పార్టీ బలోపేతానికి జన‘సేనా’ని కసరత్తు

విజయవాడ :జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి కమిటీలను నియమిస్త్తున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల నిర్మాణం దాదాపుగా పూర్తయినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. త్వరలో నియోజక వర్గాల ఇన్చార్జిలను నియమించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రజా పోరాట యాత్ర పేరిట ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు గోదావరి జిల్లాల్లో పర్యటనలు పూర్తి చేశారు. పర్యటనలలో పవన్‌ సభలకు విశేష స్పందన వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండటం కూడా దీనికి కారణమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీపై చేపట్టిన నిరసన కవాతు విజయవంతం కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. దీనిని స్ఫూర్తిగా తీసుకుని అనంతపురంలో ఆదివారం చేపట్టిన కవాతు కూడా విజయవంతం కావడంతో జనసేన శ్రేణుల ఉత్సాహనికి అవధులు లేకుండా పోయింది. రాయలసీమ కరువుపై రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సాగిన ఈ కవాతులో వామపక్షాల నేతలు పాల్గొనడం కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. చంద్రబాబు సర్కార్‌ అవినీతిని ఎండగడుతూనే ప్రతిపక్ష వైసిపి నాయకుడు జగన్మోహన్‌రెడ్డిపై కూడా విమర్శల స్వరం పెంచుతూ పవన్‌ పర్యటన సాగుతోంది. 2019 ఎన్నికల్లో టిడిపిని అధికారం లోకి రాకుండా చేయాలనీ, టిడిపి, వైసిపిలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనీ వ్యూహరచన చేస్తోంది. ప్రసుత్తం అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న పవన్‌ ఇకపై మిగిలిన జిల్లాల్లో మొదటి విడత పర్యటనలు చేయడానికి ప్రణాళికలు రూపొంది స్తున్నారు. మాజీ స్పీకర్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్‌తో చేరికతో ఆ స్థాయి నాయకుల చేరికలు పెరిగాయి. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, తాజాగా టిడిపికి చెందిన మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు చేరికలు పార్టీకి బలం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. చేరికలలో సామాజిక సమీకరణలకు కూడా పవన్‌ ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని వర్గాలకూ పార్టీలో అవకాశమివ్వాలన్నది జనసేనాని వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే కృష్ణా జిల్లాకు చెందిన వైసిపి నాయకుడొకరు జనసేనలో చేరడానికి పవన్‌తో టచ్‌లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపి, ప్రస్తుత టిడిపి ఎమ్మెల్యే జనసేనలో చేరడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. 2014 ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా నుంచి వైసిపి టిక్కెట్‌పై గెలిచి టిడిపిలో చేరిన నేత కూడా జనసేనలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలపై దృష్టి పెట్టిన పవన్‌ ఇకపై రాయలసీమ, కోస్తా జిల్లాలపై దృష్టిని కేంద్రీకరించనున్నట్లు తెలిసింది. ఎన్నికల నాటికి జనసేనలోకి భారీగా చేరికలు ఉండొచ్చని భావిస్తున్నారు. టిడిపి, వైసిపిలో టిక్కెట్లు ఆశించి భంగపడిన వారందరూ జనసేన వైపు చూస్తారనే ప్రచారం జరుగుతోంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *