రక్షిత భవనాలపై దృష్టి సారించండి..

గుంటూరు : పెథాయ్ తుపాను ప్రభావం ఏడు జిల్లాలపై ఉంది. బాధిత జిల్లాల్లో గుంటూరు సైతం ఉంది. ఇదిలాఉంటే తుపాను అనగానే ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అధికార యంత్రాంగం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం సహజం. పెథాయ్ నేపథ్యంలో జిల్లాలో మరోసారి ఈ కేంద్రాలపై చర్చ ప్రారంభమైంది. అసలు సంగతి ఏంటంటే.. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు ఆశ్రయం కల్పించే నిమిత్తం రక్షిత భవనాలను నిర్మించారు. అయితే ఇవి శిథిలమయ్యాయి. తీరప్రాంతాల్లోని పలు రక్షిత భవనాలు కుప్పకూలే స్థితికి చేరుకున్నాయంటే ఆశ్చర్యపోనవసరంలేదు. వీటిని సంరక్షించే చర్యలులేక.. పటిష్ట పరచే చర్యలు అంతకన్నా లేక ఆవాసానికి ఏమాత్రం పనిరాని విధంగా ఉన్నాయి. 1977 నవంబర్‌ తుపాను అనంతరం జిల్లాలోని సముద్రతీర ప్రాంత గ్రామాల్లో ప్రభుత్వంతో పాటు పలుస్వచ్ఛంద సేవా సంస్థలు తుపాను తాకిడి నుండి కాపాడేందుకు తీర ప్రాంతాల్లోని అనేక గ్రామాల్లో తుపాను రక్షిత భవనాలను నిర్మించారు. నాలుగు దశాబ్ధాల పైబడిన తుపాను రక్షిత భవనాలు శిథిలావస్థకు చేరి కొన్నిచోట్ల కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిని నిర్లక్ష్యంగా వదిలేయడంతో పాటూ పునర్‌నిర్మించే యోచన సైతం సంబంధిత యంత్రాంగం చేయడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సూర్యలంక, కర్లపాలెం మండలం తుమ్మలపల్లి మండల కేంద్రమైన నిజాంపట్నంలో దాదాపు రూ.2.50 కోట్లతో రక్షిత భవనాలను నిర్మించారు. ప్రస్తుతం తీరప్రాంత గ్రామాల ప్రజలను తుపాను తాకిడి నుండి రక్షించి వారికి తాత్కాలిక ఆశ్రయం కల్పించేందుకు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాల భవనాల్లో ఏర్పాట్లు చేశారు. నిర్మాణ రంగంలో సాంకేతికతను జోడించి ఆయా పాఠశాల భవనాల కంటే పటిష్టంగా గ్రామాల్లోనే భవనాలను నిర్మించి ప్రజల ప్రాణాలను కాపాడాలని కొందరు అంటున్నారు. తుపాన్లు వచ్చినప్పుడు ప్రభుత్వాధికారులు తీరప్రాంతవాసులను బస్సుల ద్వారా సురక్షిత ప్రాంతాలకు చేర్చుతారు. ఈ క్రమంలో కొందరు స్వస్థలాలు వీడేందుకు ఇష్టపడడం లేదు. ఇలాంటివారు తమ గ్రామల సమీపంలోనే రక్షిత భవనాలు నిర్మిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. తుపాన్ల సమయంలో బడుగు జీవులకు తలదాచుకునేందుకు పటిష్టమైన భవనాలు లేకపోవడంపై పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తుపాను, ఇతర ప్రకృతి విపత్తుల సందర్భంలో తలదాచుకోడానికి ఉపకరించే భవనాల నిర్మాణంపై ఇప్పటికైనా శ్రద్ధ పెట్టాలని అంతా కోరుతున్నారు.

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *