ap news

వారాహి..పవన్ ఎన్నికల వాహనం

రెడీ ఫర్ బ్యాటిల్ అంటూ ట్యాగ్ లైన్ 

ట్రయల్ రన్ ను పరిశీలించిన జనసేన అధినేత 

ఇదే వాహనంలో త్వరలో యాత్ర

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల వాహనం సిద్ధమైంది. వాహనానికి ‘వారాహి’ అని పేరు పెట్టారు. ఆయన త్వరలో ఈ వాహనంలోనే రాష్ట్రంలో రాజకీయ యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు వాహనాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.  వారాహి వాహనానికి రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్’ అనే ట్యాగ్ లైన్ కూడా  పెట్టారు. దుర్గాదేవి సప్త మాతృకల్లో ఒకరు వారాహి ఒకరు..ఆ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారు. అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతాయి. ట్రయల్ రన్ ద్వారా ఈ వాహనాన్ని పవన్ కళ్యాణ్ భుధవారం హైదరాబాద్ లో పరిశీలించారు. ఈ వాహనానికి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలను పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి ఇచ్చారు. వాహనాన్ని తీర్చిదిద్దుతున్న సాంకేతిక నిపుణులతోను చర్చించారు.

స్పెషల్ లైటింగ్… లేటెస్ట్ సౌండ్ సిస్టమ్స్
వారాహి.. వాహనాన్ని ప్రత్యేక భద్రత చర్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దారు. వాహనం నుంచి పవన్ కళ్యాణ్  ప్రసంగించే సందర్భంలో లైటింగ్ పరమైన ఇబ్బందులు లేకుండా వాహనం చుట్టూ లైట్లు ఏర్పాట్లు చేశారు. ఆధునిక సౌండ్ సిస్టం వినియోగించారు. వేల మందికి స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం వినిపడేలా ఈసౌండ్ సిస్టం ఉంటుంది. వాహనానికి నలువైపులా సీసీ కెమెరాలు అమర్చారు. వాహనం నిలిపిన, సభ నిర్వహించే ప్రదేశంలో పరిస్థితి రికార్డయ్యే ఫుటేజ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్వర్ కి రియల్ టైంలో వెళ్తుంది. 2008 నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్  పర్యటనల్లో ఎదురయిన అంశాలని దృష్టిలో ఉంచుకొని భద్రత చర్యలు తీసుకున్నారు.
కొండగట్టులో పూజలు
వాహనం లోపల పవన్ కళ్యాణ్ తో పాటు మరో ఇద్దరు కూర్చుని చర్చించుకునే ఏర్పాటు ఉంది. అక్కడి నుంచి హైడ్రాలిక్ విధానంలో మెట్లు ఉంటాయి. వాటి ద్వారా వాహనం మీదకు చేరవచ్చు.జగిత్యాల జిల్లా కొండగట్టు క్షేత్రంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. తదుపరి ఈ వాహనం పర్యటనకు వస్తుంది.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *