ప్రకృతి బీభత్సం

ఇరాన్, ఇరాక్ లో భూ కంపం
407 మంది మృతి
వేలాదిమందికి గాయాలు

ప్రకృతి బీభత్సానికి ఇరాన్, ఇరాక్ అతలాకుతలమయ్యాయి. ఇరుదేశాల సరిహద్దుల్లో 7.3 తీవ్రతతో ఆదివారం రాత్రి సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 407కు చేరిందని ఇరాన్ అధికారిక వార్తాసంస్థ ప్రకటించింది. 6700 మందికిపైగా గాయపడ్డారని తెలిపింది. భూకంపం కారణంగా తమ దేశంలో ఏడుగురు చనిపోయారని, 535 మంది గాయపడ్డారని ఇరాక్ ప్రభుత్వం ప్రకటించింది. తూర్పు ఇరాక్‌లోని హలబ్జా నగరానికి 31కిలోమీటర్ల దూరంలో.. ఇరాన్‌లోని కెర్మన్‌షా రాష్ట్రంలోని జాగ్రోస్ పర్వతప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూ ఉపరితలానికి 23.2 కిలోమీటర్ల లోతున భూకంపకేంద్రం ఉందని, దాని కారణంగా భూకంప పరిధి, తీవ్రత పెరిగిందని అమెరికా జియాలజికల్ సర్వే ప్రకటించింది.
మధ్యధరా తీర ప్రాంతంలో ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద భూకంపాల్లో ఒకటిగా దీనిని భావిస్తున్నారు.పెనుతీవ్రతతో భూమి కంపించడంతో ఇరాన్‌లోని 14 రాష్ర్టాలుఅతలాకుతలమయ్యాయి.

వందలాది సంఖ్యలో ఇండ్లు, భవంతులు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకుని వందల సంఖ్యలో ప్రజలు విలవిల్లాడుతున్నారు. వారిని కాపాడేందుకు అధికారులు సహాయ చర్యలు ముమ్మరం చేశారు.ప్రాణాలతో బయటపడిన వారు రోడ్లపైనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఆప్తుల్ని కోల్పోయినవారి రోదనకు అంతే లేదు. శిథిలాల కింద చిక్కుకుపోయిన తమవారి కోసం గాలిస్తున్న హృదయ విదారక దృశ్యాలు అడుగడుగునా కనిపిస్తున్నాయి. భూకంపం తర్వాత మరో 500 సార్లు ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు క్షణక్షణం భయంగా గడుపుతున్నారు. కెర్మన్‌షా రాష్ట్రంలోని సర్పోలే జహాబ్ నగరం తీవ్రంగా ధ్వంసమైంది. ఈ ఒక్క నగరంలోనే 142మంది వరకు చనిపోయినట్లు నిర్ధారించారు. మా అపార్ట్‌మెంట్ ఉన్నట్టుండి ఊగడం ప్రారంభించింది. మేమంతా భయపడిపోయాం, బయటకు పరిగెత్తాము. మేం రోడ్డుపైకి రాగానే బిల్డింగ్ కుప్పకూలింది అని 49 ఏండ్ల గృహిణి కోకబ్ ఫర్ద్ రోదిస్తూ తెలిపారు. నీరు దొరకక సర్పోలే జహాబ్ వాసులు అవస్థలు పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *