జలసమాధి

16 మందిని మింగిన కృష్ణా
గల్లంతయిన వారి కోసం కొనసాగుతున్న గాలింపు

కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్‌ వద్ద పవిత్ర సంగమం ప్రాంతంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం రివర్‌బే సంస్థకు చెందిన పర్యాటకుల బోటు కృష్ణానదిలో తిరగబడింది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 40 మంది పర్యాటకులు బోటు డ్రైవర్‌ ఉన్నారు. వారిలో 15 మందిని రక్షణ సిబ్బంది, స్థానికులు కాపాడారు.మిగిలిన వారికోసం కోసం గాలింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 16 మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన 10 మంది కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలతో గాలింపు చేపట్టారు.పర్యాటక బోటులో ఉన్నవారిలో 32 మంది ఒంగోలు వాసులు, 8మంది నెల్లూరు వాసులుగా గుర్తించారు. ఘటనపై జిల్లా కలెక్టర్‌, ఉన్నతాధికారులు స్పందించారు.పర్యాటకుల బోటు భవానీద్వీపం నుంచి పవిత్ర సంగమం ప్రదేశానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.ప్రమాదం జరిగిన ప్రదేశంలో లోతు ఎక్కువగా ఉండటం, బోటులో ఉన్న వారికి లైఫ్‌ జాకెట్లు లేకపోవడంతో ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది. బోటులో ఉన్న 40 మంది పర్యాటకులు ఒకవైపునకు కూర్చోవడంతో ఫెర్రీఘాట్‌ వద్ద మలుపు తిరుగుతున్న సమయంలో ఒక్కసారిగా బోటు తిరగబడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బోటు తిరగబడటంతో దానికిందే ఇరుక్కు పోయి వూపిరాడక నీటమునిగి చనిపోయినట్లు తెలిపారు.ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.రాత్రి సమయం కావడం, చలి ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడుతోంది.ప్రత్యేక ఫ్లడ్‌ లైట్ల వెలుతురులో తిరగబడిన బోటును సరిచేసేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.ఫెర్రీఘాట్‌ నుంచి ప్రకాశం బ్యారేజి వరకు విహారయాత్రకు కొన్ని ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో నిత్యం పర్యాటకులు కృష్ణానదిలో విహార యాత్రకు వస్తున్నారు. ప్రమాదానికి గురైన బోటుకు ఎలాంటి అనుమతి లేదని అధికారులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. పర్యాటకుల కోసం బోటు నిర్వాహకులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదని గుర్తించారు. రివర్‌బే సంస్థ తొలిసారిగా ఇవాళే రాయపూడి నుంచి పవిత్ర సంగమం వరకు బోట్‌ షికారు నిర్వహించాలని ట్రయల్‌ నిర్వహించిందని, తొలిసారి వచ్చిన బోటే ప్రమాదానికి గురైందని స్థానికులు చెబుతున్నారు.

మంత్రి పరామర్శ

విజయవాడ: ఫెర్రీ ప్రమాద ఘటనా స్థలాన్ని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు. పడవ ప్రమాదం చాలా బాధాకరమని మంత్రి ఉమా అన్నారు. ప్రమాదంలో మృతు చెందిన వారి కుటుంబాల‌కు సానుభూతి తెలిపారు. కార్తీక వ‌న స‌మారాధ‌న‌కు వ‌చ్చిన ప‌ర్యాట‌కుల‌కు ఇలాంటి ప్ర‌మాదం జరగడం…మృతుల్లో ఎక్కువ మంది ఒంగోలు వాక‌ర్స్ క్ల‌బ్‌కు చెందిన వారు కావ‌డంపై మంత్రి తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. స్థానిక మత్య్సకారులు, పర్యాటకశాఖ అధికారులు సకాలంలో స్పంది0చి చర్యలు చేపట్టారని మంత్రి చెప్పారు.గొల్లపూడి ఆంధ్రా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారిని మంత్రి ఉమా పరామర్శించారు.

ఆసుపత్రిలో బాధితులను పరామర్శిస్తున్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు

కూతురి మృతదేహం చూసి తల్లి గుండె ఆగింది

ఒంగోలు: కృష్ణానది పవిత్ర సంగమం వద్ద పడవ బోల్తా పడిన ఘటనలో కన్నబిడ్డ మృతిచెందిందన్న వార్త తెలిసి ఓ వృద్దురాలి గుండె ఆగింది. ఈ ఘటనలో మృతిచెందిన దేవాబత్తునలి లీలావతి మృతదేహాన్ని ఈరోజు ఉదయం ఒంగోలు తీసుకొచ్చారు. వీరు మంగమూరు రోడ్‌లో నివాసముంటున్నారు. లీలావతికి భర్త లేకపోవడంతో తల్లి లక్ష్మీకాంతం వద్దే ఉంటోంది. ఆమెకు ఓ కుమార్తె ఉన్నారు. కార్తీక మాసం కావడంతో వాకర్స్‌ క్లబ్‌ సభ్యులతో పాటు విహారానికి వెళ్లిన ఆమె విగతజీవిగా తిరిగొచ్చారు. పడవ ప్రమాదం విషయం తెలిసినప్పటి నుంచీ లక్ష్మీకాంతం ఆందోళన చెందారు. కుమార్తె మరణవార్త తెలిసి ఆమె తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఉదయం మృతదేహం ఇంటికి చేరుకోవడంతో లక్ష్మీకాంతం తీవ్రంగా రోదిస్తూ గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం రెట్టింపైంది. లీలావతి కుమార్తె విజయవాడలో చదువుకుంటోంది. లీలావతి, లక్ష్మీకాంతం మృతితో విద్యార్థిని అనాథిగా మారింది.

 సీపీఐ నేత నారాయణ కుటుంబలో విషాదం

సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ  కుటుంబంలో విషాదం అలముకుంది. నిన్న విజయవాడ శివార్లలోని ఇబ్రహీపట్నం పవిత్ర సంగమం వద్ద జరిగిన బోటు ప్రమాదంలో ఆయన సోదరి మృతి చెందారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి బోటులో ప్రయాణించారు. సంగమం వద్ద జరిగిన ప్రమాదంలో ఆమె మరణించగా, ఆమె కోడలు, మనవరాలు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నిన్నటి నుంచి అక్కడే ఉన్నారు. ఈరోజు ఉదయం నారాయణ భార్య, పలువురు బంధువులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, నిన్న కృష్ణా-గోదావరి సంగమం వద్ద బోటు తిరగబడిన ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

సీపీఐ రామకృష్ణ దిగ్ర్భాంతి

బోటు ప్రమాదంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఒక ప్రకటనలో కోరారు. సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పవిత్రసంగమం వద్ద బోటు తిరగబడిన ప్రమాదంలో ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన బీజేపీ మాజీ అధ్యక్షులు ప్రభాకర రెడ్డి, కోటేశ్వరరావులు మృత్యువాత పడ్డారు. ప్రభాకర రెడ్డి వాకర్స్‌ అసోసియేషన్‌ కోశాధికారి. అతనే వాకర్లను ఈటూర్‌కు తీసుకువచ్చారు. ప్రమాదంలో ప్రభాకర్‌ రెడ్డి భార్య శ్రీలక్ష్మి సురక్షితంగా భయటపడ్డారు. వీరి మృతికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు రేగళ్ల రఘునాథ రెడ్డిలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *