సమష్టికృషితోనే రెండంకెల వృద్ధి : ముఖ్యమంత్రి చంద్రబాబు

‘‘మన కష్టార్జితంపై మనం నిలబడాలి,ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి ఆగి పోరాదు.దేశానికి ఒక నమూనాగా ఆంధ్రప్రదేశ్ రూపొందాలి.సమష్టి కృషితోనే మూడేళ్లు వరుసగా రెండంకెల వృద్ధిరేటు సాధించాం’’ అని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం తన నివాసం నుంచి నీరు-ప్రగతి,వ్యవసాయం పురోగతిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ స్థాయిలో వృద్ధిరేటు 6.8%ఉంటే, మన రాష్ట్రంలో సగటున 11.22% సాధించామన్నారు. 17.79% వృద్ధి వ్యవసాయం అనుబంధ రంగాలలో వచ్చే పరిస్థితి ఉందన్నారు.గత ఏడాది 28% మైనస్, ఈ ఏడాది 14% మైనస్ వర్షపాతం(లోటు) ఉన్నప్పటికీ వ్యవసాయంలో దిగుబడులు తగ్గకుండా చూశామన్నారు. సమర్ధ నీటి నిర్వహణ ద్వారా భూగర్భజలాలు పడిపోకుండా చూశామన్నారు. నీరు-ప్రగతి,జల సంరక్షణ విజయవంతం వల్లే ఇది సాధ్యం అయ్యిందని గుర్తుచేశారు.
‘‘ఇదే స్ఫూర్తితో రబీ సీజన్ లో ఒక్క ఎకరంలో కూడా పంటలు ఎండిపోకూడదు,సమర్ధ నీటి నిర్వహణ ద్వారా పంటలు కాపాడుకోవాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

ఉపాధి హామీ నిధుల జాప్యంపై పార్లమెంట్ లో ప్రస్తావిస్తాం

‘‘ఉపాధి హామీ నిధుల విడుదలలో జాప్యంపై పార్లమెంటులో మన ఎంపీలు ప్రస్తావిస్తారు, కేంద్రంపై ఒత్తిడి తెస్తారు. ఉపాధి పనుల వేగం తగ్గకుండా చూడాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.‘‘కోటి పనిదినాల లక్ష్యానికి గతనెలలో 38లక్షలే చేశాం,మిగిలింది ఈ నెలలో సాధించాలి.పంట సంజీవని లక్ష్యంలో 68%,వర్మికంపోస్ట్ 52% మాత్రమే చేశాం, అన్నింటిలో 100% లక్ష్యం చేరుకోవాలి. ఉపాధికూలీలకు చెల్లింపులకు ఇబ్బంది లేకుండా చూడాలి,కేంద్రం నుంచి నిధులు సకాలంలో విడుదలయ్యేలా చూడాలి’’ అన్నారు.

నరేగాలో ఫిర్యాదులకు అవకాశం ఇవ్వవద్దు

‘‘80 కరవు మండలాలలో 150రోజులు ఉపాధి కల్పించాలి. 7రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలి,ప్రతిరోజూ అప్ డేట్ చేయాలి,ప్రతి పని పారదర్శకంగా చేయాలి.ఫిర్యాదులకు ఏమాత్రం అవకాశం ఇవ్వరాదు.మెటీరియల్ కాంపోనెంట్ 40%కు మించకుండా చూడాలన్నారు.వేజ్ కాంపోనెంట్ ను ప్రతిజిల్లాలో 60%కు పెంచుకోవాలని’’ ముఖ్యమంత్రి సూచించారు. ‘‘అభివృద్ధి సంతృప్తస్థాయికి చేరేందుకు ఉపాధి హామీ పథకం(నరేగా) ఒక సోపానం. నిధుల సమీకరణ(కన్వర్జన్స్)ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. నరేగా నిధులు ఎంత ఖర్చుచేస్తే అంతగా మౌలికవసతులు కల్పించవచ్చు, మరోవైపు నిరుపేదలకు ఉపాధి పెంచవచ్చు’’ అంటూ గ్రామీణ మౌలిక వసతుల కల్పనలో దీనిని పూర్తిస్థాయిలో వినియోగించు కోవాలన్నారు.

కందులు,అపరాలకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలి

‘‘రైతుల్లో ఎక్కడా అశాంతి తలెత్తకూడదు,ప్రొక్యూర్ మెంట్ మన బాధ్యత. కందులు,మినుము,అపరాలకు గిట్టుబాటుధర వచ్చేలా చూడాలి. మార్కెట్ జోక్యం ద్వారా రైతుకు గిట్టుబాటు ధర లభించేలా చేయాలి’’ అని ముఖ్యమంత్రి అన్నారు. రాబోయే ఖరీఫ్ కు భూసార పరీక్షలపై దృష్టి సారించాలని అన్నారు. తెగుళ్ల బెడద నియంత్రణలో, పీల్చే గాలి నాణ్యత(ఎయిర్ క్వాలిటి)లో వ్యవసాయ శాఖ, వాతావరణ శాఖ, ఇస్రో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమస్య రాకముందే దానిని నియంత్రించే సామర్ధ్యం పెరగాలన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. అసెంబ్లీ ఉన్నా,సమ్మిట్ ఉన్నా క్రమం తప్పకుండా టెలికాన్ఫరెన్స్ లు నిర్వహించడం ‘నీరు-ప్రగతి’కిచ్చే ప్రాధాన్యంగా పేర్కొన్నారు. ఒక్కరోజు కూడా దీనిపై అలక్ష్యం చేయకూడదనే ఇంతగా దీనికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ దినేష్ కుమార్, రియల్ టైం గవర్నెన్స్ ఎండి అహ్మద్ బాబు,వ్యవసాయ శాఖ,పంచాయితీ రాజ్ శాఖల కమిషనర్లు హరిజవహర్ లాల్,రామాంజనేయులు,ఇస్రో రాజశేఖర్,అరుణ్ కుమార్, జిల్లాల కలెక్టర్లు,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *