మొండి బకాయిలను తొలగించిన బ్యాంకులు

ఆస్తి అప్పుల పట్టీని స్వచ్ఛం చేసుకొనేందుకు ముందుగా బ్యాంకులన్నీ మొండి బకాయి పద్దుల్ని పుస్తకాల్లోంచి తొలగించాయి. వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి కొందరేమో విదేశాలకు పారిపోయారు. చివరికి అవినీతి ఆరోపణలు, పొసగని వాతావరణంతో అధినేతలు ఆయా సంస్థలను వీడారు. ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ వీడ్కోలుతో ఈ కథ ముగిసింది.ఈ ఏడాది ఆరంభంలోనే బ్యాంకింగ్‌ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం వెలుగుచూసింది. కోటీశ్వరుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, అతడి బంధువు మెహుల్‌ ఛోక్సీ బండారం బయటపడింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.14,000 కోట్ల మేర మోసం చేసిన విధానం చూసి ప్రజల మతిపోయింది. 2011 మార్చి నుంచి ముంబయిలోని ఓ శాఖ మోదీ సంస్థలకు ఎల్‌ఓయూలు అందించింది. ఇందుకు ఓ ఉద్యోగి సహాయపడ్డాడు. బ్యాంకింగ్‌ వ్యవస్థలోని లుకలుకలు బయటపడ్డాయి. విదేశాలకు చెక్కేసిన ఎగవేతదారులపై ఇప్పటికీ దర్యాప్తు జరుగుతోంది.వివాదాలకు అల్లంత దూరాన ఉండే ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌కు అవినీతి మరకలు అంటాయి. అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు ఉన్నతాధికారిగా ఆమెకెంతో పేరుంది. వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌కు నీకిది-నాకదిలో భాగంగా రుణాలు ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. బ్యాంకు ఆమెకు అండగా నిలిచినా ఆరోపణలు పెద్ద ఎత్తున రావడంతో బయటకు వెళ్లక తప్పలేదు. 1984లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా ప్రవేశించిన కొచ్చర్‌ అక్టోబర్‌లో ఇబ్బందికరంగా నిష్ర్కమించారు. ఇక యాక్సిస్‌ బ్యాంకు ఎండీగా మరికొంత కాలం కొనసాగేందుకు శిఖా శర్మకు ఆర్బీఐ అనుమతి ఇవ్వలేదు. బ్యాంకు బోర్డు 2021 వరకు కొనసాగేందుకు ప్రతిపాదించింది. ఆర్బీఐ ససేమిరా అంది. యెస్‌ బ్యాంకు సీఈవో రాణా కపూర్‌కు ఆర్బీఐ నుంచి ఇదే అనుభవం ఎదురైంది. 2019, జనవరి 31 తర్వాత కొత్తవారు రావాల్సిందే. గత నెల్లో బ్యాంకు ఛైర్మన్‌  అశోక్‌ చావ్లా పదవి నుంచి దిగిపోయారు.ఇక ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నిష్ర్కమణ అత్యంత సంచలనంగా, వివాదాస్పదంగా మారింది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కొన్ని అంశాల్లో ప్రభుత్వానికి, ఆర్బీఐకి సఖ్యత కుదరలేదు. దీంతో వ్యక్తిగత కారణాలతో డిసెంబర్‌ 10న పటేల్‌ రాజీనామా చేశారు. ప్రభుత్వం వెంటనే మాజీ ఆర్థిక కార్యదర్శి శక్తికాంత దాస్‌ను కొత్త గవర్నర్‌గా నియమించింది. స్థూల నిరర్ధక ఆస్తుల విషయంలో ఇబ్బందుల కారణంగానే యాక్సిస్‌, యెస్‌ బ్యాంకు అధికారులు కొనసాగేందుకు ఆర్బీఐ అనుమతి ఇవ్వలేదు.రెండేళ్లలోనే యాక్సిస్‌ బ్యాంకు ఎన్‌పీఏలు ఐదు రెట్లు పెరిగాయి. అదే సమయంలో నికర లాభాలు తగ్గాయి. 2009లో 0.96 శాతంగా ఉన్న మొండి బకాయిల నిష్పత్తి 2017 మార్చికి 5.04 శాతానికి పెరిగింది. యెస్‌ బ్యాంకు తమ ఎన్‌పీఏలను తప్పుగా చూపిస్తోంది. 2016-17కు ఇవి రూ.2,018 కోట్లు అని బ్యాంకు చెప్తుండగా ఆర్బీఐ మాత్రం రూ.8,373 కోట్లని తేల్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనూ వీటి బెడద ఎక్కువగానే ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటి ఎన్‌పీఏలు రూ.23,860 కోట్లు తగ్గి రూ.8,71,741 కోట్లకు చేరుకున్నాయి. ఇక 2018, అక్టోబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నష్టాలు రూ.4,285 కోట్ల నుంచి రూ.4,532 కోట్లకు పెరిగాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో రూ.67,026 కోట్ల మొండి బకాయిలు వసూలు చేశామని ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ఇక ముందూ ఇదే ధోరణి ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.ఐడీబీఐ బ్యాంకులోని వాటాను ఎల్‌ఐసీకి అమ్మేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, విజయ బ్యాంకు, దేనా బ్యాంకును విలీనం చేసి దేశంలోనే అతిపెద్ద మూడో బ్యాంకును రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అలాగైతే ఆ బ్యాంకు మొత్తం విలువ రూ.14.8 లక్షల కోట్లు ఉంటుంది. విలీనం జరిగితే ఆర్థికంగా బలపడుతుంది. ప్రభుత్వ బ్యాంకుల సగటు ఎన్‌పీఏ నిష్పత్తి 12.1 శాతంతో పోలిస్తే దీనిది తక్కువగా 5.7 శాతం ఉంటుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *