంలోనే కాదు.. పెట్టుబడి వసూలులోనూ ‘2.0’ రికార్డుల దుమ్ము దులుపుతోంది. సుమారు రూ.540-550 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలకు ముందే రూ.490కోట్ల ఆదాయం రాబట్టినట్లు తెలుస్తోంది. ‘2.0’కు ఒక్క తమిళంలోనే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.120 కోట్లు వచ్చినట్లు సినీ విశ్లేషకుడు రమేష్ బాలా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.100 కోట్లు రాబట్టిన తొలి తమిళ చిత్రంగా ‘2.0’ రికార్డు నెలకొల్పిందని తెలిపారు. మరోవైపు శాటిలైట్ హక్కుల ద్వారా రూ.120 కోట్లు, డిజిటల్ హక్కుల ద్వారా రూ.60 కోట్లు వచ్చినట్లు సమాచారం. దీనికి తోడు ఉత్తర భారతం, ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ముందస్తు బుకింగ్స్ ద్వారా మరో రూ.190 కోట్లు వచ్చినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ఇవన్నీ కలుపుకొని మొత్తం రూ.490 కోట్లు విడుదలకు ముందే నిర్మాతకు వచ్చినట్లు సినీ వర్గాల సమాచారం. రిలీజ్‌కు ముందే కాసుల వర్షం కురిపిస్తున్న ‘2.0’… ప్రేక్షకుల ముందుకొచ్చిన తర్వాత మరెన్ని రికార్డులు లిఖిస్తుందో వేచి చూడాలి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *