తెలంగాణలో జనసేనాని దారెటు….

గులాబీ దళానికి తిరుగే లేదని ఊహించుకొని ముందస్తుగానే అసెబ్లీ రద్దు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ముందస్తు ఎన్నికలు తీసుకొచ్చి.. ఎలక్షన్స్ లో ఒంటిచేత్తో విజయం సాధించాలని ప్లాన్ చేశారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ప్రజానాడి ఎలా ఉందనేది లెక్కకట్టటంలో కాస్త వెనుక పడ్డారు కేసీఆర్. ఇంతలో మహాకూటమి రూపంలో ఎదురుగాలి వీయడంతో కేసీఆర్ ఊహించని షాక్ తగిలింది. పార్టీలన్నీ కలసికట్టుగా ప్రచారం చేస్తూ ఈ నాలుగేళ్లలో టీఆర్ఎస్ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేంటనేది విశ్లేషిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇందంతా ఇలా ఉంటే.. ఇక తెలంగాణలో పోటీ చేయని జనసేన ఓట్లు ఎవరికి దక్కనున్నాయనే విషయంలో చర్చలు ఉపందుకున్నాయి.మరోవైపు జనసేన ఎటువైపు, జనసైనికులు ఎవరికి ఓటేయ్యాలి అనే దానిపై పవన్ కూడా ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. ఏపీలో టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ రెచ్చి పోతున్నారు జనసేన అధినేత పవన్. అలాగే చేతి గుర్తుపై వీరోచితంగా విరుచుకు పడుతున్నారు. బీజేపీ పై కూడా అదే తంతు. ఇలా చూస్తే ఇక పవన్ కి ఉన్న ఆప్షన్ టీఆర్ఎస్ ఒక్కటే కదా! పైగా గులాబీ బాస్ తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌తో పవన్‌‌కు మంచి స్నేహ బంధం ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే కేసీఆర్‌ను కలవాలంటే మిగతా నాయకులు మాదిరిలాగా అపాయింట్మెంట్లు ఇలాంటి వ్యవహారాలేమీ లేకుండా నేరుగా ప్రగతి భవన్‌‌కు వెళ్లి కలిసేంత చనువు కూడా ఉంది. అంతేకాదు ఒకానొక సందర్భంలో మీడియా ముందే.. టీఆర్ఎస్ పార్టీ ఈ నాలుగన్నరేళ్లలో కొన్నికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టించింది అభిప్రాయపడ్డారు కూడా.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయమని, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తామని తేల్చిన పవన్.. అధికార పార్టీ ఓట్లు చీల్చడం ఇష్టం లేకనే ఇలా వ్యూహరచన చేశారని స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు ఇక్కడున్న ప్రజాకూటమిలో టీడీపీ, కాంగ్రెస్ ఉన్నాయి కాబట్టి వాటికి మద్దతుగా నిలిచే ఛాన్సే లేదు. అంటే దీనిబట్టి చూస్తే ఈ జనసేనాని కారుకే జై కొట్టనున్నారా? లేక ఇంకేమైనా వినూత్న ఆలోచనతో తన సపోర్ట్ ఎవరికనేది చెప్పనున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవలే జనసేన పార్టీ అభిప్రాయాన్ని 5వ తారీఖున తెలియపరుస్తాము అని పవన్ ట్వీట్ కూడా చేశాడు. దీంతో ఆ ప్రకటన కోసం జనసైనికులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి.. ఎప్పుడూ ఆవేశంగా మాట్లాడే పవన్ వ్యూహం ఏంటో?

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *