సైద్ధాంతిక స్వచ్ఛత కోసం….

— ఆండ్ర మాల్యాద్రి

స్వాతంత్రానంతరం కాంగ్రెస్‌ పాలకులు విదేశీ రుణాలపై మారుటోరియం ప్రకటించి బ్రిటిష్‌ పెట్టుబడులను స్వాధీనం చేసుకునే బదులు వారితో మరింతగా కుమ్మక్కయ్యారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ధన స్వాములను భుజాన మోశారు. అవకాశ వాద పోకడలతో అస్తవ్యస్త పరిస్థితి సృష్టించారు. ఈ నేపథ్యంలో మరింత సమరశీల పోరాటాలకు సిద్ధమయ్యే బదులు వారిపట్ల మెతక వైఖరి అనుసరించాలని కమ్యూనిస్టు ఉద్యమం లోనే కొందరు ప్రతిపాదించారు. దాంతో విభేదించిన పుచ్చలపల్లి సుందరయ్య, ఎ.కె.గోపాలన్‌, బి.టి.రణదివే, హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌, పి.రామమూర్తి, ప్రమోద్‌దాస్‌గుప్తా, మాకినేని బసవపున్నయ్య, జ్యోతిబాసు, నంబూద్రిపాద్‌, ముజఫర్‌ అహ్మద్‌, తదితరులు తీవ్ర సైద్ధాంతిక పోరాటం నడిపారు. అంతేగాక విప్లవ కర సిద్ధాంత స్వచ్చత కోసం ప్రజా పోరాటాల పదును పెంచడం కోసం నూతన సంస్థను స్థాపించాలన్న నిర్ణయానికి వచ్చారు.. ఈ ఏర్పాటులో ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన సుందరయ్య, బసవపున్నయ్య, మోటూరు హనుమంతరావు, నండూరి ప్రసాదరావు, తరిమెల నాగిరెడ్డిలతో పాటు ఇంకా అనేకులు ముఖ్యపాత్ర వహించారు. వారు ఈ ఆలోచనలు చేస్తున్న దశలోనే 1962లోనే చైనా యుద్ధాన్ని సాకుగా చూపి
కమ్యూనిస్టు ఉద్యమంలోని ఒక భాగాన్ని జైలు పాలు చేశారు. అయినా గట్టిగా నిలబడి 1964 జులై 7 నుంచి జులై 12 వరకూ తెనాలిలో జాతీయ సదస్సు జరిపి నూతన పార్టీ స్థాపనకై నిర్ణయించారు. మొత్తం పైన నిర్బంధం మధ్యనే 1964 నవంబరు7న భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) ఏర్పడింది. పుచ్చలపల్లి సుందరయ్య తొలి ప్రధాన కార్యదర్శి అయ్యారు. అప్పటి నుండి ఇప్పటి వరకు సిపిఎం ఎప్పుడు స్వతంత్ర విధానాన్ని అనుసరిస్తోంది. ఈ దేశ పరిస్థితులకు తగిన నిర్దిష్ట విధానాన్ని నిర్ణయించు కుంటూ ముందుకు సాగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *