ap news

అమరావతిని మార్చటం ఎవరి తరం కాదు

సభలో మాట్లాడుతున్న మన్నవ సుబ్బారావు

వాషింగ్టన్ డీసీ(అమెరికా), డిసెంబర్ 16: అమరావతి రాజధానిని మార్చడం ఎవరితరం కాదని గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు అన్నారు. అమరావతి రాజధాని ఉద్యమానికి మూడేళ్లు పూర్తైన సందర్భంగా, ఢిల్లీలో రైతులు చేపట్టబోతున్న నిరసన కార్యక్రమానికి మద్దతుగా వాషింగ్టన్ డీసీలో అమెరికన్ పార్లమెంట్ భవనం ముందు నిలబడి ప్రవాసాంధ్రులు సంఘీభావం తెలియజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కొవ్వొత్తులు వెలిగించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సమావేశానికి భాను మాగులూరి అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా మన్నవ మాట్లాడుతూ.. రాజధానిని మార్చే అధికారం ప్రభుత్వానికి లేదని తెలిసి కూడా మూడు రాజధానులంటూ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. రైతులు ఉదారంగా భూములు ఇవ్వడమే నేరంలా కనిపిస్తోంది. 2019 డిసెంబర్ 17న జగన్ రెడ్డి మూడు రాజధానులు ప్రకటించి అమరావతి రాజధానికి మరణశాసనం రాశారు. సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉన్న సమయంలో ప్రభుత్వం గర్జనలు, ర్యాలీలు, ఆత్మగౌరవ సభలు ఎందుకు పెడుతోందని ప్రశ్నించారు. మూడేళ్లుగా మూడు రాజధానుల పేరుతో ఆడిన అబద్దాలు, అర్థసత్యాలు, నాటకాలు జగన్ రెడ్డి నగ్నత్వం దేశం నలుచెరుగులా బహిర్గతమైంది. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని యావత్ తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు.

ప్ల కార్డులు ప్రదర్శిస్తున్న దృశ్యం

తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన మాట్లాడుతూ.. ఎన్నికల్లో అద్భుతమైన రాజధాని నిర్మిస్తానని, గెలిచిన తర్వాత మూడు రాజధానులు కడతానని, నాలుగేళ్ల తర్వాత తెలంగాణలో కలిపితే రాజధానే అవసరం లేదని జగన్ రెడ్డి భావిస్తున్నట్లు ఉంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రే రాజధాని అంశాన్ని ఉద్దేశపూర్వకంగా వివాదాస్పదంగా మార్చారు. మూడు రాజధానుల నిర్ణయం ఒక రాజకీయ వికృత క్రీడ. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని బలిపీఠం మీద పెట్టారు.

భాను మాగులూరి మాట్లాడుతూ.. విశాఖలో తన అవినీతి సామ్రాజ్య విస్తరణ కోసం అమరావతిని సమాధి చేశారు. ఇప్పుడు రాజధాని రైతులు చేస్తున్న పోరాటం ఒక్క అమరావతిలో రాజధాని కొనసాగించాలని మాత్రమే కాదు.. జగన్ రెడ్డి చేస్తున్న అరాచకాలపైన, అహంకార, ప్రతీకార చర్యలపై జరుగుతున్న పోరాటం. ప్రవాసాంధ్రులు ముక్తకంఠంతో అమరావతిలోనే రాజధాని కొనసాగాలని కోరుకుంటున్నారు.

ఈ కార్యక్రమంలో కిషోర్ కంచర్ల, రమేష్ అవిర్నేని, సిద్ధార్థ బోయపాటి, హనుమంతరావు వెంపరాల, రమేష్ బాబు గుత్తా, కిరణ్ మావిళ్లపల్లి, శివప్రసాద్ వంగల్లు, కాశీం వెలుతుర్ల, సీతారాం, రామినేని వినీల్, రామకృష్ణ ఇంటూరి, శ్రీనాథ్ రావుల, వెంకటేశ్వరరావు ఎమ్, వీర నారాయణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *