సమాచార వ్యవస్థతో జనరంజక పాలన

మెరుగైన పనితీరుతో ప్రజా సంతృప్తి శాతం పెరగాలి
ఇక నుంచి రోజుకొక శాఖపై ఆర్టీజీ సాయంతో సమీక్ష
ముఖ్యమంత్రి చంద్రబాబు

వాస్తవిక సమాచార వ్యవస్థ ద్వారా జనరంజక పరిపాలన అందించడమే ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ కమాండ్ అండ్ కమ్యూనికేషన్ విభాగం పనితీరును ఆయన సమీక్షించారు. పదమూడు ప్రభుత్వ శాఖలు కచ్చితమైన సమాచారంతో ఉండాలని, ఇకనుంచి రోజూ ఒక ప్రభుత్వ శాఖను రియల్ టైమ్ వ్యవస్థ ద్వారా సమీక్షించనున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తి శాతం పెరగడానికి వాస్తవిక సమాచారంతో ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని చెప్పారు. అంతిమంగా ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల్లో సంతృప్తి పెరగాలన్నదే తమ లక్ష్యమని సీఎం వివరించారు. కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు మాయమైన 24 గంటల్లో టెక్నాలజీ సాయంతో వెదికిపట్టుకున్న సిబ్బందిని ఆయన అభినందించారు. ఆస్పత్రులతో భద్రతా చర్యలు ఇంకా పటిష్ఠంగా ఉండాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అధునాతన సీసీటీవీలతో భద్రత మరింత పకడ్బందీగా ఉండాలని చంద్రబాబు కోరారు. ప్రభుత్వ విధానాలపై సంతృప్తి శాతాన్ని అంచనా వేసేందుకు 13 ప్రభుత్వ శాఖలనుంచి సమాచారం తీసుకుని విశ్లేషించాలని ఆర్టీజీ సిబ్బందిని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమాచారం తెప్పించుకోవటమే కాదు, విశ్లేషించాలి. సకాలంలో సమస్య పరిష్కారం జరగాలి అని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వ పథకాల ఫలితాలు చివరి వ్యక్తి వరకు చేరితే సంతృప్తి శాతం పెరుగుతుందన్నారు. అన్ని సేవలు కచ్చితంగా అందిస్తే ప్రజల్లో సంతృప్తి పెరుగుతుందని ఆయన చెప్పారు. వాళ్ల కోర్కెలు ఏమిటి? సమస్యలు ఏమిటి? ఎలా పరిష్కరించాలి?’ అనే దిశగా ఆలోచన చేయాలన్నారు. ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా చెడ్డపేరు తెచ్చే శక్తులుంటాయని, అప్రతిష్ఠ తేవాలని యత్నిస్తుంటాయని అటువంటి శక్తులపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆకస్మిక సమస్యలు ఉత్పన్నమైతే వెనువెంటనే స్పందించి పరిష్కరించేందుకు ఆర్టీజీ సీఎంఓకు తోడ్పడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

రియల్ టైమ్ ద్వారా మార్పులు

రియల్ టైమ్ ద్వారా వ్యవస్థలో మార్పుతేవాలని,సేవలను మరింత మెరుగ్గా అందించాలని అన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా రాష్ట్రంలో వర్షపాతం, భూగర్భజల మట్టాల వివరాలు అందించాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రాన్ని కాలుష్యరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నది తన అభిమతమని, ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో రియల్ టైమ్ గవర్నెన్స్ సమాచారంతో మంచి ఫలితాలు వస్తున్నాయన్న ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య మాటలకు స్పందిస్తూ..ఎన్టీఆర్ వైద్యసేవపై ప్రజల్లో సంతృప్తి శాతం ఎంత ఉంది? ఇంకా పనితీరు మెరుగుపర్చుకునేది ఉంటే మెరుగుపర్చుకోవాలని కోరారు. మాతా శిశుమరణాల రేటు తగ్గించే ధ్యేయంగా వాస్తవిక సమాచార వ్యవస్థను ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ముందు వ్యాధి రాకుండా జాగ్రత్తలు పాటించే (ప్రివెంటివ్ దశ) దశ ఉంటుందని, ఆతర్వాతే నివారణపై ఆలోచన చేయాలని సీఎం అన్నారు. ప్రజల్లో ఆరోగ్యం, అనువంశిక వ్యాధులు, మానసిక ఆరోగ్యం, వంశాను క్రమంలో వచ్చే జబ్బుల వివరాలతో హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని, ఇందుకు 13 జిల్లాలలో సర్వీసు ప్రొవైడర్లు ఉన్నారని, వారితో సమన్వయంతో పనిచేయాలని కోరారు.

ప్రకాశం జిల్లాలో డిసెంబర్ మొదటి వారంలో వర్షాలు

డిసెంబర్ మొదటి వారంలో ప్రకాశం జిల్లాలో వర్షాలు పడే అవకాశాలున్నాయని రియల్ టైమ్ డ్యాష్ బోర్డులో వచ్చిన సంకేతాలను ముఖ్యమంత్రికి సిబ్బంది వివరించారు. డిసెంబర్ 1 న ప్రకాశం జిల్లా ఉలవపాడులొ అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఏఏ ప్రాంతాల్లో ఏఏ పంటలు ఏఏ దశలో ఉన్నాయో వాస్తవిక సమాచారం ఆధారంగా అంచనా వేస్తే వర్షాలతో నష్టాలను నివారించవచ్చని అన్నారు. ఆర్టీజీ సీఈఓ బాబు ఏ వాస్తవిక సమాచార వ్యవస్థ ద్వారా వస్తున్న ఫలితాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి జి. సాయిప్రసాద్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి గిరిజా శంకర్, సహాయ కార్యదర్శి ఎ.వి రాజమౌళి, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *