న్యూఇయర్ విమానయాన సంస్థల ఆఫర్లు

ముంబై, డిసెంబర్ 25 : కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు అందరిలో ఉత్సాహం తొణికిసలాడుతుంటుంది. గతేడాది కంటే ఈసారి మరింత గ్రాండ్‌గా, వినూత్నంగా జరుపుకోవాలని రకరకాల ప్లాన్‌లు వేస్తుంటారు. కొందరైతే ఏదైనా మంచి టూరిస్ట్ ప్లేస్‌కి వెళ్లి సంబరాలు చేసుకోవాలనుకుంటారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే న్యూ ఇయర్ వేళ విమానయాన సంస్థలు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. అనేక సంస్థలు దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో భారీ తగ్గింపును ప్రకటించాయి. చమురు ధరల భారంతో నష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ పోటీలో వెనక్కి తగ్గకూడదన్న భావనతో ఒకరిని మించి మరొకరు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. నవంబరులో విమాన ప్రయాణికుల ట్రాఫిక్ 11.03 శాతం పెరిగింది. మొత్తం 116.45 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు. అయినప్పటికీ ఈ పెరుగుదల గత నాలుగేళ్ల కాలంలో అతి తక్కువ కావడం గమనార్హం. దీంతో న్యూఇయర్ వేళ వ్యాపారం పెంచుకునేందుకు సంస్ధలు పోటీ పడుతున్నాయి. జెట్ ఎయిర్‌వేస్: దేశీయ, అంతర్జాతీయ టిక్కెట్ ఛార్జీలపై 30శాతం డిస్కౌంట్ ఇస్తోంది. జనవరి 1 అర్థరాత్రి వరకు బుక్ చేసుకునే టిక్కెట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరోవైపు రానుపోను ప్రయాణాలకు, బిజినెస్, ఎకానమీ తరగతుల టిక్కెట్లపైనా తగ్గింపు ఇస్తోంది. అంతర్జాతీయ మార్గాల్లో జనవరి 7, ఆ తర్వాత ప్రయాణాలకు డిస్కౌంట్ ధరలపై టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
గో ఎయిర్: థాయిలాండ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఫుకెట్‌లో జనవరి 10-13 మధ్య జరిగే యాట్ షో నేపథ్యంలో ఆ మార్గంలో ప్రయాణ టిక్కెట్లపై 50 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. భారత్‌ నుంచి ఫుకెట్‌కు నేరుగా విమాన సేవలను నడుపుతున్న తొలి సంస్థ ఇదే.
స్పైస్‌ జెట్: హైదరాబాద్‌ నుంచి కోల్‌కతా, పుణె, కోయంబత్తూర్‌కు జనవరి 1 నుంచి కొత్తగా ఎనిమిది విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్-కోల్‌కతా మార్గంలో టిక్కెట్‌ను రూ.2,699కి, కోల్‌కతా-హైదరాబాద్ మార్గంలో 3,199కి టిక్కెట్‌ ఆఫర్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి పుణెకు 2,499, అక్కడి నుంచి హైదరాబాద్‌కు రూ.2,209 ధరలు నిర్ణయించింది. హైదరాబాద్-కోయంబత్తూర్ మార్గంలో రూ.2,809, రూ.2309 ధరలకే టిక్కెట్స్ ఆఫర్ చేస్తోంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *