పెట్టుబడులతో రండి..ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఆహ్వానం
పెట్టుబడి దారులకు, ఔత్సాహిక సంస్థలకు ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఆహ్వానం
యూస్ కేసెస్ రూపొందించే వారికి అవకాశాలు
ఈ నెల 21లోపు ప్రతిపాదనలు పంపాలి
డ్రోన్ సిటీ కోసం కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాలు సిద్ధం
డ్రోన్ తయారీ, సేవల రంగాల ప్రోత్సాహానికి ఏపీలో అనువైన వాతావరణం
విజయవాడ: డ్రోన్ పరిశ్రమ రంగంలో దేశానికి ఆంధ్రప్రదేశ్ డ్రోన్ రాజధానిగా అవతరింపజేసే దిశగా వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ సంస్థ తెలిపింది. మన దేశంలో స్వదేశీ పరిజ్ఞానం ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమ డ్రోన్లు తయారు చేసి ప్రపంచ విపణిలో ఒక బలమైన శక్తిగా అవతరించాలన్న లక్ష్యంతో పనిచేస్తోందని పేర్కొంది. ఈ రండంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ ప్రతిపాదనలతో ముందుకు రావాలని ఆ సంస్థ ఒక ప్రకటనలో కోరింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలు, ఆలోచనలకనుగుణంగా ఏపీలో డ్రోన్ రంగం అభివృద్ధి చెందడానికి వీలుగా వ్యూహాత్మక ప్రణాళికలతో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ముందుకెళుతోంది. ఇటు పాలనారంగంలోనూ, అటు ప్రజలకు కూడా డ్రోన్ సేవలు విస్తృతంగా అందుబాటులో తెచ్చేలా, ప్రభుత్వ శాఖలు, ప్రజలు డ్రోన్ సేవలు విస్తృతంగా ఉపయోగించుకునేలా ఆ సంస్థ పనిచేస్తోంది
యూస్ కేసెస్ ప్రతిపాదనలతో రండి
డ్రోన్ ల ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు ఏఏ రంగాల్లో వాటిని ఎంతమేర సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు, వాటి ఉపయోగాలకు సంబంధించి డ్రోన్ కార్పొరేషన్ ఇప్పటికే విస్తృతంగా అధ్యయనం చేసింది. డ్రోన్లను వినియోగించుకునే సందర్భాలు (యూస్ కేసెస్)ను వీలైనన్ని అభివృద్ధి చేయాలన్నదే డ్రోన్ కార్పొరేషన్ లక్ష్యం. ఇప్పటికే 100 యూస్ కేసెస్ గుర్తించడం జరిగింది. వీటికి అధనంగా మరిన్ని యూస్ కేసెస్‌ను అభివృద్ధి చేసి అందుబాటులోకి తేవాలన్న దిశగా ఏపీ డ్రోన్ కార్పొరేషన్ పనిచేస్తోంది. ఇలా కొత్త యూస్ కేసెస్ అభివృద్ధి చేసే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, డ్రోన్ రంగంలో అనుభవమున్న సంస్థలు, వ్యక్తుల నుంచి డ్రోన్ కార్పొరేషన్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొరకు ప్రతిపాదనలు కోరుతోంది.
ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ
కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో 300 ఎకరా విస్తీర్ణంలో దేశంలో ఎక్కడా లేని విధంగా డ్రోన్ సిటీని అభివృద్ధి చేస్తున్నారు. దీనికోసం ఇప్పటికే మాస్టర్ ప్లాన్, స్థల సేకరణ పూర్తి చేశారు. ఈ డ్రోన్ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తులు, సంస్థలు ముందుకు రావాలని ఏపీ డ్రోన్ కార్పొరేషన్ విజ్ఞప్తి చేసింది. దీనికోసం ఇప్పటికే ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ)ని విడుదల చేసింది. ఓర్వకల్లులో ఏర్పాటు చేయబోయే డ్రోన్ సిటీని ప్రపంచ అత్యుత్తమ శ్రేణి డ్రోన్ సిటీగా నిర్మించనున్నారు. ఇక్కడే ప్రత్యేకంగా డ్రోన్ తయారీకి ఒక జోన్, డ్రోన్ పరికరాల తయారీకి ఒక జోన్, టెస్టింగ్ జోన్, ఎంటర్ ప్రెన్యూర్స్ కోసం ప్రత్యేకంగా మరో జోన్, ఎగుమతులు, దిగుమతులకు ప్రత్యేక దసుపాయాలు, పేలోడు, డ్రోన్లు పరీక్షించడానికి ప్రత్యేక ఎయిర్ స్ట్రిప్, ఎగ్జిబిషన్ సెంటర్, ఆడిటోరియం తదితర అన్ని హంగులు ఒకే చోట ఉండేలా ఈ డ్రోన్ సిటీని అభివృద్ధి చేస్తున్నారు. డ్రోన్ తయారీ, సేవల రంగాలకు సంబంధించి పెట్టుబుడులు పెట్టడానికి దేశంలోనే ఇది అత్యంత అనువైన ప్రాంతమని ఇక్కడ పెట్టుబడులు పెట్డానిక సంస్థలు ముందుకు రావాలని ప్రభుత్వం కోరుతోంది. పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే వారికి పలు ప్రోత్సహకాలు కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది.
ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్
డ్రోన్ రంగంలో పెట్టుబడిదారులు, వ్యాపారులు, ప్రజలకు అనుసంధానంగా వ్యవహరించేలా ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏపీ డ్రోన్ మార్ట్ అనే పోర్టల్‌ను రూపొందిస్తోంది. ఇందులో డ్రోన్‌ల ద్వారా వివిధ సేవలందించే సంస్థల జాబితాను ఎంపేనెల్మెంటు చేసి ఆ సంస్థల జాబితాను, వాటి వివరాలు, వాటినెలా సంప్రదించాలి తదితర వివరాలన్నీ అందులో పొందుపరుస్తారు. ప్రజలు, వ్యాపార సంస్థలు, ఇతర సంస్థలు ఏవైనా సరే డ్రోన్ ల ద్వారా తాము ఎలాంటి సేవలు పొందదలచుకున్నారో ఈ పోర్టల్‌కు వెళితే అందులో వారు కోరుకున్న సేవలందించే డ్రోన్ సంస్థల గురించి తెలుసుకునే వీలుంటుంది. ఆ సంస్థలను సంప్రదించి అవి డ్రోన్ ల ద్వారా అందించే సేవలు పొందే వీలు కలుగుతుంది. ఈ వెబ్ పోర్టల్ జాబితాలో పొందుపరచడానికి డ్రోన్ కార్పొరేషన్ తో ఎంపానల్ మెంట్ అవ్వాలని ఆసక్తి కనబరచే సంస్థల నుంచి డ్రోన్ కార్పొరేషన్ బిడ్లు ఆహ్వానిస్తోంది.
21వ తేదీలోపు తమ ప్రతిపాదనలు పంపాలి
ఓర్వకల్లులో డ్రోన్ సిటీ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూసే సంస్థలు, యూస్ కేసెస్ అభివృద్ధికి సంబంధించిన ఔత్సాహికలు, ఔత్సాహిక సంస్థలు ఎంపానల్ మెంట్ కోసం తమ ప్రతిపాదనలను ఈ నెల 21వ తేదీలోపు ఏపీ డ్రోన్ కార్పొరేషన్‌కు ఆన్‌లైన్ ద్వారా అందజేయాలని ఆ సంస్థ కోరింది. వివరాల కొరకు, ప్రతిపాదనలు సమర్పించడం కొరకు www.apsfl.in/notifications.php వెబ్‌సైట్‌ను లేదా వాట్సాప్ నెంబరు +91 79955 11440 ద్వారా సంప్రదించండి.
ప్రభుత్వ శాఖలన్నిటిలోనూ డ్రోన్ సేవలు
రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లోనూ డ్రోన్‌ల సేవలు వినియోగించుకునే దిశగా డ్రోన్ కార్పొరేషన్ పనిచేస్తోంది. ఎక్కడ వీలుంటే అక్కడ డ్రోన్‌లు ఉపయోగించుకుని ప్రజలకు మెరుగైన సేవలందించే దిశగా ఆయా శాఖలతో డ్రోన్ కొర్పరేషన్ సమన్వయం చేసుకుని డ్రోన్‌ల పరంగా సాంకేతిక సహకారం అందిస్తుంది. గనుల శాఖ, పురపాలక శాఖ, రెవెన్యూ, అటవీ శాఖ, ఆర్ అండ్ బీ శాఖ, పంచాయతీరాజ్, పర్యావరణం, నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ, హోం శాఖ, దేవాదాయ శాఖ తదితర అనేక శాఖల్లో డ్రోన్ సేవలు విరివిగా వినియోగించుకునే దిశగా ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టామని ఏపీ డ్రోన్ కార్పొరేషన్ వర్గాలు వెల్లడించాయి.