ఏపీలో పెట్టుబడులకు రెడీ

అబుదాబీ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ సంసిద్ధత
ఏడీఐఏ బోర్డుతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ
మౌలికసదుపాయాల రంగంపై ఏడీఐఏ కు ఆసక్తి
భారత్ లో మిలియన్ డాలర్ల పెట్టుబడి
అందులో అత్యధికంగా ఏపీలో పెట్టాలని కోరిన సీఎం

అబుదాబీ, అక్టోబర్ 23: భారత్‌లో మౌలిక సదుపాయాల రంగంలో బిలియన్ డాలర్ల పెట్టుబడులకు అబుదాబీ ఇన్వెస్టుమెంట్ అథారిటీ (ఏడీఐఏ) సుముఖంగా ఉంది.ఇందులో అత్యధిక భాగం ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఏడీఐఏ సంసిద్ధత వ్యక్తం చేసింది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన విదేశీ పర్యటనలో 6వ రోజు సోమవారం అబుదాబీలో పర్యటించారు.ఈ క్రమంలో ఆయన అబుదాబీ ఇన్వెస్టుమెంట్ అథారిటీ (ఏడీఐఏ) బోర్డు డైరెక్టర్స్ మెంబర్ ఖలీల్ ఫౌలాతి, కార్యనిర్వాహక వర్గం అత్యున్నత స్థాయి సభ్యులతో చర్చలు జరిపారు.భారత్‌లో పెట్టుబడులకు తాము సుముఖంగానే ఉన్నామని ఖలీల్ ఫౌలాతి వివరించారు.మౌలిక సదుపాయాల రంగంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుపగా, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ఖలీల్ ఫౌలాతి అందుకు సానుకూలత వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ యుఏఈ అభివృద్ధి చెందిన విధానాన్ని తామెంతో స్ఫూర్తిగా భావిస్తున్నామని ప్రశంసించారు.ఒకప్పుడు దుబాయ్ అంటే ఎడారి అనుకునేవాళ్లు, ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలకు దుబాయ్ ఒక ఒయాసిస్సులా కన్పిస్తోందని, ఆశాకిరణంగా మెరిసిపోతోందన్నారు . తాను గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు అక్కడ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేది, అటువంటి సంక్లిష్ట సమయంలో సంస్కరణలతో సంక్షోభాన్ని అధిగమించినట్లు గుర్తు చేశారు.అదే విధంగా ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తనకు సంక్షోభం, సమస్యలు స్వాగతం పలికాయని, ఆ సంక్షోభాన్నే అవకాశంగా తీసుకుని ముళ్ల కిరీటంతోనే ముందడుగు వేశామని వివరించారు.తమ దార్శనిక విధానంలో ప్రాధాన్యతల వారీగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి అద్భుత ఫలితాలు సాధిస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. తన కృషి ఫలితంగా ప్రపంచంలోనే తొలిసారిగా 35 వేల ఎకరాల భూమిని సమీకరణ విధానంలో రైతులు రాజధానికి నిర్మాణానికి ఇచ్చారని అన్నారు.రూ.40 వేల కోట్ల విలువైన భూమిని సేకరించి రైతులను రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వాములను చేశామని ముఖ్యమంత్రి వివరించారు.తమ రాష్ట్రంలో 15% వృద్ధి రేటును లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, 15 సంవత్సరాల పాటు ఈ వృద్ధిని సుస్థిరంగా కొనసాగించాలని నిశ్చయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.భారత్ జాతీయ సగటుకంటే రెట్టింపు కంటో తాము సాధించిన వృద్ధిరేటు రెట్టింపు అని, దేశంలో వ్యాపార, వాణిజ్య అనుకూలత కలిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ బ్యాంక్ నెంబర్ వన్ ర్యాంక్ ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు తెలిపారు.రాజధాని నిర్మాణానికి బృహత్తర ప్రణాళికను సింగపూర్ రూపొందించి ఇచ్చిందని తెలిపారు.సింగపూర్‌కు సైతం స్ఫూర్తిదాయక చరిత్రను కలిగి వుందని అన్నారు.ఇండియా హ్యాపెనింగ్ ప్లేస్ అని, అందులో ఆంధ్రప్రదేశ్ ముందుందని చెప్పారు.భారత్, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత కలిగిన మానవ వనరులతో కూడి ఉందని, తమ మానవ వనరుల సామర్ధ్యం ప్రపంచానికి తెలిసునని చెప్పారు.రాష్ట్రాభివృద్ధిపై తాము స్పష్టమైన దార్శనికతతో ఉన్నామని, తమకు ఉన్న సహజవనరులు, సుదీర్ఘ సముద్రతీరం, రోడ్డు, రైలు, అంతర్గత జల రవాణా మార్గాలు మరే రాష్ట్రానికి లేవని చంద్రబాబు తెలిపారు.ఆంధ్రప్రదేశ్‌లో ఖనిజ సంపద అపారంగా ఉందని, వ్యవసాయంలో ము అగ్రగామిగా ఉన్నామని చంద్రబాబు వివరించారు.అద్భుత జలవనరులు, మిగులు విద్యుత్తు, నవీన సాంకేతికతలో తాము అగ్రభాగాన ఉన్నామని చెప్పారు. బ్లోక్ చైన్, ఫిన్ టెక్, ఇ-ఆఫీసు, ఫైబర్ నెట్, ఆటోమేషన్, వర్చువల్ క్లాస్‌రూమ్స్, రియల్‌టైమ్ గవర్నెన్స్ తమ రాష్ట్రంలో అమలులో ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.ప్రజా సమస్యలు, అవసరాలు నేరుగా తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన పాలనా విధానాలతో ముందడుగు వేస్తున్నట్లు వివరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు బృందంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, కొల్లు రవీంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు డా పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి జి. సాయిప్రసాద్, ఇంధన వనరులు, మౌలిక సదుపాయాల విభాగం ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్, సాల్మన్ అరోకియా రాజ్, ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు సిఇఓ జాస్తి కృష్ణ కిశోర్, వేమూరి ప్రసాద్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *