బ్యారన్‌ లీజులతో బోర్డుకేం పని ?

రైతుల హక్కులను కాలరాయడం తగదు
వ్యాపారుల మెడలు వంచి పొగాకు కొనుగోళ్లు జరిపించాలి
వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి డిమాండ్‌

రైతుల మధ్య జరిగే కౌలు ఒప్పందాలతో పొగాకు బోర్డుకేం పని ? బ్యారన్‌ లీజులకు సంబంధించి స్టాంపు పేపర్లపై సంజాయిషీ కోరడం దారుణం. తక్షణమే రైతుల్ని వేధించడం మానుకొని పొగాకు కొనుగోళ్లపై దృష్టి సారించాలని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి పొగాకు బోర్డు అధికారులకు హితవు పలికారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఉదయం విలేకరులతో మాట్లాడారు. అసలే పొగాకు కొనుగోళ్లు మందగించాయి. వ్యాపారులు ఇచ్చిన ఇండెంట్‌ ప్రకారం కొనుగోలు చేయడం లేదు. వేలం కేంద్రానికి వచ్చిన బేళ్లను తిప్పి పంపుతున్నారు. అలాంటి వ్యాపారులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఇవేమీ పట్టించుకోకుండా రైతులు లీజుకు ఇచ్చిన బ్యారన్ల గురించి సంజాయిషీ కోరడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది జిల్లాలో 74 మిలియన్ల పొగాకు ఉత్పత్తికి బోర్డు అనుమంతిచగా వాతావరణం అనుకూలించక 50 మిలియన్లకు మించి దిగుబడి రాదని అంచనా. మరో వైపు ఉత్పత్తి వ్యయం పెరిగింది. ఇప్పటిదాకా వ్యాపారులు కొనుగోలు చేసింది మేలు రకం 17 మిలియన్‌ కిలోలు మాత్రమే. మరో మూడు మిలియన్‌ కిలోలు మేలు రకం రైతుల దగ్గర ఉంది. మిగతా గ్రేడ్లను వ్యాపారులు కొనడానికి ముందుకు రావడం లేదు. ఇలాంటి దయనీయ స్థితిలో రైతులు మానసిక క్షోభతో అల్లాడుతుంటే బోర్డు అధికారులు పొగాకు ఎగమతిదార్ల మెడలు వంచకుండా రైతుల మీద ప్రతాపం చూపడాన్ని సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా స్టాంపు పేపర్లపై సంజాయిషీ కోరడాన్ని అధికారులు మానుకోవాలని కోరారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ బోర్డు రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని హితవు పలికారు. పొగాకు రైతులను ఇబ్బందులకు గురిచేసి సాగుకు దూరం చేసేందుకు బోర్డు ఆడుతున్న నాటకానికి తెర దించకుంటే ఆందోళన చేపడతామని సుబ్బారెడ్డి హెచ్చరించారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *