జగన్… గురి ఎవరివైపు

గుట్టు చప్పుడు కాకుండా ఇన్ చార్జిల మార్పు 

పాదయాత్ర ముగింపు దశలో వేగం పెంచుతున్న అధినేత 

గుంటూరు :  వైసీపీ అధినేత జగన్ ఇలా ఎందుకు చేస్తున్నారు..? పార్టీ నేతలతో మాట్లాడకుండానే ఇన్ ఛార్జులను మార్చడం వెనక కారణాలేంటి.? కనీసం ఆ లీడర్ మనోగతం తెలుసుకోకుండానే పీకి పారేయడం ఎంత వరకూ సబబు? ఈ ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ నియోజకవర్గాల్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి విన్పిస్తున్నాయి. వైఎస్ జగన్ పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానికంటే కఠిన నిర్ణయాలు అని చెప్పొచ్చు. కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే పార్టీ పుట్టి మునగడం ఖాయమని భావించిన జగన్ ఆ దిశగా ప్రక్షాళనను సరిగ్గా రెండు నెలల ముందు ప్రారంభించారు. ఆయన ఉత్తరాంధ్ర పర్యటన ప్రారంభమయిన వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టారు.సర్వేలు, ప్రజాదరణ ఆధారంగానే ఈసారి అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ఇప్పటికే జగన్ స్పష్టం చేస్తూ వస్తున్నారు. అయితే నిర్ణయాలు తీసుకునేముందు నేతలతో జగన్ మాట్లాడకపోవడం వల్లనే కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. జగన్ పిలిచి మాట్లాడితే సమస్యలు లేకుండా సాఫీగా సాగిపోతుందని చెబుతున్నారు. రెండు నెలలనుంచి జగన్ నియోజకవర్గ ఇన్ ఛార్జులను మారుస్తూ వస్తున్నారు. సర్వే నివేదికల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. తొలుతు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి జగన్ ప్రక్షాళన ప్రారంభించారు.అక్కడ వంగవీటి రాధాను తప్పించి మల్లాది విష్ణును ఇన్ ఛార్జిగానియమించారు. ఆతర్వాత గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గానికి చెందిన లేళ్ల అప్పిరెడ్డిని తప్పించి ఆయన స్థానంలో ఏసురత్నంకు బాధ్యతలను అప్పగించారు. దీంతో లేళ్ల అప్పిరెడ్డి వర్గీయులు వీరంగం సృష్టించారు. తర్వాత కొండపి నియోజకవర్గానికి చెందిన ఇన్ ఛార్జి అశోక్ ను మార్చేశారు. ఆయన ఏకంగా ఆమరణ దీక్షకు తన కార్యాలయంలోనే దిగడం విశేషం. ఇక తాజాగా పెదకూరపాడు నియోజకవర్గ ఇన్ ఛార్జి కావటి మనోహర్ నాయుడిని తొలగించి ఆయన స్థానంలో ఇటీవల పార్టీలో చేరిన నంబూరి శంకరరావును ఇన్ ఛార్జిగా నియమించారు. దీంతో కావటి వర్గీయులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.పార్టీలో రచ్చ రచ్చ అవ్వడానికి జగన్ ఆ నేతలతో మాట్లాడకపోవడమేనని చెబుతున్నారు. ఇన్ చార్జులను మార్చదలిస్తే అప్పటి వరకూ ఇన్ ఛార్జిగా ఉన్న నేతను పిలిపించుకుని సముదాయించి ప్రకటిస్తే బాగుండేదని, అలా చేయకుండా ఉన్నట్లుండి వారికి తెలియకుండానే కొత్త ఇన్ ఛార్జి మారడంతో పార్టీలో నేతలు రగలి పోతున్నారని కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే జగన్ తాను వారితో మాట్లాడతానని చెబుతున్నారని, వారిని మార్చడానికి గల కారణాలను కూడా తెలియజేస్తానని చెబుతున్నా కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని వైసీపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. మొత్తం మీద జగన్ పార్టీ సంక్షేమం కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నా అవి కొన్ని చోట్ల రచ్చకు కారణమవుతున్నాయని చెప్పక తప్పదు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *