ap news

టార్గెట్ల పేరుతో టార్చర్ చేయద్దు

ఆత్మహత్య చేసుకున్న న్యూస్ కంట్రిట్యూర్ 

నివాళి అర్పించిన టియూడబ్ల్యూజే నేత విరాహత్ అలీ

యాడ్స్ టార్గెట్ల పేరుతో జర్నలిస్టులను మీడియా సంస్థల నిర్వాహకులు టార్చర్ పెడుతుండడంతో మానసిక వత్తిళ్లకు గురై వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది… జర్నలిస్టులు వార్తల సేకరణకు నియామకం అవుతున్నారే తప్పా, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ చేసే పనులు చేయడానికి కాదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అన్నారు.
ఓ వైపు అప్పుల భారం, మరోవైపు తాను పనిచేస్తున్న మీడియా సంస్థ యాడ్స్ వేధింపులు భరించలేక మెదక్ జిల్లా నర్సాపూర్ వార్త పత్రిక సీనియర్ పాత్రికేయుడు ప్రవీణ్ కుమార్ గౌడ్ నిన్న రాత్రి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కారణాలను అతను సూసైడ్ నోట్ లో వెల్లడించాడు. కాగా సోమవారం నాడు అతని అంత్యక్రియలు నర్సాపూర్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా విరాహత్ అలీ స్థానిక విలేకరులతో మాట్లాడారు. అసలే జీతం, భత్యం లేని ఉద్యోగంలో కొనసాగుతూ బ్రతుకుబండిని అతికష్టంగా లాగుతున్న లోకల్ రిపోర్టర్లపై లక్షల రూపాయల యాడ్స్ టార్గెట్లను విధించడం సహించారనిదన్నారు. కొన్ని మీడియా సంస్థల టార్గెట్లను భరించలేక గ్రామీణ ప్రాంతాల్లో విలేకరులు మానసికంగా కృంగి పోతున్నారని, ఈ క్రమంలోనే సున్నితమైన మనస్తత్వం కలిగివున్న విలేకరులు తనువుచాలిస్తున్నారని, దీనికి తాజా సాక్ష్యం ప్రవీణ్ గౌడ్ ఆత్మహత్యేనని విరాహత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై తాము ఐజేయూ సహకారంతో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామన్నారు. కష్టాల పరిష్కారానికి ఆత్మహత్యలు మార్గం కాదని, మనోధైర్యంతో ముందుకు సాగాలని గ్రామీణ విలేఖరులను ఆయన కోరారు. మెతుకుసీమ వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ప్రవీణ్ పోషించిన పాత్ర చిరస్మరణీయమైందన్నారు
అంతేకాకుండా ప్రజా గొంతుకగా ప్రజల కోసం పనిచేసిన ఉత్తమ పాత్రికేయుడని ఆయన కొనియాడారు. ప్రవీణ్ కుటుంబానికి తాము అండగా నిలబడతామన్నారు. ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే మెదక్ జిల్లా శాఖ అధ్యక్షుడు శంకర్ దయాల్ చారీ, యూనియన్ సీనియర్ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి, సంతోష్, ఆనంద్, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ తదితరులు ప్రవీణ్ మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *