టిడిపికి 120 సీట్లు

20 ఎంపి సీట్లలోనూ గెలుపు
ఆర్యవైశ్యులకు అండగా తెలుగుదేశం
రాష్ట్ర మంత్రి శిద్దా రాఘవరావు

పిడుగురాళ్లలో నిర్వహించిన వాసవీ అమ్మవారి కుంభాభిషేక వేడుకల్లో మంత్రి శిద్దా రాఘవరావు

వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహంతో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. 120 అసెంబ్లీ, 20 పార్లమెంటు సీట్లలో టిడిపి ఘన విజయం సాధించనుందని ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో నిర్వహించిన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా మహా కుంభాభిషేక వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గాజుల అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వాసవి అమ్మవారి మూలమంత్రంతో ప్రతిష్ఠించిన కన్యకా మంత్ర స్తూపం, స్వర్ణ తాపడం చేసిన రజిత అమ్మవారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ వాసవి అమ్మవారి అనుగ్రహం లేకుండా ఏదీ సంభవించదనీ, అమ్మవారి ఆశీస్సులతో తాను ఒంగోలు పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసినట్టు తెలిపారు. అందరి సహకారం,అమ్మవారి కరుణా కటాక్షాలతో తాను గెలబోతున్నానని తెలిపారు. టీడీపీ 120 అసెంబ్లీ సీట్లు,20 పార్లమెంట్ సీట్లు గెలిచి తిరిగి అధికారం దక్కించుకుటుందనీ, ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు మళ్ళీ బాధ్యతలు చేపడతారని తెలిపారు. అన్ని నియోజవర్గాల్లో ఓటర్లు నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించారనీ, విజయం తధ్యమని అన్నారు. పేద ఆర్యవైశ్య కుటుంబాలకు తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉందనీ, దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నూతన రాజధానిలో ఆర్యవైశ్య భవన్ నిర్మాణం చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే సుమారు రూ.5 కోట్ల రూపాయలను ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పెనుగొండ సుబ్బారాయుడు విరాళంగా అందచేసారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్యక్షుడు పెనుగొండ సుబ్బరాయుడు,వాసవి సత్ర సముదాయాల గౌరవ అధ్యక్షుడు శిద్దా నాగేశ్వరరావు, ఆధ్యక్షుడు దేవకి వెంకటేశ్వర్లు, పిడుగురాళ్ల మునిసిపల్ చైర్ పర్సన్ భవనాసి యల్లారావు,ఆంద్రప్రదేశ్ ఆర్యవైశ్య యువజన సంఘాల ఆధ్యక్షులు అత్తలూరి సుబ్బారావు, దేవస్థాన అధ్యక్షులు కట్టమూరి శంకరరావు పాల్గొన్నారు.మందా రామలింగేశ్వర శర్మ,మందా హరిహర కుమార శర్మ,వేదబ్రహ్మ వంగిపురపు వీర బ్రహ్మ దైవేజ్ఞ మహామంత్ర స్తూపం పూజా క్రతువు నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారులు భక్తులకు తీర్ధప్రసాదలు అందచేశారు.దేవస్థానం కమిటీ సభ్యులు మంత్రి శిద్దా రాఘవరావుని ఆలయ మర్యాదలతో సత్కరించారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *