ap news

బర్డ్ ఫ్లూపై ఆందోళన అవసరం లేదు

    • ఐసీఎంఆర్ బృందంతో సీఎం చంద్రబాబునాయుడు
  • బాలిక మృతి ఘటనపై ఐసీఎంఆర్ బృందం అధ్యయనం
  • వ్యాధి నిరోధక శక్తి లేకపోవడం, అపరిశుభ్ర వాతావరణం, లెప్టోస్పిరోసిస్ కూడా కారణమని నిర్ధారణ
  • ఐసీఎంఆర్ బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

అమరావతి, ఏప్రిల్ 4 : నరసరావుపేటలో బర్డ్ ఫ్లూ వైరస్‌ (H5N1) లక్షణాలతో ఇటీవల బాలిక మృతి చెందిన ఘటనపై అధ్యయనం కోసం రాష్ట్రానికి వచ్చిన ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. నరసరావుపేటలో పర్యటన అనంతరం తనను కలిసిన ఐసీఎంఆర్ బృందంతో బాలిక మృతికి గల కారణాలను చర్చించారు. బాలిక నుంచి సేకరించిన నమూనాలలో H5N1 లక్షణాలు బయటపడినప్పటికీ, ఇతర అనారోగ్య కారణాలు కూడా బాలిక మృతి చెందడానికి దారితీశాయని బృందం సభ్యులు చెప్పారు. ఉడికించని మాంసం తినడం, చిన్నారి కావడంతో వ్యాధి నిరోధకశక్తి లేకపోవడం, లెప్టోస్పిరోసిస్(ఎలుకల విసర్జన వల్ల వ్యాపించే వ్యాధి), అపరిశుభ్ర వాతావరణం కూడా మృతికి కారణాలుగా తమ అధ్యయనంలో తేలిందన్నారు. ప్రస్తుతం ఆ పరిసర ప్రాంతంలో ఎలాంటి బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని, 8 బృందాలతో సర్వే చేపట్టామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. చిన్నారి కుటుంబ సభ్యులతో పాటు… బంధువులు, స్థానికుల నమూనాలు పరీక్షించామని… ఎవరికీ బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని చెప్పారు. దీనిపై ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి కేసులు నమోదుకాకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో యాంటీవైరల్ డ్రగ్స్ సిద్ధం చేశామని అధికారులు తెలిపారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *