ఇలా అయితే ఎలా..!?

ఆరు తడి పంటలే సాగు చేసుకోవాలా..

మండిపడుతున్న రైతాంగం

నెల్లూరు :  సోమశిల కావలి కాలువ కింద ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలన్న అధికారుల ప్రకటనపై రైతులు మండిపడుతున్నారు. బోగోలులో సోమశిల అధికారులు అవగాహన పేరుతో రైతులను పిలిచి ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించగా వ్యతిరేకించారు. కావలి కాలువకు 5.3 టీఎంసీల వెంటనే వదలాల్సిందేనని పట్టుబట్టారు. ఇప్పటికే మండలాల వారీగా రైతులు, రైతు సంఘాల నాయకులు సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు. సంగం వద్ద కావలి కాలువకు బలవంతంగానైనా నీళ్లు వదలాలన్న పట్టుదలతో ఉన్నారు. మరోవైపు కావలి కాలువలో ప్రస్తుతం పూడిక తీత పనులు జరుగుతుండడంతో అందుకోసమే జాప్యం చేస్తున్నారని, వారి స్వార్థానికి రైతులను బలి చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.
కావలి కాలువలో పూడికతీత పనుల పేరిట మసిపూసి మారేడి కాయ చేసి రూ. కోట్లు దుర్వినియోగం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. గతంలో కాలువ ప్రవాహ స్థాయి 500 క్యూసెక్కులు ఉండగా రూ.30 కోట్ల నిధులతో వెయ్యి క్యూసెక్కులకు పెంచారు. ఈ పనులు 2017కి పూర్తయ్యాయి. బెడ్‌ లెవల్‌ వరకు కాలువ తీశారు. కనీసం 5 సంవత్సరాలయ్యాక పూడిక పనులు చేసే అవకాశం ఉంటుంది. అయినా ప్రస్తుతం కాలువలో పూడిక తీత పనులు చేపట్టి పైపైనే పొక్లెయిన్లతో తీసి పెద్దఎత్తున నిధులు స్వాహా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ పనులు నామినేషన్‌ పద్ధతిన రూ.10 లక్షల చొప్పున కేటాయించి చేస్తున్నారు. గత నెలలో సంగం నుంచి 14వ కి.మీ వరకు రూ.2 కోట్లు ఖర్చు చేశారు. సాగునీరు విడుదల.. చేసేందుకు ఈ నెల 8వ తేదీన ఐఏబీ తీర్మానం చేశాక కాలువలో 14 కి.మీ నుంచి 30 వరకు, 30 నుంచి 50 కి.మీ వరకు అటూ ఇటూ 20 పనులు రూ.10 లక్షల చొప్పున వెచ్చించి చేస్తున్నారు. వాస్తవంగా ఆధునికీకరణ చేశాక 2 సంవత్సరాలు ఆ పనులు చేసిన గుత్తేదారే నిర్వహణ నిధులతో ఇటువంటి పనులు చేయాలి. ఈ నిబంధనా పాటించిన దాఖలాలు కానరావడం లేదు. అంతేకాక కాలువకు రెండువైపులా మట్టిని పైకిలాగి తూతూమంత్రం చేస్తున్నారు. ఈ పనుల కోసమే నీటి విడుదలలో జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కావలి కాలువ కింద పైభాగంలో ఇప్పటికే బోర్ల ఆధారంగా ముందస్తుగా నాట్లు వేశారు. ఇదేవిధంగా ప్రతి పొలంలోనూ నార్లు పోసుకుని సిద్ధంగా ఉన్నారు. ఈ నెల 8వ తేదీన జరిగిన ఐఏబీ సమావేశంలోనూ 5.3 టీఎంసీల నీళ్లు కాలువకు కేటాయించడంతో నీళ్లు వస్తాయన్న ఆశతో ఇంకా నార్లు పోస్తూనే ఉన్నారు. ఈ దశలో అధికారులు ఆయకట్టుకు నీరందదని ఆరుతడి పంటలు వేసుకోవాలని ప్రకటించడంపై దిగులు చెందుతున్నారు. మరోపక్క సోమశిల ప్రాజెక్టు నుంచి డెల్టాకు, దక్షిణ, ఉత్తర కాలువలకు సాగునీరు వదలడం, కావలికాలువకు ఇంకా వదలకపోవడంపై రైతులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కావలిలో వైకాపా నాయకులు, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాలరెడ్డి, మరోవైపు సోమశిల జలాశయం మాజీ ఛైర్మన్‌ మధుబాబునాయుడు కాలువకు నీళ్లు వదలాలని, లేదంటే ఉద్యమాలు చేస్తామని ప్రకటించారు. బోగోలు, జలదంకిలో ఇప్పటికే రైతులతో సమావేశాలు నిర్వహించారు. మంగళవారం దగదర్తి కాట్రాయపాడులోనూ మరోమారు రైతులు సమావేశమయ్యారు. మండలాల వారీగా సంగం ఆనకట్ట వద్దకు చేరుకుని ఆందోళనకు సిద్ధం అవుతున్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *