రూ.700 కోట్లతో విశాఖల స్పూపర్ స్పెషాలిటీ ఈఎస్ఐ ఆస్పత్రి

విజయనగరం, కాకినాడ, గుంటూరు, పెనుగొండలో

100 పడకల ఆస్పత్రులు మంజూరు
త్వరలో 16 డిస్పెన్సరీలు ప్రారంభానికి చర్యలు
మంత్రి పితాని సత్యనారాయణ వెల్లడి

సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు కార్మిక సంక్షేమంలో ముందున్నామని కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ స్పష్టం చేశారు. కార్మిక చట్టాలను సరళీకరిచడం ద్వారా, సులభతర వ్యాపార విధానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేశంలోనే మొదటి స్ధానంలో నిలిచిందని పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పితాని మాట్లాడుతూ ఆన్లైన్ ఇంటిగ్రేషన్ సిస్టమ్, లైసెన్స్ విధానాలను సరళీకరించడం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. చట్టాలను సవరించడం ద్వారా షాపులు, దుకాణాల్లో 365 రోజులు పనిచేసుకునే వెలుసుబాటు కల్పించామన్నారు. రాత్రి 12గంటల వరకు ఫుడ్ కోర్టులు పెట్టుకోవడానికి అనుమతించడం ద్వారా అందరికీ అందుబాటులో ఆహారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఫలితంగా పర్యాటకం కూడా అభివృద్ధి చెందుతుందని పితాని చెప్పారు. మహిళలు కూడా రాత్రిపూట పనిచేసుకునే అవకాశం కల్పించామని, వారికి ఇచ్చే మెటర్నిటీ సెలవులను 12 నుంచి 26 వారాలకు పెంచామని మంత్రి గుర్తుచేశారు. కనీస వేతన బోర్డు తన నివేదికను ఈ నెలాఖరుకు ఇస్తుందని కొత్తగా కనీస వేతనాలను కూడా త్వరలో ప్రకటిస్తామని పితాని తెలిపారు. రాష్ట్రంలో 2 కోట్ల, 57 లక్షల మంది చంద్రన్న బీమా పథకంలో చేరారని మంత్రి పితాని వెల్లడించారు. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచీ నేటికి 2 లక్షల మందికి రూ.2 వేల కోట్ల పరిహారం అందించామని ఆయన ప్రకటించారు. సన్న, చిన్నకారు రైతులకు కూడా చంద్రన్నబీమా పథకం వర్తింపచేస్తున్నామని మంత్రి గుర్తుచేశారు. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలలోపు వారి సహజ మరణానికి రూ.2 లక్షలు పరిహారం ఇస్తున్నామని తెలిపారు. 18 నుంచి 70 సంవత్సరాల వారు ప్రమాదంలో చనిపోతే చంద్రన్నబీమా కింద రూ.5 లక్షలు, పూర్తి అంగవైకల్యం అయితే రూ.5 లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.2.5 లక్షల పరిహారం అందిస్తున్నట్లు మంత్రి పితాని తెలిపారు.  కార్మికుల సంక్షేమానికి అనేక ఈఎస్ఐ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నట్టు మంత్రి పితాని తెలిపారు. తిరుపతిలో 50 పడకల ఈఎస్ఐ ఆస్పత్రిని 100 పడకలకు పెంచుతున్నట్టు మంత్రి ప్రకటించారు. రూ.700 కోట్లతో విశాఖలో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారని మంత్రి తెలిపారు. కేంద్ర నిధులతో విశాఖ ఆస్పత్రి నిర్మాణ పనులు త్వరలో చేపడతామని చెప్పారు. విజయనగరం, కాకినాడ, పెనుగొండ, గుంటూరు నగరాల్లో వంద పడకల ఆస్పత్రులు మంజూరు చేశామన్నారు. త్వరలో 12 ఆస్పత్రులను ప్రైవేటు భవనాల్లో ప్రారంభించడానికి సిద్దంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో 16 ఈఎస్ఐ డిస్పెన్సరీలు అభివృద్ధి చేపట్టామని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఐటీఐ కాలేజీలను అభివృద్ధి చేసేందుకు అవసరమైన సూచనలు చేసేందుకు నోడల్ ఏజన్సీని నియమించామని మంత్రి పితాని వెల్లడించారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *