డిజిటల్ టెక్నాలజీతో సేవలు

డిజిటల్ టెక్నాలజీ ద్వారా సేవలు సమర్థవంతంగా మారాయని ప్రధాని మోదీ అన్నారు. చాలా సులువుగా ప్రజలకు సేవలు అందించడంలో డిజిటల్ టెక్నాలజీ కీలకంగా మారిందన్నారు. ఈజ్ ఆఫ్ లీవింగ్ కోసం డిజిటల్ టెక్నాలజీ చాలా ఉపయోగకరంగా తయారైందన్నారు. టెక్నాలజీ వల్ల సుపరిపాలన కూడా సాధ్యమైందన్నారు. టెక్నాలజీ అన్ని అవరోధాలను అధిగమించిందన్నారు. వసుదైక కుటుంబం అన్న భారతీయ సనాతన ధర్మాన్ని డిజిటల్ టెక్నాలజీ నిరూపిస్తున్నదన్నారు. సైబర్‌స్పేస్ అంశంపై అయిదవ అంతర్జాతీయ సదస్సును ప్రధాని మోదీ ఇవాళ ఢిల్లీలో ప్రారంభించారు. సైబర్‌ఫర్‌ఆల్.. ఎ సెక్యూర్ అండ్ ఇన్‌క్లూజివ్ సైబర్‌స్పేస్ ఫర్ సస్టేయినబుల్ డెవలప్‌మెంట్ నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు సైబర్ స్పేస్ సదస్సు జరగనున్నది.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..పెన్షనర్లు బ్యాంక్ ముందు నిలబడాల్సిన అవసరం లేదని, ఆధార్‌తో తమ జీవన ప్రమాణ పత్రాలను సమర్పించవచ్చు అన్నారు. డిజిటల్ టెక్నాలజీ వల్ల మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారుతున్న ఘటనలు పెరిగినట్లు ఆయన తెలిపారు. టెక్నాలజీ వల్లే క్యాష్‌లెస్ లావాదేవీలు పెరిగాయన్నారు. భీమ్ యాప్ ద్వారా అవినీతి రహిత సమాజాన్ని క్రియేట్ చేస్తున్నామన్నారు. మొబైల్ పవర్ ద్వారా పౌరులు సాధికారత సాధిస్తున్నారని మోదీ అన్నారు. డిజిటల్ టెక్నాలజీ వల్ల వ్యవసాయ లాభాలు కూడా పెరిగినట్లు ప్రధాని తెలిపారు. ప్రభుత్వ ఈ-మార్కెట్‌లో ఓ చిన్న వ్యాపారి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు అని, తన ఉత్పత్తులను ప్రభుత్వానికి అమ్ముకునే వీలుందన్నారు. జన్ భాగీదారీ పెంచేందుకు డిజిటల్ డొమేయిన్‌ను వాడుతున్నట్లు ఆయన తెలిపారు. ఉమంగ్ మొబైల్ యాప్ ద్వారా అనేక సేవలు అందించనున్నారని మోదీ తెలిపారు. అందరు కలిసి ప్రగతి సాధిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధాని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *