మైకుల బంద్… ప్రచారం పరిసమాప్తం

హైద్రాబాద్ : తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వానికి తెర పడింది. బుధవారం సాయంత్రంతో పార్టీల మైకులన్నీ మూగబోయాయి. సాయంత్రం 4 గంటలకే రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాల్లో ప్రచారం ముగియగా.. మిగిలిన చోట్ల సాయంత్రం 5 గంటలకు మైకులు బంద్ అయ్యాయి. చివరి వరకు పార్టీలన్నీ నువ్వా నేనా అన్నట్లు పోటీపడి మరి ప్రచారం చేశాయి. ప్రధాని నుంచి పార్టీలో కిందిస్థాయి కార్యకర్త వరకు అందరూ ప్రచారంలో బిజీగా గడిపారు. గల్లీ, గల్లీకి తిరుగుతూ ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. బుధవారం గజ్వేల్‌లో జరిగిన సభతో టీఆర్ఎస్ ప్రచారాన్ని ముగిస్తే.. ప్రజా కూటమి కోదాడ బహిరంగ సభతో ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టింది. ఇక రాష్ట్రంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఒపీనియన్‌ పోల్స్‌, సర్వేలపై నిషేధం అమల్లోకి వచ్చింది. బుధవారం సాయంత్రం 7 గంటల నుంచి మద్యం దుకాణాలు బంద్ అవుతాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే, రెండేళ్లు జైలుశిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉంది. ఇక పోలింగ్‌కు 48 గంటలు సమయం మాత్రమే ఉంది. ఈ నెల 7న (శుక్రవారం) ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు.. మిగిలిన ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. తెలంగాణ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో 1,821 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ కోసం.. 32,815 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అత్యధిక పోలింగ్ స్టేషన్లు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో.. అత్యల్పంగా పోలింగ్ కేంద్రాలు భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నాయి. మరోవైపు అత్యధికంగా 42 మంది అభ్యర్థులు మల్కాజ్‌గిరి నియోజకవర్గం బరిలో ఉండగా.. బాన్సువాడలో అత్యల్పంగా ఆరుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 2,80,64,684 మంది మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో తెలంగాణలోని ప్రభుత్వ కార్యాలయాలకు ఈ 7న సెలవు ప్రకటిస్తున్నట్లు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే 7న సెలవు ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మూడు నెలల పాటు హోరెత్తిన ప్రచారం

తెలంగాణనాట ఎన్నికల ప్రచారానికి తెరపడింది. దాదాపు మూడు నెలలుగా హోరెత్తిపోయిన మైక్ లు మూగబోయాయి. తమకే ఓటేయాలంటూ వేడుకోవడంతో పాటూ.. ప్రత్యర్ధులను తీవ్రస్థాయిలో విమర్శించిన వాయిస్ లన్నీ సైలంట్ అయిపోయాయి. కొన్నిగంటల వరకూ ఎన్నికల హంగామాతో గందరగోళంగా ఉన్న వాతావరణం మొత్తం.. ప్రశాంతంగా మారిపోయింది. ఇప్పటివరకూ నేతల హడావిడి నడిచింది. ఇక ప్రజల వంతు వచ్చింది. ఓటర్లంతా పార్టీలు, నాయకుల సామర్ధ్యాలపై దృష్టి సారించారు. మెచ్చిన నేతను ఎన్నుకునే ఆలోచనలో ఉన్నారు. మరికొందరు ఇంకా తేల్చుకోలేదు. టోటల్ గా తెలంగాణ ఎన్నికల ఫేజ్.. మరో స్టేజ్ లోకి వచ్చేసింది. డిసెంబర్ 7నే పోలింగ్ కావడంతో.. అందరి దృష్టీ.. ఓటర్లపైనే ఉంది. నేతలైతే గెలుపు తమదే అంటూ ధీమాగా ప్రకటనలు గుప్పించేస్తున్నా.. వారిలో టెన్షన్ హైరేంజ్ లోనే ఉంది.పోలింగ్‌ ప్రక్రియ ముగియటానికి 48 గంటల ముందుగా ప్రచారానికి తెరదించాలన్నది కేంద్ర ఎన్నికల సంఘం రూల్. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రచారపర్వానికి తెరపడింది. నిర్ధారిత గడువు తరువాత రాజకీయ పార్టీలు ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇదిలాఉంటే పోలింగ్ సజావుగా సాగేందుకు  ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నియోజకవర్గాలకు కేటాయించాల్సిన ఈవీఎంలు, వీవీపీఏటీలను సిద్ధం చేశారు. ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి అయింది. పోలింగ్‌ నిర్వహణకు 32,815 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందరికీ అందుబాటులో ఎన్నికలు  అనే నినాదంతో ఈ దఫా దివ్యాంగులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా పోలింగ్‌ సమయాల్లో సీఈసీ మార్పులు చేసింది. సాధారణ ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్‌ ఉదయం 7 గంటలకే ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. పోలింగ్‌ కేంద్రాలన్నింటినీ ధూమపాన నిషేధ ప్రాంతాలుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. మద్యం సేవించి వచ్చిన వారికి వైద్య పరీక్షలు చేయించి నిబంధనల మేరకు కేసులు నమోదు చేయనున్నారు. ఎన్నికల ప్రశాంత వాతావరణంలో సాగేలా ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇదిలాఉంటే ముందస్తు ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్షం..పవర్ కోసం ఆరాటపడుతున్నాయి. సెప్టెంబర్ 6న ఉన్ననాటి పరిస్ధితి ప్రస్తుతం కనిపించడంలేదు. దీంతో గులాబీదళం చెమటోడ్చక తప్పని పరిస్థితి. ఇప్పటికే వివిధ సర్వేలు.. టీఆర్ఎస్ కష్టపడాల్సిందేనన్న హింట్స్ ఇచ్చాయి. కొన్ని సర్వేలు అధికార పార్టీకి ఢోకాలేదని.. మరోసారి అధికారంలోకి వచ్చేస్తుందని చెప్తున్నా.. తాజా పరిస్థితి మరోలా ఉంది. విపక్షం కూడా పుంజుకోవడంతో.. టీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత ఆందోళన నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ 6న అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు చెప్పారు. దాదాపు 10నెలల పదవీకాలం ఉండగానే ఆయన అసెంబ్లీ రద్దు చేయడం విశేషం. రాష్ట్రంలో తమకు అంతా అనుకూలంగా ఉందన్న ధీమాతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత అక్టోబర్ మొదటివారంలో కేంద్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 7న తెలంగాణలో సింగిల్ ఫేజ్ లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసినప్పుడే అభ్యర్ధుల జాబితానూ ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్ నాయకగణం మొత్తం ప్రచారపర్వంలో మునిగిపోయింది. ఇక సీఈసీ ఎన్నికల షెడ్యూల్ ఇవ్వడంతో ప్రచార జోరు మరింత పెంచేసింది. చాలా లేట్ గా ప్రచారబరిలో దిగినా ప్రతిపక్షం కూడా పుంజుకుంది. దీంతో ఈ ఎన్నికల పోరు రసవత్తరంగా మారిపోయింది. పలు స్థానాల్లో నేతల మధ్య గట్టిపోటీ నెలకొంది.  తెలంగాణ ఎన్నికలను అన్నిపార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. అధికారం కోసం.. రాజకీయ పక్షాలు చేయని ప్రయత్నం లేదు. తమకే ఓట్లేయాలన్న విజ్ఞప్తులతో పాటూ.. ప్రలోభాలతోనూ ఓటర్లకు ఎరవేశాయి. ఏదేమైనా ఓటరు తీర్పే నేతల భవితను నిర్ణయిస్తుంది. ఈ నిర్ణయం ఎలా ఉందో తెలియాలంటే.. డిసెంబర్ 11వరకూ వేచి చూడాల్సిందే. ఎందుకంటే డిసెంబర్ 11నే ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *