పటిష్ట ఐక్య ప్రజా ఉద్యమాలు నిర్మిద్దాం

సీపీఐ బలోపేతానికి ఐక్యం గా కృషి చేయాలి
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రావుల శివారెడ్డి

ప్రస్థుతం అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రావుల శివారెడ్డి పేర్కొన్నారు. ఇందుకు వ్యతిరేకంగా పటిష్టమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం తాడేపల్లి మండలం వడ్డెశ్వరంలో సీపీఐ ప్రచార ఆందోళనా కార్యక్రమన్ని ఆయన ప్రారంభించారు. అక్కడి నుంచి ఇప్పటం, కొలనుకొండ, కుంచనపల్లి, మెల్లెంపూడి , రేవేనదరపాడు, శ్రుంగారపురం, నూతక్కి, చిర్రావూరు, గుండిమెడ, ప్రాతూరు, తాడేపల్లి వరకు నిర్వహించారు. ఈ సంధర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ…. కేంద్రంలోని మోడీ సర్కారు అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక, ఆర్థిక విధానాల వల్ల దేశ ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు తానో ఛాయ్‌వాలా కొడుకునని చెప్పుకున్న ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నేడు కార్పొరేట్లు, పెట్టుబడిదారులకు ఏజెంటుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు ధరల తగ్గిస్తామని, విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కు తీసుకువస్తామని దేశ ప్రజలకు హావిూలనిచ్చిన మోడీ ఇప్పుడు ఆ అంశాలపై నోరు మెదపకపోవటం శోచనీయమన్నారు.
ఇక దేశం లో ఆహార భద్రతా చట్టం పేరిట పేదలకిచ్చే రేషన్‌ కార్డుల సంఖ్యను కుదించేందుకు ప్రయత్నించటం దారుణమన్నారు. పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకోకుండా దొంగచాటున, రైతులకు వెన్నుపోటు పొడిచే రీతిలో భూ సేకరణ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారని విమర్శించారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రహ్మాండమైన ఉపన్యాసాలు దంచుతున్నారని, రాజధాని పేరుతో రైతులను నమ్మించి మోసగిస్తున్నాడని విమర్శించారు. సీఎం చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయని , కానీ కాళ్లు మాత్రం గడప దాటటం లేదు’ అని ఎద్దేవా చేశారు. రాజధాని పేరుతో మభ్యపెడుతున్న సీఎం ఎంత సేపటికీ తిరిగి అధికారం లోకి రావడానికి ప్రయత్నిస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలి వేసారన్నారు. ఎంత సేపటికీ అర్థం, పర్ధం లేని పనులతో….మాటలతో… కాలక్షేపం చేస్తున్నాడని, అయితే ఎక్కువకాలం రాష్ట్ర ప్రజల్ని సీఎం చంద్రబాబు మభ్యపెట్టలేరని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రజల్ని, ప్రజా సమస్యల్ని పట్టించుకోవాలని హితవు పలికారు. రానున్న ఎన్నికల నాటికి సిపిఐ, సిపిఎంతోపాటు ఇతర వామపక్షాలన్నీ ఇప్పటి నుంచే కలిసి ముందుకు సాగాలని, తద్వారా ప్రజలకు నిజమైన ప్రత్యామ్నాయం చూపాలని శివారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శులు పిల్లలమర్రి నాగేశ్వరరావు, కంచర్ల కాశయ్య, మంగళగిరి పట్టణ, మండల కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య, జాలాది జాన్ బాబు, తాడేపల్లి మండల కార్యదర్శి ముసునూరి సుహాస్, కౌన్సిలర్ ఉయ్యాల సత్య నారాయణ, నాయకులు గుంటక సాంబిరెడ్డి, వెంకటయ్య, బాజి, జవహర్ జానీ, షేక్ బాబు తదితరులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *