వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్

అతని వ్యవహారశైలిపై సిఎంకు నివేదిక
చట్టం ముందు అందరూ సమానులే..జగన్

బెయిల్ మంజూరు : జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా

వైసీపికి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆదివారం వేకువజామున పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఇంటిమీదకు వచ్చి దౌర్జన్యం చేశారనీ, తీవ్రంగా దుర్భాషలాడారని వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ చేసిన అనంతరం అరెస్ట్ చేశారు. మహిళా అధికారి ఇచ్చిన వాస్తవమేనని ప్రాథమిక సాక్ష్యాలు సేకరించిన పోలీసులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలిసింది. పోలీస్ ఉన్నతాధికారుల కోటంరెడ్డి ఉదంతాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టు సమాచారం. చట్టం ముందు అందరూ సమానులే..చట్టరీత్యా ఏ చర్యలు తీసుకోవాలో అవి తీసుకోండి’ అని ముఖ్యమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్ అందాకే కోటంరెడ్డి అరెస్ట్ కు పోలీసులు ఉపక్రమించినట్టు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. లేదంటే అధికారపార్టీకి చెందిన శాసనసభ్యుడిని పోలీసులు అంత తేలిగ్గా అరెస్ట్ చేసే అవకాశం ఉండదు. కోటంరెడ్డి వ్యవహారశైలిపై ఇంతకుముందు కూడా వివాదాలు అలుముకున్నాయి. ఒక విలేకరిని ఫోన్ లో రాయటానికి వీలులేని భాషలో ధూషించటం, జమీన్ రైతు ఎడిటర్ డోలేంద్రప్రసాద్ పై దౌర్జన్యం..ఇలా వరుస వివాదాలకు కోటంరెడ్డి కేంద్ర బిందువయ్యారు. కోటంరెడ్డి వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి జగన్ కూడా అసహనంగా ఉన్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. ఏది ఏమైనా ఈ అరెస్ట్ ద్వారా దురుసుగా, దూకుడుగా, దౌర్జన్యంగా వ్యవహరించే ప్రజా ప్రతినిధులకు చెక్ పెట్టినట్టయింది. కోటంరెడ్డిని అరెస్ట్ చేసిన అనంతరం రిమాండ్ కు పంపించేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. ఈ మేరకు ఆయనకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు.

బెయిల్ మంజూరు : జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా

పోలీసులు అరెస్ట్ చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి బెయిల్ మంజూరయినట్టు తాజా సమాచారం అందింది. బెయిల్ మంజూరయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నాననీ, తాను ఏ తప్పు చేయలేదని వెల్లడించారు. విచారణ అనంతరం తప్పు చేసినట్టు రుజువైతే చర్యలు తీసుకోవాలని కోరారు. సిఎం అంటే జగన్ లా ఉండాలనీ, సొంత పార్టీ నేతలను కూడా తప్పు చేసి అంటే చర్యలు తీసుకోమని చెప్పగలిగిన ఏకైక ముఖ్యమంత్రి ఆయనేనని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ లాంటి సిఎం ఎల్లప్పుడూ ఈ రాష్ట్రానికి సిఎంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. జిల్లా ఎస్పీకీ, తనకూ విబేధాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందేననీ, ఏ మాత్రం విచారణ చేయకుండా తనను అరెస్ట్ చేశారని కోటంరెడ్డి ఆరోపించారు. ఎన్నికలకు ముందూ, ఆ తరువాత కూడా తనను ఎస్పీ ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఈ విషయమై నాలుగు రోజుల క్రితమే తాను జిల్లా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేశానని తెలిపారు.

Trending News

Hits: 1063

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *