మీరే నడిపించారు…

ముగిసిన జగన్ పాదయాత్ర

జనసంద్రమైన ఇచ్ఛాపురం

ఇచ్చాపురం : ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్రలో  ప్రజల గుండె చప్పుడును  నా గుండె చప్పుడుగా మార్చుకున్నాను.   నడిచింది నేనైనా నడిపించింది మాత్రమే మీరూ,  ఆ దేవుని దీవెనలే నని వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పాద యాత్ర ముగిసిన నేపధ్యంలో అయన ఇచ్చాపురం లో జరిగిన ముగింపు సభలో మాట్లాడారు.   హైదరాబాద్ నుంచి దుబాయ్ 3 వేల కిలో మీటర్లు.  కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దూరం 3440 కి. మీ. పాదయాత్ర రికార్డులను దాటేసింది.  ఎంత దూరం నడిచాం అన్నది ముఖ్యం కాదు. ఎంత మంది ప్రజలను కలిశాం. ఎంతమందికి భరోసా ఇచ్చామన్నదే ముఖ్యం.   600 హామీలు ఇచ్చి.. ప్రతీ కులాన్నీ ఎలా మోసం చేయవచ్చు అన్న దానిలో పీహెచ్ డీ చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్టంలో కరువు పరిస్థితులు ఉంటే.. రెయిన్ గన్ ల పేరుతో చంద్రబాబు నాయుడు సినిమా చూపించారంటూ అనంతపురం జిల్లాకు చెందిన రైతు శివన్న యథార్థ గాథ అయన  వినిపించారు.  జాతీయ రాజకీయాల పేరుతో కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తిరుగుతారు కానీ.. మన రాష్ట్రంలో రైతన్నల కష్టాలను తీర్చాలన్న ధ్యాసే లేదు చంద్రబాబుకు.  రైతు ఆదాయంలో మన రాష్ట్రం రైతులు దేశంలోనే 28 వ స్థానంలో,  రైతు అప్పుల్లో మాత్రం 2వ స్థానంలో ఉంటే.. గ్రోత్ రేట్ లో నెంబర్ 1 అంటూ చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. అందుకే చంద్రబాబును నమ్మం బాబూ.. అని రైతులు, ప్రజలు అంతా అంటున్నారు.  పొదుపు సంఘాలకు చెందిన అక్కచెల్లెమ్మల రుణాలు చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ. 14,2014 కోట్లు ఉంటే… ఇప్పుడవి వడ్డీలు పెరిగిపోయి రూ. 22,174 కోట్లకు చేరాయి. సున్నా వడ్డీ రుణాలకు కూడా బాబు ఎగనామం పెట్టాడని ఆరోపించారు. బాబు వచ్చాడు.. కానీ జాబు రాలేదు. ఉన్న జాబులను ఊడగొడుతున్నాడ ని నిరుద్యోగ యువత అంటున్నారు. రాష్ట్ర విభజన సమయంలో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే  ఇప్పుడవి 2.40 లక్షలకు పెరిగినా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ప్రతి ఇంటికీ రూ. 2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికలకు ముందు చెప్పి ఇప్పుడు ఎన్నికలకు మూడు, నాలుగు నెలల ముందు, అదీ కొద్ది మందికే వెయ్యి ఇస్తానంటున్నాడు. 20 లక్షల కోట్ల పెట్టుబడులు.. 40 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటున్నాడు. అన్నీ అబద్ధాలే. జాబు రావాలంటే బాబు పోవాలి. అందుకే యువత నిను నమ్మం బాబూ  అంటున్నారని జగన్ అన్నారు..
 చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక  అక్షరాలా 6 వేల ప్రభుత్వ స్కూళ్ళు మూసేశాడు. ఎస్సీ, ఎస్టీల హాస్టళ్ళు మూసేశాడు. కవిటి మండలంలో ఓ జూనియర్ కాలేజీలో కనీసం బాత్ రూమ్ లు కూడా లేవని ఓ విద్యార్థిని చెప్పింది. చంద్రబాబు మాత్రం మరుగుదొడ్ల నిర్మాణంలో నెంబర్ 1 అంటాడు. ఫీజులు కట్టలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.   రాష్ట్రంలో 23 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న బడుల్లో టీచర్లు లేరు. పుస్తకాలు ఇవ్వటం లేదు.  ఈవిధంగా  ప్రభుత్వ స్కూళ్ళను నిర్వీర్యం చేస్తూ.. నారాయణ, చైతన్య సంస్థలను మాత్రం పెంచుతున్నారు చంద్రబాబని మండిపడ్డారు.  ఆరోగ్యశ్రీలో నెట్ వర్క్స్ ఆసుపత్రులకు 8 నెలలుగా ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు రాష్ట్రంలో నిలిచిపోయాయి. ఉద్దానంలో 4 వేల మంది కిడ్నీ రోగులు డయాల్సిస్ చేయించుకుంటా ఉంటే  వీరిలో కేవలం 1400 మందికి మాత్రమే ప్రభుత్వం వైద్యం అందిస్తోంది. కిడ్నీబాధితులకు పెన్షన్లు కూడా కేవలం 370 మందికి మాత్రమే ప్రభుత్వం ఇస్తోంది. 108 అంబులెన్స్ వస్తుందో రాదో తెలియని పరిస్థితి ఉంది. హైదరాబాద్ కు వెళితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందన్న నమ్మకం లేని పరిస్థితి వుందని అన్నారు.   జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా నడుస్తోంది. రేషన్ కార్డు నుంచి మరుగుదొడ్డి వరకూ ఏది కావాలన్నా.. లంచం.. లంచం. గ్రామాల్లో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెన్షన్ కావాలంటే ఏ పార్టీ అని అడుగుతున్నారు. పెన్షన్ కావాలంటే బతికి ఉన్నా  సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇంకోపక్క ఇసుక, మట్టి, బొగ్గు, మద్యం, కాంట్రాక్టులు.. ప్రతిదీ దోపిడే నని జగన్ అన్నారు. చంద్రబాబు నాయుడు నోటికి-మెదడుకు కనెక్షన్ తెగింది. అందుకే నోటికేది వస్తే అది  మాట్లాడుతున్నాడు. ఎన్నికలొచ్చేటప్పటికీ భయం పట్టుకుంది. ఆదరణ-2 అని, కొత్త ఇళ్ళు, పెన్షన్లు.. మరొకటి అని డ్రామాలు ఆడుతూ కొత్త సినిమా చూపిస్తున్నాడు.  ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నాడు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాది రిగా కొనుగోలు చేసి, అందులో నలుగుర్ని మంత్రుల్ని చేశాడు.   చంద్రబాబు పాలన కావాలా ఇంకా? ఇలాంటి మనిషి కావాలా? అని అడుగుతున్నానని అన్నారు.  నాలుగేళ్ళు ప్రత్యేక హోదాను ఖూనీ చేశాడు. ఆ నాలుగేళ్ళు బీజేపీతో కాపురం చేసి.. తన పార్టీకి చెందిన మంత్రులను బీజేపీ ప్రభుత్వంలో ఉంచుతాడు. నాలుగేళ్ళు బీజేపీ ప్రభుత్వాన్ని పొగుడుతాడు. ప్రత్యేక హోదా బీజేపీ ఇవ్వకపోయినా వారికి ధన్యవాదాలు చెబుతూ తీర్మానాలు చేస్తాడు.  అసెంబ్లీలో ప్రత్యేక హోదా కోసం మనం పోరాడితే వెటకారం ఆడతాడు. నాలుగేళ్ళు మోడీ- బాబు జోడి పేరుతో వారి మధ్య సాగిన ప్రేమ, పొగడ్తలు చూస్తే… వారి ప్రేమను చూసి.. చిలక-గోరింకలు కూడా సిగ్గుపడేలా ఉంది.   గత రెండు మూడు నెలలుగా చంద్రబాబు రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడడు. చంద్రబాబు-మోడీకి మధ్య యుద్ధం అని ఈనాడు రాస్తోంది. ఆ పేపరు చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. నాలుగేళ్ళు చిలకా-గోరింకల్లా ప్రేమ. ఎన్నికలకు మూడు నెలల ముందు యుద్ధమా? పేపర్లు, టీవీలు అడ్డం పెట్టుకొని చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడు.   తాను చెప్పింది చేయకపోతే  ఆ రాజకీయ నాయకుడ్ని రాజీనామా చేయించి ఇంటికి పంపించేలా చేయాలి. అటువంటి విశ్వసనీయ రాజకీయాలు రావాలి. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మార్చాలంటే అది జగన్ ఒక్కరి వల్ల సాధ్యపడదు. జగన్ కు మీ అందరి దీవెనలు కావాలని అయన అన్నారు. ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియేట్ ను తీసుకొస్తాం. స్థానికులకే 10 మందికి ఉద్యోగాలు ఇస్తాం. ప్రతి పథకం పేదవాడి ఇంటి ముందుకే వచ్చే విధంగా చేస్తాను. ప్రతి 50 ఇళ్ళకు ఒకరికి గ్రామ వాలంటీయర్ గా తీసుకొని ఉద్యోగం ఇస్తాం. వీరికి రూ. 5 వేలు జీతం ఇస్తాం. వాలంటీయర్ ఆ 50 ఇళ్ళకు జవాబుదారీగా ఉంటూ.. గ్రామ సెక్రటేరియేట్ తో అనుసంధానమై పనిచేస్తూ నవరత్నాలు నుంచి రేషన్ బియ్యం వరకూ  నేరుగా ఇంటికే వచ్చే విధంగా డోర్ డెలివరీ చేస్తామన అన్నారు.

పాదయాత్ర చివరి ఘట్టం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *