రైతన్నలపై పెథాయ్ పిడుగు

గుంటూరు : పెథాయ్ తుపాను రైతుల గుండెల్లో గుబులు పెంచింది. టైఫూన్ ధాటికి జిల్లాలో విస్తారంగా వానలు పడ్డాయి. దీంతో చేతికి వచ్చిన పంట తడిసి ముద్దైంది. అన్ని పొలాల్లోని పైర్లనూ ఒకేసారి కాపాడుకోవాల్సి రావడంతో కూలీల కొరత ఏర్పడింది. పంటను రక్షించుకునే వీలు రైతులకు అందుబాటులో లేకుండాపోయింది. దీంతో పలు ఎకరాల్లో పంట నీటమునిగినట్లు సమాచారం. తుపాను ప్రభావం అంతగా ఉండదని ముందుగా అనుకున్నా వాన జోరు పెరిగింది. తీవ్రమైన చలి గాలులు, వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. శని, ఆదివారాల్లో రైతులు ఇంటిల్లపాది తమ పొలాల్లోకి ఉరికారు. చిన్నపిల్లలు సైతం తమ తల్లిదండ్రులకు సాయంగా పనుల్లో నిమగమై వరి పనలను కట్టలు కట్టి కుప్పలేశారు. అయితే కొందరు రైతులు పంటను కాపాడుకున్నా పలువురు రైతులను పెథాయ్ కష్టాల్లోకి నెట్టింది. మరోవైపు.. తుపాను బలపడుతుందన్న వార్తలతో ఆదివారమే కొందరు రైతులు యంత్రాలతో కోసిన ధాన్యాన్ని ఉప్పుడు బియ్యం తయారీ మిల్లులకు విక్రయించుకున్నారు. వరితో పాటూ పలు పంటలపై తుపాను ప్రభావం చూపింది. బాపట్ల నియోజకవర్గంలో వేల ఎకరాల్లోని వరి, వేరుశనగ, మిరపతోటలు దెబ్బతిన్నాయి. వాస్తవానికి నియోజకవర్గంలోని 65327 ఎకరాల్లో వరి సాగుచేశారు. దాదాపు 10000 ఎకరాల్లో యంత్రాల ద్వారా కోతలు పూర్తి చేసినట్లు సమాచారం. 36వేలకు పైగాఎకరాల్లో ఇంకా కోతలే ప్రారంభించలేదు. తుపాను ప్రభావంతో ఈ పంట దెబ్బతినే ఉంటుందని అంచనా.
బాపట్ల నియోజకవర్గ పరిధిలో వేల ఎకరాల్లో పంట జనవరి నాటికి కోతకొస్తుంది. పెథాయ్ తుఫాను ప్రభావం దీనిపై పడడంతో రైతులు ఆవేదనలో కూరుకుపోయారు. పెథాయ్ ఎఫెక్ట్ వ్యవసాయరంగంపైనే కాక మత్స్యరంగంపైనా పడింది.
వర్షానికి ఎండబెట్టిన చేపలకు నష్టం వాటిల్లిందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. తుపాను నేపథ్యంలో వేట సక్రమంగా సాగక, అరకొర వేటతో వచ్చిన సరుకు ఆరబోసుకుంటే వర్షాలకు కొంతమేర దెబ్బతిందని వాపోతున్నారు. ఇదిలాఉంటే రాష్ట్రంలో పెథాయ్ నష్టంపై సత్వరమే అంచనా వేసేలా అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ నెల 20వ తేదీ కల్లా నష్టపరిహారాన్ని రైతులకు అందించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మత్స్యకారులకు నిత్యావసరాల ప్యాకేజ్ అందజేయాలని, తీర ప్రాంతాల్లోని అన్ని గ్రామాల్లో ప్యాకేజ్ ఇవ్వాలని ఆదేశించారు. వర్ష ప్రభావం ఉన్న గ్రామాల్లో క్లోరినేషన్ చేయించాలని అన్నారు. బాధితులకు అన్నిరకాలుగా అండగా ఉండాలని సత్వర సాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *