అన్నదాతలపై అక్రమ కేసులు దుర్మార్గం
- చెరకు రైతులపై కేసులు ఎత్తివేయాలి
- టీడీపీ అదినేత చంద్రబాబు
అరాచకాలు రోజుకోజుకీ పేట్రేగి పోతున్నాయి. విజయనగరం జిల్లా లచ్చయ్య పేటలో చెరకు బకాయిలు చెల్లించాలని నిరసన తెలుపుతున్న రైతులపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నపూర్ణగా పేరొందిన రాష్ట్రంలో అన్నదాతలపై అక్రమ కేసులు సిగ్గుచేటు. బకాయిలు చెల్లించమని కోరిన రైతులపై అక్రమ కేసులు పెట్టడం ఏంటి? అన్యాయానికి గురైన రైతులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే నియంతలా వ్యవహరించటం సరికాదు. పొలంలో వ్యవసాయం చేస్తూ సమాజ సేవ చేసే రైతులు జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసే పరిస్థితి నెలకొంది. రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా తమ సమస్యల కోసం నిరసన తెలిపిన రైతులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ రైతులంటే చులకన భావంతో చూస్తున్నారు. అమరావతి రైతులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపారు, ఇప్పుడు చెరకు బకాయిలు చెల్లించమన్నందుకు విజయనగరం రైతులపై కేసులు పెట్టారు. అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి. వారికి తక్షణమే బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.