జన్మభూమికి రండి..అభివృద్ధిలో భాగస్వాములు కండి

దుబాయి ఏపీ ఎన్.ఆర్.ఐ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు
అభివృద్ధి కొనసాగాలంటే సుస్థిర ప్రభుత్వం కావాలి
మద్దతు ఇవ్వాలని కోరిన ముఖ్యమంత్రి

దుబాయి, అక్టోబర్ 21: రాష్ట్రంలో మూడేళ్ల నాడు మీమీ గ్రామాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మేమెలా మార్చేవేశామో వెళ్లి బేరీజు వేసుకోండి’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గల్ప్ లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులను కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామాలను అధునాతనంగా,ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతి ప్రవాసాంధ్రుడు రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. అమెరికాలో మూడు రోజుల పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబు నాయుడు శనివారం గల్ఫ్ పర్యటనకు దుబాయ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్ర తెలుగు వారి సంస్థ (ఎన్.ఆర్.టి) సమన్వయకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. సంక్షోభ కాలంలో అధికారంలోకి వచ్చి సమస్యల సుడిగుండం నుంచి రాష్ట్రాన్ని నెమ్మదిగా బయటికి తీసుకొచ్చామని చంద్రబాబు తెలిపారు. విభజన నాడు 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్తు లోటుతో ఉన్న రాష్ట్రాన్ని ఏడాదికే మిగులు విద్యుత్తు ఉత్పత్తి రాష్ట్రంగా తీర్చిదిద్దామన్నారు. రూ.16 వేల కోట్ల ద్రవ్యలోటుతో నవ్యాంధ్ర ప్రయాణం ఆరంభమైందని, అన్ని సమస్యలను అధిగమిస్తూ కేంద్ర సహాయంతో ముందుకు వెళుతున్నామని చంద్రబాబు వివరించారు. 2029 నాటికి దేశంలో ఆంధ్రప్రదేశ్ ను నెంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకు స్వర్ణాంధ్ర విజన్ రూపొందించి పనిచేస్తున్నామన్నారు. ప్రపంచంలోని ఐదు అత్యంత ఉన్నత నగరాలలో ఒకటిగా రాష్ట్ర రాజధాని అమరావతిని నిర్మిస్తామన్నారు. ఇప్పటి అభివృద్ధిని, సంక్షేమాన్ని కొనసాగించాలంటే రాష్ట్రానికి మరోసారి సుస్థిర ప్రభుత్వ అవసరం ఉందని, అందరూ తనకు సహకరించాలని కోరారు. నంద్యాల ఉప ఎన్నికల ఫలితాల్లో 27 వేల పైచిలుకు మెజారిటీ సాధించి ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలను తిప్పికొడుతూ ఓటర్లు గట్టి తీర్పునిచ్చారని, 80% ప్రజలు తృప్తితో, తమ పరిపాలనపై సంతప్తితో తమకు అండగా నిలవాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పారు తాను ఒక పక్క ముఖ్యమంత్రినని, మరోపక్క పార్టీ అధ్యక్షుణ్ణని, రాష్ట్రానని ఎంత బాగా అభివృద్ధి చేసినా వచ్చే ఎన్నికల్లో మళ్లీ తమకు మద్దతుగా నిలవని పక్షంలో రాష్ట్రం కష్టాల్లో పడుతుందని చంద్రబాబు చెప్పారు.
మీరు డబ్బులు వెచ్చించాలని అడగడం లేదు. మీ ప్రాంత అభివృద్ధి కోసం తగిన సలహాలు, ఉత్తమ పద్ధతులు, సాంకేతికతను తీసుకురావాలి, నిధుల కంటే ఆలోచనలు అత్యంత ముఖ్యం. ప్రభుత్వం గ్రామాభివృద్ధికి అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పిస్తుంది. ప్రభుత్వానికి సహకరించడమే మీ పని.
నాయకత్వం వహించి మీ గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ఊతం ఇవ్వండి. గ్రామాల అభివృద్ధి కోసం ఫైబర్ నెట్, డ్రోన్లు వంటి అధునాతన సాంకేతికతను, పరికరాలను ఉపయోగిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవాసాంధ్రలకు పిలుపునిచ్చారు.అమరావతి రూపంలో ఒక సుందర నగరంగా రాజధానిని తీర్చిదిద్దే అవకాశం వచ్చిందని చెబుతూ ఎడారిలా ఉన్న దుబాయ్‌ని అంతా కలసి భూతల స్వర్గంగా మార్చారని, అదే తమకు స్ఫూర్తి అని ముఖ్యమంత్రి అన్నారు. ‘ఇక్కడ నీళ్లు లేవు, ఉష్ణోగ్రతలు ఎక్కువ, నివాసయోగ్య వాతావరణం ఉండదు, అయినా మీరంతా కష్టపడి ఈ దేశ రూపురేఖలు మార్చారు’ అని ప్రశంసించారు. ‘ఇక్కడ 50 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయి.చమురు, సముద్రం తప్ప ఏమీ లేదు. ఆ ఉప్పునీటిని మంచినీటిగా మార్చాలి. విద్యుత్తు లేదు. ఇన్ని ప్రతికూలతల మధ్య ఉన్న దుబాయిని స్వర్గంగా చేశారు. ఇదొక సంకల్పం తప్ప మరొకటి కాదు’ అని చంద్రబాబు అన్నారు. ‘మీరు కష్టపడి ఇక్కడి నుంచి మీ మీద ఆధారపడిన మీ వాళ్లకు డబ్బు పంపిస్తున్నారు’ అంటూ ప్రశంసించారు. మన రాష్ట్రంలోని 5 కోట్ల జనాభాలో విదేశాల్లో ఉన్న మనవాళ్లు 25 లక్షలమంది ఉన్నారని, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మనవాళ్లున్నారని, ఉన్నత స్థానాలకు ఎదిగారని, ఇది తనకు ఎంతో గర్వకారణం గా ఉందని చంద్రబాబు కొనియాడారు. ‘ప్రతి 20 మందిలో ఒకరు విదేశాల్లో ఉన్నారని, అన్ని కంపెనీల్లో పనిచేస్తున్నారని, అది మన శక్తి, మన తెలివి తేటలన్నారు.ఇక్కడ అవకాశాలు వచ్చాయి. చాలా మంది చిన్న ఉద్యోగాలు చేస్తున్నవారున్నారు. గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసాలకు గురై బాధపడుతున్నవారున్నారు.నేనొక్కటే ఆలోచన చేశాను. ఏపీలో ఉండే తెలుగువారే కాకుండా మన తెలుగువారు ఎక్కడ ఉన్నా వాళ్లందరికీ నేను ముఖ్యమంత్రి కాబట్టి ఎక్కడ ఎవరికి సమస్య వచ్చినా వారిని ఆదుకోవాలని నిశ్చయించాను. డబ్బులు ముఖ్యం కాదు. మనవాళ్లకు బ్రహ్మాండమైన తెలివితేటలు, శక్తి , సామర్ధ్యం ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుందాం. అనేక దేశాల్లో ప్రవాసాంధ్రులున్నారు. 109 దేశాల్లో ఏపీ ఎన్నార్టీలోకి 45,000 మంది వచ్చారు. మన తెలుగు సంఘాల వారు సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఇక్కడ పండుగలు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పండుగలు జరుపుతున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటోంది. వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఏపీ ఎన్.ఆర్.టీ మీ అందరినీ సంఘటితపరిచే శక్తి. తెలుగువారికి ప్రపంచంలో ఎక్కడా అన్యాయం జరగకుండా చూస్తుంది. ఇప్పటికే చాలా సంఘాలు పనిచేస్తున్నాయి. ఏపీ ఎన్నార్టీ ప్రభుత్వ సంస్థ అని చంద్రబాబు తెలిపారు. తాను అధికారం చేపట్టాక రాజధాని లేదు. పరిశ్రమలు లేవు. విశ్వశ్రేణి విద్యాసంస్థలు, విజ్ఞాన సంస్థలు లేవని వివరించారు. ఆరోజు హైదరాబాద్ లో సైబరాబాద్ నిర్మించి ఐటీని అభివృద్ధి చేశాను కాబట్టి ఈరోజు ఒక నాలెడ్జి ఎకానమీ వచ్చిందని, ఒక్కో ఐటి కంపెనీ, సంస్థ రావాలంటే ఎంత కష్టపడ్డానో తనకు తెలుసునన్నారు. సమస్యల సుడిగుండం నుంచి బయటికి వస్తున్నామని, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదుగుతుందని చంద్రబాబు దృఢంగా చెప్పారు. అభివృద్ధిలో దుబాయ్‌ని, సింగపూర్ లాంటి అత్యంత నివాసయోగ్య దేశాలుగా తీర్చిదిద్దిన చిన్నదేశాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మనదేశంలో జన్మభూమి ఎంత ముఖ్యమో కర్మభూమి కూడా అంతే ముఖ్యమని, పనిచేసే దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారే. సంపద ఇవ్వటం ముఖ్యం కాదని, పిల్లలకు చదువు, సంస్కారం నేర్పించండి. వందలు, వేల కోట్ల రూపాయలు మన పిల్లలే సంపాదిస్తారని తాను ఏనాడో చెప్పానని, ఇవాళ సిలికాన్ వ్యాలీలో ఎక్కువ సంపాదించేది మన పిల్లలేనంటూ. అక్కడ తలసరి ఆదాయంలో మన వాటా ఎక్కువని ముఖ్యమంత్రి వివరించారు.ఎన్. ఆర్.టి పెట్టింది ప్రవాసాంధ్రులుఅభివృద్ధి కోసమేనని, ఒకప్పుడు సమస్యలుంటే ఫోన్ చేయాల్సి ఉండేది. ఇప్పడు నేరుగా హెల్ప్ లైన్ తెచ్చామని చంద్రబాబు చెప్పారు. అత్యవసరంగా మిమ్మల్ని ఆదుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆ హెల్ప్ లైన్ ద్వారా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీరామారావు అని, ఆయన ఒక వ్యక్తి కాదు. ఒక వ్యవస్థ అని, తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో వుండే ఏకైక వ్యక్తి ఎన్టీరామారావు అని ముఖ్యమంత్రి నివాళులర్పించారు. ఉద్యోగాలు దురదృష్ట వశాత్తూ కోల్పోయి కట్టుబట్టలతో రావాల్సిన పరిస్థితి వస్తే చేయూతనివ్వడానికి ఎన్. ఆర్. టీ విధివిధానాలను రూపొందిస్తోందన్నారు. ప్రవాసాంధ్రులను ఆదుకుంటామని చెప్పారు. గ్రామాలను అన్ని సదుపాయాలతో ఆధునాతనంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ‘దుబాయ్ బాగుందా, విశాఖ బాగుందా?’ అని ప్రశ్నిస్తే ఓ అమ్మాయి విశాఖ బాగుందని సమాధానమిచ్చిందని, ఇది తమకెంతో గర్వకారణమన్నారు. రాష్ర్టంలో కరెంటు ఇస్తున్నాం, గ్యాస్ ఇస్తున్నాం, మరుగుదొడ్లు నిర్మించి ఇస్తున్నాం.

ఆహారంతోపాటు అయిదు భద్రతలు

ఆహారం సహా 5 భద్రతలు కల్పిస్తున్నామని సీఎం వివరించారు. ఏపీలో 80% ప్రజలు తృప్తిగా ఉండాలి, రియల్ టైమ్ లో పరిష్కారం చేస్తున్నాం. రాజకీయంగా కూడా నూటికి 80% తమ పార్టీనే ఉండాలని కోరుకుంటున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ప్రస్తుతం అమలు జరుగుతున్న అభివృద్ధి కోసం సుస్థిర ప్రభుత్వం రావాలి. మళ్లీ మాకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అమరావతికి ఎమిరేట్స్ నేరుగా విమానం వస్తుంది. అన్ని ప్రాంతాలను కనెక్ట్ చేస్తున్నాం అని సభికుల హర్షధ్వానాల మధ్య చంద్రబాబు ప్రకటించారు. తాము గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇమ్మిగ్రెంట్స్‌కు చేయగలిగినంత కంటే ఎక్కువ ప్రయోజనం చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నానని, ఇందుకోసమే నేను అధికారంలోకి రాగానే ఏపీ ఎన్నార్టీ ని నెలకొల్పానని చంద్రబాబు గుర్తు చేశారు. గల్ఫ్ లో ఉన్న ఆంధ్రుల సమస్యలను గుర్తించి అధ్యయనం చేయమని కోరానని, వాళ్ల సమస్యల పరిష్కారానికి సూచనలు అడిగినట్లు వివరించారు. ఇక్కడ నివసించే మనవాళ్లకు సాధికారత కల్పించడం కోసం ఏపీ ఎన్నార్టీ సహకారం అందిస్తోంది. మన రాష్ట్రానికి వచ్చినా స్థిర పడాలనుకున్నా, లేదా పనిచేస్తున్న దేశాలలో ఎంటర్ ప్రెన్యూర్లుగా ఎదగడానికైనా ఏపీ ఎన్నార్టీ తోడ్పడుతోందని సీఎం అన్నారు. ‘మీలో అనేకమంది ఏపీ ఎన్నార్టీ తో కలసి పనిచేస్తున్నారు. ఇలా ఏపీ ఎన్నార్టీ లో 109 దేశాల నుంచి 45,000 మంది సభ్యులయ్యారు. సమస్యల పరిష్కారానికి, సమస్యల నిరోధానికి APNRT ఒక వేదికగా నిలిచిందని సీఎం చెప్పారు. విదేశాలల్లో ఉన్న మన రాష్ట్రం వారు దురదృష్టవశాత్తూ సమస్యల్లో ఉన్నా, ఆపదల్లో చిక్కుకున్నా వారికి తక్షణ సాయానికి బడ్జెట్ లో రూ.40 కోట్లను కేటాయించామన్నారు. ప్రవాసాంధ్ర హెల్ప్ లైన్’ పేరుతో 24 గంటలూ సేవలందించే ఒక ‘హెల్ప్ లైన్’ ప్రారంభించాలని ఏపీ ఎన్నార్టీ కి సూచించామని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర వనరులను ఉపయోగించి సమస్యల్లో చిక్కుకున్న వారిని గుర్తించి సహాయపడటంలో ప్రవాసాంధ్ర హెల్ప్ లైన్ లో పనిచేసే వారికి శిక్షణ అందించామని, ప్రవాసాంధ్ర భరోసా’ పేరుతో ఒక బీమా పథకం తీసుకొచ్చామని, . దురదృష్టవశాత్తు చనిపోయినా, ప్రమాదవశాత్తూ గాయపడినా, వైకల్యం సంభవించినా, జబ్బులు వచ్చినా, న్యాయపరమైన చిక్కులు ఎదురైనా ఆదుకుంటున్నట్లు సీఎం వివరించారు. ఇక్కడి మైగ్రెంట్స్ కేవలం ఏడాదికి రూ. 50 ప్రీమియం చెల్లిస్తే చాలని, మిగతాది ప్రభుత్వం చెల్లిస్తుందని, దుదృష్ట వశాత్తు చనిపోతే రూ..10 లక్షల బీమా, రూ. లక్ష వరకు ఆరోగ్య బీమా, లీగల్ ఇన్సురెన్స్ కింద రూ.45,000 అందిస్తున్నామని, ఇక్కడ నివసించే మన రాష్ట్ర మహిళలకు మెటర్నిటీ బెనిఫిట్స్ అందిస్తున్నామని సీఎం తెలిపారు. ఇక్కడికి వలస వచ్చిన వారిని అత్యవసరంగా సహాయం అందించేందుకు ‘ప్రవాసాంధ్రనిధి’ ఏర్పర్చినట్లు చెప్పారు. గల్ఫ్ లో ఉన్న మన వాళ్ల నైపుణ్యాలు మెరుగుపర్చేందుకు మైగ్రెంట్ ఎకనమిక్ రిహాబిలిటేషన్ సెంటర్ స్థాపిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడికి వచ్చి సంపన్నులైన వారు జన్మభూమికి సహాయపడవచ్చని,. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మీరెలా భాగస్వాములు కావచ్చో ఏపీఎన్నార్టటీ మార్గదర్శనం చేస్తుందన్నారు.సమావేశంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, కొల్లు రవీంద్ర, ప్రభుత్వ సలహాదారు డా. పరకాల ప్రభాకర్, ఎపీఎన్నార్టీ నుంచి వేమూరి రవి తదితరులు పాల్గొన్నారు. ప్రవాసాంధ్రుడు నల్లూరు వెంకట శేషయ్యరూ. 25 లక్షలు, శ్రీరాం, రేఖ దంపతులు రూ.12 లక్షల చెక్ ను ఏపీ ఎన్నార్టీకి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందజేశారు. సమావేశంలో కువైట్, బహ్రెయిన్, దుబాయ్, అబుదాబీ నుంచే కాకుండా ఇటలీ నుంచి వచ్చిన ఒక ప్రవాసాంధ్ర బృందం కూడా పాల్గొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *