బాలినేని ఫ్లెక్సీల సందడి

అధికారిక జాబితా ప్రకటించకుండానే

ఊరు, వాడలా ఫ్లెక్సీలు

మంత్రి కావటం ఖాయమన్న

నమ్మకమే ప్రధాన కారణం..

ఏపీ మంత్రివర్గం జాబితాను అధికారికంగా ప్రకటించకుండానే ఒంగోలులో ఫ్లెక్సీల సందడి మొదలైంది. మాజీ మంత్రి, ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి (వాసు)కు మంత్రి పదవి రావటం తధ్యమని ఆయన అభిమానులు ప్రగాఢంగా నమ్ముతున్నారు. అందువల్లనే నియోజకవర్గమంతటా, ముఖ్యంగా ఒంగోలు నగరంలో బాలినేని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. నాలుగురోజులుగా అన్ని ప్రధాన కూడళ్ళలో, వీధుల్లో ఫ్లెక్సీలు కడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న బాలినేని శ్రీనివాసరెడ్డికి శుభాకాంక్షలు అని రాసి ఉన్న ఫ్లెక్సీలు ఇపుడు నగరంలో ఎక్కడ చూసినా కనబడుతున్నాయి. సహజంగా అధికారిక ప్రకటన తరువాతే ఇలాంటి ఈ తరహా ఫ్లెక్సీలు దర్శనమిస్తుంటాయి. మరి, జాబితాను ప్రకటించకుండానే ఫ్లెక్సీలు వెలుస్తున్నాయంటే పార్టీ అధిష్టానం నుంచి బాలినేనికి విశ్వసనీయ సమాచారం అంది ఉంటుందనీ, అందువల్లనే తన అభిమానులు ఫ్లెక్సీలు కట్టేందుకు అనుమతి ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు వచ్చిన జగన్ బహిరంగసభలో బాలినేనికి మంత్రి పదవి ఇస్తానని హామీ
ఇచ్చారు. హామీ ఇచ్చాక జగన్ వెనక్కి తగ్గాడన్న నమ్మకంతోనే ముందస్తు ఫ్లెక్సీలు కడుతున్నామని కొందరు అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగన్ మాత్రం మంత్రివర్గం తుది జాబితాపై తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు. కొత్త, పాతల కలయిక, సామాజిక సమీకరణలు, ప్రాంతీయ ప్రాధాన్యతలు, సీనియారిటీలను దృష్టిలో ఉంచుకుని జాబితాను రూపొందించే పనిలో ఉన్నారు. మంత్రివర్గం రేసులో జిల్లా నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమూలపు సురేష్ కూడా ఉన్నారు.

ఒంగోలు నగరంలో విస్తృతంగా వెలిసిన ఫ్లెక్సీలు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *