ఫిలిఫైన్స్ లో ‘టెంబిన్’ ఉగ్రరూపం

– 133 మంది మృతి
– పొంగిపొర్లుతున్న నదులు, వాగులు

మనీలా : ‘టెంబిన్’ తుఫాన్ తాకిడికి ఫిలిప్పైన్స్ దీవులు విలవిల్లాడుతున్నాయి. ముఖ్యంగా మిండానావో దీవిలోని ‘సాలోగ్’ నది ఉగ్రరూపం చూసి…అక్కడి 2 కోట్లమంది ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఒక్క శనివారం రోజే ఈ నదిపై 36 మృతదేహాల్ని రెస్క్యూ సిబ్బంది వెలికితీశారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం తుఫాన్ ప్రమాదాల్లో ఇప్పటివరకూ 133 మంది ప్రాణాలు కోల్పోయారని ఫిలిప్పైన్స్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఫిలిప్పైన్స్ ప్రజలకు తుఫాన్లు కొత్తేమీకాదు. తరుచూ ఏదో ఒక తుఫాన్ అక్కడి దీవుల్ని తాకుతూ ఉంటుంది.స్వల్ప స్థాయిలో ఆస్తినష్టాన్ని కలిగించి అవి వెళ్లిపోతాయి. అయితే ‘టెంబిన్’ విషయంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకపోవటం, ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించకపోవటం పెద్ద నష్టాన్ని తెచ్చిపెట్టింది.

వరదల్లో చిక్కుకున్న పసిపాపను రక్షిస్తున్న స్థానిక యువకులు

ఒక ఏడాది కాలంలో దాదాపు 20కిపైగా తుఫాన్లు ఈ దేశ దీవుల్ని తాకుతాయి. వీటి బారిన పడి పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే వారు ఊహించని విధంగా ఈసారి..’టెంబిన్’ తుఫాన్ మిండానావో దీవిని దారుణంగా దెబ్బతీసింది. ఫిలిప్పైన్స్ దీవుల్లో రెండో అతిపెద్ద దీవి అయిన ‘మిండానావో’లో నదులు, వాగులు భీకరరూపం దాల్చడంతో ప్రాణ, ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరిగింది. శుక్రవారం రాత్రి నుంచి తుఫాన్ తీవ్రరూపం దాల్చటంతో, పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. నదీ తీర ప్రాంతాల్లో గ్రామాల్ని, నగరాల్ని నీరు కొద్దిగంటల్లోనే ముంచెత్తింది. సిబూకూ వంటి కోస్తాతీర ప్రాంతాల్లో తుఫాన్ కారణంగా అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 81 మంది ఆచూకీ తెలియకుండా పోయిందని అక్కడి పోలీస్ అధికారులు మీడియాకు తెలియజేశారు. ‘టెంబిన్’లానే 2013లో ఫిలిప్పైన్స్ను ‘హైయాన్’ తుఫాన్ అతలాకుతలం చేసింది. ఈ తుఫాన్ కారణంగా ఆనాడు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశ చరిత్రలో అత్యంత భీకర తుఫాన్గా ఇది నిలిచింది. మధ్య ఫిలిప్పైన్స్ ప్రాంతంలోని ప్రతీ నగరం తీవ్రంగా దెబ్బతిన్నది. ఇప్పుడు ‘టెంబిన్’ కూడా ఫిలిప్పైన్స్ను అదే విధంగా భయపెడుతున్నది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *