జిల్లాలో కరవు బృందం పర్యటన

కొండెపి, కనిగిరి నియోజవర్గాల్లోని
గ్రామాల్లో క్షేత్రస్థాయి అధ్యయనం
గొంతెండుతున్న పల్లెలు
కబేళాలకు పశువులు

ఎండిపోయిన పంటలను పరిశీలిస్తున్న కరువు బృందం

జిల్లాలో కొండపి, కనిగిరి నియోజకవర్గాల్లో కేంద్ర కరవు బృంద సభ్యులు బుధవారం పర్యటించారు. ఢిల్లీ నుంచి వచ్చిన నీరజ్ అడిదాము, బి.సి.వాత్సయా, అజయ్ కుమార్ ల బృందం ముందుగా టంగుటూరు మండలం జమ్ములపాలెం గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామంలో తాగునీటి సౌకర్యం లేదనీ, ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తోందని ప్రజలు తెలిపారు. అనంతరం కొండపి మండలం మిట్టపాలెం గ్రామంలో రైతులతో కరువు బృంద సభ్యులు మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో వరిపంట వేసి నాలుగేళ్ళయిందన్నారు. పూర్తిగా వర్షాధారం పై ఆధారపడిన తమ ప్రాంతంలో కంది, పొగాకు, తెల్ల జొన్న పంటలు పండిస్తున్నట్టు తెలిపారు. పంటలకు సైతం ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. తాగునీరు, పశుగ్రాసం లేక పశువులను కబేళాలకు తరలిస్తున్నట్టు తెలిపారు. కొండపి మండలాల్లో జాళ్లపాలెం , పెద్ద కల్లగుంట గ్రామాల్లో కూడా బృందం పర్యటించింది. మర్రిపూడి మండలంలోని గార్ల పేట ఎస్.టి కాలనీలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. కరువు పరిస్థితుల్లో ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. కనిగిరి మండలం పుణుగోడు గ్రామంలో కూడా పర్యటించారు. తమకు తీవ్రమైన తాగునీటి సమస్య ఉందని ఈ సందర్భంగా ప్రజలు తెలిపారు. కనిగిరి మండలం బల్లిపల్లి గ్రామంలో ఎoడిపోయిన బత్తాయి తోటలను పరిశీలించారు. కరువు బృందం వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, వ్యవసాయ శాఖ జె.డి పి.వి.శ్రీ రామమూర్తి, గ్రామీణ నీటిసరఫరా శాఖ ఎస్.ఇ సంజీవ రెడ్డి, ఉద్యాన వన శాఖ ఏ.డి హరిప్రసాద్, ఏ.పి.ఎం. ఐ .పి ప్రాజెక్టు డైరెక్టర్ రవీంద్ర, మత్వ్య శాఖ జె.డి బలరాం, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశ్వర్లు, భూగర్భ జల శాఖ డి.డి. నాగమల్లేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *