గులాబీ బాస్  సుడిగాలి పర్యటన

116 నియోజకవర్గాల్లో క్యాంపెయిన్

హైద్రాబాద్ :  బంగారు తెలంగాణ గమ్యాన్ని ముద్దాడాలంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మళ్లీ రావాలని, అందరూ ఆశీర్వదించాలని ప్రజానీకాన్ని కోరుతున్న టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు.. రాష్ట్రాన్ని సుడిగాలిలా చుట్టేస్తున్నారు. ఆయన పాల్గొన్న వివిధ సభల ద్వారా దాదాపు 46.40 లక్షల మందిని నేరుగా ఓటడిగినట్టు అంచనా. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 116 సెగ్మెంట్లలో ప్రచారానికి ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ‘ప్రజా ఆశీర్వాదసభ’ పేరుతో సెప్టెంబరు 7న ఎన్నికల సమరశంఖం పూరించిన ఆయన అదే జిల్లాలోని సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో డిసెంబరు 5న ప్రచారం ముగించనున్నారు. ప్రచార ప్రయాణంలోనే కేసీఆర్‌ వ్యూహాలను రచిస్తున్నారు. వాటిని అమలు చేసే బాధ్యతను నేతలకు వివరిస్తున్నారు. ప్రజా ఆశీర్వాదసభల నిర్వహణ ఏర్పాట్లపై ఆయా జిల్లాల ముఖ్యనేతలకు, అభ్యర్థులకు ప్రయాణంలోనే ఆదేశాలిస్తున్నారు. గజ్వేల్‌లోని ఇంటి నుంచి ప్రచారానికి వెళ్లి వస్తున్నారు. ఇంట్లోనే ఉదయం అల్పాహారం మినహా అంతా హెలికాప్టర్‌లోనే పూర్తి చేస్తున్నారు. గడియ తీరిక లేకుండా కేసీఆర్‌ ఎన్నికల వ్యూహంలో నిమగ్నమవుతున్నారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరైన ప్రజాఆశీర్వాద బహిరంగసభలో ఒక్కో సెగ్మెంట్‌ నుంచి సగటున 40 వేల మంది హాజరయ్యారు. ఇలా అన్ని సభలకు కలిపి 46.40 లక్షల మందిని కేసీఆర్‌ స్వయంగా మద్దతు కోరారు. ఓటింగ్‌లో ఇది ప్రభావం చూపనుంది’ అని టీఆర్‌ఎస్‌ వర్గాలు ధీమాగా చెబుతున్నాయి. ప్రజాఆశీర్వాదసభ కంటే ముందు నిర్వహించిన కొంగరకలాన్‌సభకు పది లక్షల మంది వచ్చినట్లు టీఆర్‌ఎస్‌ అంచనా. ఇలా గులాబీ దళపతి కేసీఆర్‌ స్వయంగా 56 లక్షల మందికి నేరుగా ప్రభుత్వ పాలనను వివరించి మళ్లీ మద్దతు ఇవ్వాలని కోరారని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో  కేసీఆర్‌ 110 సెగ్మెంట్లలో ప్రచారం నిర్వహించారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ అదే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. సెప్టెంబరు 2న రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ప్రగతి నివేదిన పేరుతో భారీ బహిరంగసభ నిర్వహించారు. అసెంబ్లీ రద్దుకు నాలుగు రోజులు ముందు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ సభకు పది లక్షల మంది తరలి వచ్చారని టీఆర్‌ఎస్‌ అంచనా. సెప్టెంబరు 6న అసెంబ్లీ రద్దయ్యింది. ఆ మర్నాడు హుస్నాబాద్‌లో ‘ప్రజా ఆశీర్వాదసభ’ పేరుతో కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అనంతరం అక్టోబరు 3, 4, 5 తేదీల్లో నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల స్థాయి బహిరంగసభలు నిర్వహించారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అక్టోబరు 19 నుంచి పూర్తి స్థాయిలో ప్రచారం ప్రారంభించారు. అక్టోబరు 24, నవంబరు 1న రెండు రోజులు మినహా రోజూ సగటున నాలుగు నుంచి తొమ్మిది సభల్లో పాల్గొంటున్నారు. మంగళవారం మరో ఐదు సభల్లో పాల్గొననున్నారు. ప్రచార గడువు ముగియనున్న బుధవారం సైతం సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో బహిరంగసభ నిర్వహిస్తున్నారు. మొత్తంగా కొంగరకలాన్‌ ప్రగతి నివేదన బహిరంగసభను మినహాయిస్తే.. 87 బహిరంగసభల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. జగిత్యాలలో 4 సెగ్మెంట్లకు, వరంగల్‌లో 3 సెగ్మెంట్లకు, ఖమ్మం, కరీంనగర్‌లో 2 సెగ్మెంట్ల కు ఒకటి చొప్పున సభ నిర్వహించారు. ఇలా ప్రచారగడువు ముగిసే వరకు కేసీఆర్‌ 116 సెగ్మెంట్లలో ప్రచారం చేయనున్నారు. నల్లగొండ, వనపర్తిలో రెండేసి మార్లు సభల్లో పాల్గొన్నారు. వైరా, భద్రాచలం, అశ్వారావుపేట సెగ్మెంట్లలో ప్రచారం నిర్వహించలేదు.  అసెంబ్లీ సెగ్మెంట్లలోని సామాజిక, రాజకీయ పరిస్థితుల ఆధారంగా ప్రసంగం ఉంటోంది. నియోజకవర్గాల్లోని పరిస్థితులను బట్టి భాష తీవ్రత సైతం మారుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌–టీడీపీ పాలనను, టీఆర్‌ఎస్‌ పాలనను పోల్చి చెబుతున్నారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు చేసిన విషయాలను వివరిస్తూనే.. కొత్తగా నెరవేర్చబోయే హామీలను ప్రకటిస్తున్నారు. ఆసరా పెన్షన్ల పెంపు, మళ్లీ రుణమాఫీ, రైతుబంధు సాయం పెంపు, నిరుద్యోగ భృతి, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు, పెన్షనర్లకు ప్రత్యేక డైరెక్టరేట్‌ వంటి హామీలను ప్రకటిస్తున్నారు. ముస్లిం, గిరిజన, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తూర్పారబడుతున్నారు. 24 గంటల కరెంటు, కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలను ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నుంచి అసెంబ్లీ రద్దు వరకు జరిగిన పరిస్థితులను ఆయన వివరిస్తున్నారు. మైనారిటీలు ప్రభావితం చేసే నియోజకవర్గాల్లో ఉర్దూలో ప్రసంగిస్తున్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *