రావెల ఒక్కరేనా…!

అదే బాటల మరికొందరు …!

కొన్ని జిల్లాల్లో తమ్ముళ్ళ కుమ్ములాటలు

గుంటూరు : రావెల ఒక్కరే ఉన్నారా? మరికొంత మంది అదే బాట పట్టనున్నారా? ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో అంతర్మధనం జరుగుతోంది. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, ఎమ్మెల్యే పదవిని త్యజించి బయటకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అయితే రావెల రూటులో ఎవరున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరాతీస్తున్నారట. రావెల కిశోర్ బాబుది ఊహించిందే అయినా అధికార పార్టీకి ఎదురుదెబ్బ అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. తన సమర్థత, నాయకత్వ పటిమ, ఏపీని అభివృద్ధి బాటలో తీసుకెళ్లగలరన్న నమ్మకంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు వచ్చారని చంద్రబాబు గొప్పలు చెప్పుకునే వారు.రావెల ఇచ్చిన షాక్ తో చంద్రబాబు సయితం ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే వైసీపీ నుంచి వచ్చిన 23 మంది ఎమ్మెల్యేల్లో అధిక భాగం పార్టీ క్యాడర్ తో ఇమడ లేకపోతున్నారు. అక్కడి తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జులకు, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మధ్య పొసగడం లేదు. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈనేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్ దక్కుతుందన్న విషయంలో ఎవరికీ గ్యారంటీ లేదు. అక్కడ ఎవరికి టిక్కెట్ దక్కినా మరొకరు సహకరించుకునే పరిస్థితి అయితే కన్పించడం లేదు.ఈ నేపథ్యంలో రావెల కిశోర్ బాబు పార్టీని వీడటం టీడీపీని ఇబ్బందుల్లో పడేయడంతో పాటు ఆశావహులు కూడా తమ దారి తాము వెతుక్కునే పనిలో పడ్డారు.కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ అక్కడి టీడీపీ ఇన్ ఛార్జితో పడక తాను అనవసరంగా టీడీపీలో చేరానని బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆయన వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరినా కనీసం సభ్యత్వ నమోదుకు కూడా అవకాశం దొరకకుండా పోయింది. ఇక కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే జయరాములు కూడా అక్కడి మాజీ ఎమ్మెల్యే విజయమ్మతో పొసగక ఇబ్బందులు పడుతున్నారు. జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డికి, మంత్రి ఆదినారాయణరెడ్డికి పడటం లేదు. కదిరి నియోజకవర్గం నుంచి వైసీపీ గుర్తు మీద గెలిచిన చాంద్ భాషాకు అక్కడ టీడీపీ ఇన్ ఛార్జి కందికుంట వెంకటప్రసాద్ లు నువ్వెంతంటే నువ్వెంత? అని ప్రశ్నించుకునే పరిస్థితి ఉంది.అధికార తెలుగుదేశం పార్టీ నుంచి మరికొందరు పార్టీ వీడతారని అమరావతిలో టాక్ బలంగా విన్పిస్తోంది. రావెల చేసిన ధైర్యం తామెందుకు చేయలేమంటున్నారు కొందరు. దీనిపై ఇప్పటికే ఇంటలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారని సమాచారం. ఈసారి సర్వేల ఆధారంగా టిక్కెట్ ఇస్తామని చంద్రబాబు నాయుడు తరచూ సమీక్షల్లో చెబుతుండటం, తమ నియోజకవర్గంలో బలమైన పోటీదారులు ఉండటంతో టీడీపీ ఎమ్మెల్యేలు మరికొందరు పార్టీకి త్వరలోనే గుడ్ బై చెప్పేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రకాశం, కడప, కర్నూలు, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు రావెల బాటలోనే పయనించే అవకాశాలున్నాయి. అయితే వారు జనసేన పార్టీలో చేరతారా? లేక వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరతారా? అన్నది వారు కుదుర్చుకునే డీల్ ను బట్టి తేలనుంది. ఇప్పటి వరకూ తన నాయకత్వంపై నమ్మకుందన్న ధీమాగా ఉన్న చంద్రబాబు రావెల నిష్క్రమణతో కంగుతిన్నారని తెలుస్తోంది

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *