ఆప్కో ఆషాడం రాయితీలు
ఆషాఢ మాసం సందర్భంగా జూన్ 19 సోమవారం నుండి ఆప్కో వస్త్ర విక్రయశాలల్లో అన్ని రకాల చేనేత వస్త్రాలపై ప్రత్యేక రాయితీ అందిస్తున్నట్లు సంస్ధ ఎండి ఎంఎం నాయక్ తెలిపారు. ఈ ఆషాడ మాసం సందర్భంగా చేనేత వస్త్రాలన్నింటిపై 30 శాతం రాయితీ, ఎంపిక చేయబడిన చేనేత వస్త్రాలపై 50 శాతం రాయితీని అందిస్తున్నామన్నారు. కొన్ని ప్రత్యేక రకాలపై 66శాతం డిస్కౌంట్ సైతం అందుబాటులో ఉందని నాయక్ వివరించారు. వినియోగదారులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నాణ్యమైన చేనేత వస్త్రాలను ఆప్కో షోరూమ్ ల నుండి విరివిగా కొనుగోలు చేసి, రాష్ట్రంలోని చేనేత కళాకారులను ప్రోత్సహించి, వారికి మంచి ఉపాధి అవకాశాలు కల్పించటంలో తోడ్పడాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
చేనేత ఒక సాంప్రదాయ ప్రాచీన కళకాగా, ఆరోగ్యదాయకమైన చేనేత వస్త్రాలు హుందాతనాన్ని ఇస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైపుణ్యం గల చేనేత కార్మికులు, చేతితో మగ్గంపై నేసినటువంటి కాటన్, పట్టు వస్త్రాలు భారతదేశంలోనే కాక ఇతర దేశాలలో కూడా మంచి ప్రాచుర్యం పొందాయని, బందరు పేటు చీరలు, ఉప్పాడ జందాని సిల్క్ చీరలు, చీరాల ఫ్యాన్సీ చీరలు, వెంకటగిరి జరీ, సిల్కు చీరలు, మదనపల్లి, మాధవరం చీరలు, మంగళగిరి పంజాబీ డ్రెస్ మెటీరియల్, పెద్దాపురం పట్టు ధోవతులు, పొందూరు ధోవతులు, పొందూరు, చెరుకుపల్లి షర్టింగు, బెడ్ షీట్లు లుంగీలు, టవల్స్, గృహోపయోగ వస్త్రములపై రాయితీ ఉందన్నారు. నూతన వెరైటీలపై సైతం ఈ ప్రత్యేక రాయితీ అందుబాటులో ఉందని ఎంఎం నాయక్ పేర్కొన్నారు.