# andhravani.net

online news portal

- Site: https://andhravani.net/

## వామపక్ష అభ్యర్ధులను గెలిపించండి

- Link: https://andhravani.net/ap-news/rsp-calls-for-the-election-of-left-wing-candidates-in-local-body-polls/7330/
- Published: 2026-10-19T13:31:46+00:00
- Author: andhravani

![](https://andhravani.net/wp-content/uploads/2026/10/rsp-one-e1792417274621-193x300.
jpg)

#### **ఆర్ ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి రాములు పిలుపు**

రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న రెవల్యూషనరీ సోషలిస్ట్
పార్టీ (ఆర్ఎస్పి), సీపీఐ, సీపీఎం అభ్యర్ధులకు ప్రజలు మద్దతుగా నిలిచి గెలిపించాలని
ఆర్‌ఎస్‌పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న
సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ, ప్రజా హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న
వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్దతు ఇవ్వాల్సిన
అవసరాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. స్థానిక సంస్థలు ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తూ,
గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన 
అవసరం ఉందన్నారు. ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం 
నిరంతరం కృషి చేసే నాయకత్వానికి ఎన్నికల్లో అవకాశం కల్పించాలి..ప్రజా సమస్యల పరిష్కారం,
సామాజిక న్యాయం, ప్రజా హక్కుల పరిరక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ స్థానిక సంస్థల
ఎన్నికల్లో వామపక్ష పార్టీల అభ్యర్థులు ప్రజల ముందుకు వస్తున్నారని రాములు తెలిపారు.

## రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు దసరా శుభాకాంక్షలు

- Link: https://andhravani.net/ap-news/ap-cm-chandrababu-naidu-extends-his-best-wishes-to-the-people-of-the-state/7324/
- Published: 2026-10-19T13:07:21+00:00
- Author: andhravani

![](https://andhravani.net/wp-content/uploads/2026/10/cm-dasara-e1792415206592-296x300.
jpg)

రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా
నిలిచే దసరా పండుగ మనకు గొప్ప స్ఫూర్తిని ఇస్తుంది. రైతన్న శ్రమకు తగిన ఫలితం, మహిళలకు
సాధికారత, యువతకు మంచి భవిష్యత్తు అందించేందుకు మేం చేస్తున్న సంకల్పానికి ఆ జగన్మాత
అనుగ్రహం లభించాలని ప్రార్ధిస్తున్నాను. ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ అన్ని
రంగాల్లో విజయాలు సాధిస్తూ, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో,
ఆయురారోగ్యాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర
ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు.

## ఏపీని బాబు తగలబెడుతున్నారు

- Link: https://andhravani.net/ap-news/bode-ramachandra-yadav-lashes-out-claiming-chandrababu-is-setting-ap-ablaze/7315/
- Published: 2026-10-19T12:24:50+00:00
- Author: andhravani

**బెంగళూరులో జగన్ ఫిడేలు వాయిస్తున్నారు**

**ధ్వజమెత్తిన  బీసీవై అధినేత బోడె రామచంద్రయాదవ్**

**స్థానిక ఎన్నికల్లో టీడీపీ అరాచకాలు.. **

**వైఎస్సార్సీపీ ‘వెర్షన్ 2.0’ను తలపిస్తున్న వైనం**

**మైదుకూరులో ఒక న్యాయం.. కనిగిరిలో మరో న్యాయమా..**

**అమరావతి, ఆంధ్రావని :**  లా అండ్ ఆర్డర్ విషయంలో తనను మించిన వారు లేరని చెప్పుకునే
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో టీడీపీ నాయకులు
రాష్ట్రాన్ని తగలబెడుతుంటే.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాత్రం రోమ్ నగరం
తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నట్లుగా బెంగళూరుకు వెళ్లిపోయారని భారత
చైతన్య యువజన (బీసీవై) పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్రయాదవ్ తీవ్రంగా
విమర్శించారు. అధికారం కోల్పోయిన తర్వాత జగన్ రాష్ట్రంలో కంటే కర్ణాటకలోనే ఎక్కువ సమయం
గడుపుతున్నారని, ఆయన వల్ల ఏపీ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు. అధికారం
ఉన్నప్పుడు రాష్ట్ర సంపదను దోచుకోవడానికి రాబందుల్లా వచ్చే ఈ రెండు పార్టీల నేతలు, 
ఆ తర్వాత పక్క రాష్ట్రాలైన హైదరాబాద్, బెంగళూరుల్లో సేదతీరుతున్నారని మండిపడ్డారు.

**మైదుకూరులో ఒక న్యాయం..కనిగిరిలో మరో న్యాయమా..**

కడప జిల్లా మైదుకూరులో నామినేషన్ చించేశారని చెప్పి ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల 
సంఘం.. ప్రకాశం జిల్లా కనిగిరిలో బీసీవై పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నామినేషన్‌ను
బహిరంగంగా చించేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. పోలీసులు ప్రేక్షకపాత్ర 
వహించడం, మార్కాపురం కలెక్టర్ నుంచి నివేదిక వెళ్లినప్పటికీ కనిగిరిలో ఎన్నికలను రద్దు
చేసి రీ-నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రాంతానికో న్యాయం, పార్టీకో 
నిబంధన అన్నట్లుగా ఎస్ఈసీ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమిలో భాగస్వామిగా
ఉన్న బీజేపీ అభ్యర్థుల నామినేషన్లను దౌర్జన్యంగా చించేస్తున్నా, చంద్రబాబుకు కోపం వస్తుందనే
భయంతో ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం మౌనంగా ఉండటం హాస్యాస్పదమన్నారు. దౌర్జన్యంగా నామినేషన్లు
చించేసిన ప్రతి చోటా వెంటనే ఎన్నికలు రద్దు చేసి, మళ్లీ సజావుగా ఎన్నికలు నిర్వహించేలా
రీ-నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

## బాలినేని ఎక్కడ..!

- Link: https://andhravani.net/prakasam/where-is-balineni-will-he-support-the-mayoral-candidate-for-ongole/7300/
- Published: 2026-10-19T04:25:24+00:00
- Author: andhravani

![](https://andhravani.net/wp-content/uploads/2026/10/Balineni-Where_-Telugu-News-
Portrait-1024x791.jpg)

 * **ఎన్నికలకు దూరంగా హైదరబాద్ లోనే ఉంటారా..**
 * **ఒంగోలు మేయర్ కూటమి అభ్యర్ధికి మద్దతిస్తారా..**
 * **బాలినేనిని రాజకీయంగా ఉపయోగించుకోవటంలోజనసేన ఇంటెలిజెన్సీ ఘోర వైఫల్యం**
 * **నలుగురితో కలిసి అప్రాధాన్యత పోస్ట్ ఇచ్చి అవమానం**

మాజీ మంత్రి, జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి (వాసు) ఎక్కడ..ఒంగోలు మేయర్ ఎన్నికల్లో
కూటమి అభ్యర్ధికి మద్దతిస్తారా..మౌనంగా అన్నీ గమనిస్తూ హైదరబాద్ లో ఉండిపోతారా..రాజకీయవర్గాల్లో
దీనిపై జోరుగా చర్చ నడుస్తోంది. బాలినేని నమ్ముకుని వైసీపీ నుంచి ఆయన వెంట వచ్చిన అనుచరగణం
ఎలాంటి వైఖరి అనుసరించాలనే విషయంపైనా అయోమయాన్ని ఎదుర్కొంటున్నారు. ‘స్థానిక పరిస్థితులకు
అనుగుణంగా మీ ఇష్టమైన లైన్ తీసుకోండి‘ అని బాలినేని ఇప్పటికే తన అనుచరులకు స్పష్టం 
చేసినట్టు ప్రచారం కొనసాగుతుంది. అయిదుసార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు మంత్రి..అంతకు
ముందు కాంగ్రెస్ లో, ఆ తరువాత వైసీపీలో తిరుగులేని నాయకుడిగా చక్రం తప్పిన బాలినేని
పరిస్థితి** ‘అధికారాంతమున చూడవలె అయ్యవారి సొబగు’** అన్న చందంగా మారింది. జనసేనలోనూ
బాలినేని ప్రభంజనమే వీస్తుందని ఆయన అనుచరులు, అభిమానులు భావించారు. అలాంటి సంకేతాలు
ప్రారంభంలో ఉన్నప్పటికీ ఆ తరువాత బాలినేనిని జనసేన ఒక్కో మెట్టూ తగ్గిస్తూ కిందకు దించింది.
ఇటీవల కాలంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, బాలినేని మధ్య నడిచిన వార్ పతాక స్థాయికి
చేరింది. **జనార్దన్, వాసుల మధ్య రాజకీయ రగడ కాస్తా వ్యక్తిగత స్థాయికి ఎగబాకింది. 
రెండు పార్టీల హైకమాండ్ మాటల యుద్దాన్ని ముగించాలని ఆదేశించాయి.** తాత్కాలికంగా మాటల
యుద్ద విరమణ జరిగినా కడుపులో కత్తులకు ఇద్దరూ పదును పెడుతూనే ఉన్నారు. ఈ దశలో జనసేన
అధిష్టానం బాలినేని తీవ్రంగా అవమానించే నిర్ణయం తీసుకుంది. మరో ముగ్గురితో కలిసి ఆయనను
ఒంగోలు పార్లమెంటు పర్యవేక్షుకుల జాబితాలో చేర్చింది. **ఒక మాజీ మంత్రి, నిన్న మొన్నటి
దాకా వైసీపీలో కీలక నాయకుడు, ప్రకాశం జిల్లా అంతటా తనకంటూ అనుచరగణం ఉన్న నాయకుడిని 
రాజకీయంగా ఉపయోగించుకోవటం చేతకాని జనసేన ఇంటెలిజెన్సీ వైఫల్యానికి ఇది నిదర్శమని రాజకీయ
పరిశీలకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో సవాలక్ష చాడీలను అటూ, ఇటూ మోసే బ్యాచ్ ఉంటారు.
వాళ్లంతా ‘బాలినేని వైసీపీ కోవర్టు’గా పనిచేస్తున్నాడనీ, జగన్ అజెండాను కుట్రపూరితంగా
ఒంగోలులో అమలు చేస్తున్నాడని మోశారు.** వెంటనే బాలినేని ప్రాధాన్యతను తగ్గించారు. అసలు
ఏ పదవీ ఇవ్వకపోయినా పర్వాలేదు..ఇలా అవమానిస్తారా అని బాలినేని అనుచరగణం మండిపోయింది.
ఈ నేపథ్యంలోనే బాలినేని హైదరబాద్ కు పరిమితమయ్యారు. స్థానిక ఎన్నికలను బాలినేని పట్టించుకోనట్టేనని
సమచారం.

**జనార్దన్ వ్యూహాత్మక విజయం**

బాలినేని-దామచర్లకు మధ్య నడిచిన పొలిటికల్ వార్ లో దామచర్ల వ్యూహాత్మకంగా విజయాన్ని
సాధించారు. అంతేకాదు..ఒకప్పుడు బాలినేని సొంత మనిషిగా ముద్ర ఉన్న నల్లమల్లి బాలు ఆ 
తరువాత దూరమయ్యాడు. ఇపుడు అతని సతీమణి శ్రీశిల్పకు టికెట్ ఇప్పించారు. నల్లమల్లి శ్రీశిల్పకు
టికెట్ రావటంలో ఇది కూడా ఒక ప్లస్ అయిందన్న అభిప్రాయం ఉంది. **మరో వైపు టీడీపీ నేతలే
కొందరు ఒకప్పుడు దామచర్ల జనార్దన్ ను తీవ్రంగా విమర్శించిన నల్లమల్లి బాలు వీడియోలను
సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.** రాజకీయాల్లో ఇవన్నీ మామూలే.. వాటన్నిటినీ ప్రజలు
పట్టించుకోరు..పార్టీలు కూడా పట్టివంచుకోవు.

## రాష్ట్రంలో పచ్చ ముఠాల అరాచకాలు

- Link: https://andhravani.net/ap-news/ys-jagan-demands-extension-of-the-deadline-for-nominations/7279/
- Published: 2026-10-18T15:35:42+00:00
- Author: andhravani

**ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ దాడులు**

**నామినేషన్లనూ వేయనివ్వడం లేదు**

**దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ఎస్‌ఈసీదే**

**మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి**

స్థానిక ఎన్నికల నామినేషన్ల పర్వంలో రాష్ట్రంలో మూడు రోజులుగా సాగుతున్న అధికార పార్టీ
అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)ను కలిసిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ
అధినేత వైయస్‌ జగన్‌ ఫిర్యాదు చేశారు.ఎస్‌ఈసీ అనిల్‌ చంద్ర పునేఠతో భేటీ తర్వాత  ఆయన
మీడియాతో మాట్లాడారు.

**నామినేషన్లు వేయలేకపోతే ఎస్‌ఈసీ పరువు పోతుంది**

**నామినేషన్ల దాఖలు గడువు వెంటనే పెంచాలి**

**సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్‌ ఎస్కార్ట్‌ ఇవ్వాలి**

**ఎస్‌ఈసీకి  వైయస్‌ జగన్‌ విజ్ఞప్తి**

రాష్ట్రంలో గతి తప్పిన పోలీస్‌ వ్యవస్థ

తక్షణమే కేంద్ర పారా మిలటరీ బలగాలు దించాలి

పోలింగ్‌ కేంద్రాలు, బ్యాలెట్‌ బాక్సుల తరలింపు. స్టోర్‌

అన్ని చోట్లా సీసీ టీవీ లైవ్‌ టెలికాస్ట్‌ ఇవ్వాలి

**అమరావతి, ఆంధ్రావని : ** రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ 
సందర్భంగా చోటు చేసుకుంటున్న దౌర్జన్యాలు, టీడీపీ శ్రేణుల హింసాకాండ, వైయస్సార్‌సీపీ
అభ్యర్థులపై అక్రమ కేసులు, అరెస్టులు, నామినేషన్‌ పత్రాలను చించివేస్తున్న ఘటనలు, అలాగే
పుంగనూరులో వైయస్సార్‌సీపీ లోక్‌సభ పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం,
పులివెందులలో పోలీసుల బాష్పవాయు ప్రయోగం, గాలిలోకి కాల్పుల ఘటనలపై మాజీ ముఖ్యమంత్రి,
వైయస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) అనిల్‌
చంద్ర పునేఠకు ఫిర్యాదు చేశారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కార్యాలయంలో
ఆయన్ను కలిసిన శ్రీ వైయస్‌ జగన్, ఆ తర్వాత ఆ ఆఫీస్‌ వద్దే మీడియాతో మాట్లాడారు.

**ప్రజాస్వామ్య వ్యవస్థలను ఫణంగా పెట్టొద్దు**

ఇవాళ ఎస్‌ఈసీ అనిల్‌ చంద్ర పునేఠ కలిసి గట్టిగా రిక్వెస్ట్‌ చేయడం జరిగింది. ఒక స్టేట్‌
ఎలక్షన్‌ కమిషనర్‌గా నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన రాజ్యాంగబద్ధమైన
బాధ్యత మీపై ఉంది. ఈ వ్యవస్థను ఏ ఒక్కరి స్వార్థం కోసం కూడా ఫణంగా పెట్టకూడదన్న అంశాన్ని
కమిషనర్‌కు స్పష్టంగా నొక్కి చెప్పడం జరిగింది. మాకు అందిన సమాచారం మేరకు దాడులకు సంబంధించిన
తాజా పరిస్థితులతో కూడిన జాబితాను కూడా ఆయనకు అందజేశాం.

**ఒక్కరు నామినేషన్‌ వేయలేకపోయినా ఎస్‌ఈసీ పరువే పోతుంది**

ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరైనా, ఏ ఒక్క ప్రాంతంలోనైనా ‘నేను నామినేషన్‌ వేయాలనుకున్నాను..
కానీ నన్ను వేయనివ్వలేదు’ అన్న మాట వస్తే, పోయేది రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పరువే అని
గట్టిగా చెప్పాం. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎస్పీలే స్వయంగా ముందుండి ఎస్కార్ట్‌ ఇచ్చి
వైయస్సార్‌సీపీ అభ్యర్థులందరితో నామినేషన్లు వేయించాల్సిన రాజ్యాంగ ధర్మం ఉంది. దీనిపై
కమిషనర్‌ సానుకూలంగా స్పందిస్తూ.. సమయం పొడిగించి అయినా సరే రాష్ట్రంలో పోటీ చేయాలనుకున్న
ప్రతి ఒక్కరితో నామినేషన్‌ వేయిస్తామని హామీ ఇచ్చారు.

**గురజాలలో అభ్యర్థులనే అక్రమంగా అరెస్ట్‌ చేసిన పోలీసులు**

గురజాల నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో స్వయంగా పోలీసులే మున్సిపల్‌ చైర్‌పర్సన్‌
అభ్యర్థులపై దొంగ కేసులు బనాయించి అక్రమంగా అరెస్ట్‌ చేసి పోటీకి దూరం చేస్తున్నారు.
అక్రమంగా నిర్బంధించిన ఆ అభ్యర్థులను పోలీసులు వెంటనే తీసుకొచ్చి వారితో నామినేషన్లు
వేయించాలని గట్టిగా డిమాండ్‌ చేశాం.

**టీడీపీకి కొమ్ము కాస్తున్న పోలీసులు.**

**వెంటనే కేంద్ర పారా మిలటరీ బలగాలను దించాలి:**

రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ఇంత దారుణంగా సాగుతుంటే, పోలీసులు మాత్రం నిస్సిగ్గుగా
వెన్నుపోటు పార్టీకి, చంద్రబాబునాయుడుగారికి కొమ్ము కాస్తున్నారు. నిబంధనల ప్రకారం 
నలుగురు మాత్రమే వెళ్లాలని మా వైయస్సార్‌సీపీ వాళ్లను ఆపుతున్నారు.. తీరా నామినేషన్‌
కేంద్రాల వద్ద చూస్తే అప్పటికే టీడీపీ వాళ్లు వందల సంఖ్యలో గుమిగూడి మారణాయుధాలతో తిష్టవేస్తున్నారు.
పోలీసుల సమక్షంలోనే మా అభ్యర్థుల చేతుల్లోని నామినేషన్‌ పత్రాలను లాక్కొని చింపేస్తున్నారు.
పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ టీడీపీకి వత్తాసు పలుకుతున్నందున ఎన్నికల విధులకు
వెంటనే కేంద్ర ప్రభుత్వ బలగాలను, పారా మిలటరీ ఫోర్సెస్‌ను దించాలని డిమాండ్‌ చేశాం.

**అన్ని చోట్లా సీసీ కెమెరా ఫుటేజ్‌ కావాలి**

పోలింగ్‌ బూతుల లోపల, బయట సీసీటీవీ లైవ్‌ ఫుటేజ్‌ సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా
లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేయాలి. మాకు చంద్రబాబునాయుడు, వెన్నుపోటు పార్టీ నైజంపై
ఏ మాత్రం నమ్మకం లేదు. వాళ్లు స్ట్రాంగ్‌ రూమ్‌లలో బ్యాలెట్‌ బాక్సులను మారుస్తారన్న
గట్టి నమ్మకం, అనుమానం మాకుంది. అందుకే స్ట్రాంగ్‌ రూమ్‌లలో బ్యాలెట్‌ బాక్సులు ఉంచే
ప్రదేశాల్లో కూడా సీసీటీవీ కెమెరాల లైవ్‌ ఫుటేజ్‌ను ప్రజలందరికీ పబ్లిక్‌ డొమైన్‌లో
ఉంచాలి. కౌంటింగ్‌ హాల్‌లో కూడా సీసీ కెమెరాలు పెట్టి లైవ్‌ టెలికాస్ట్‌ ఇవ్వాలి.

కౌంటింగ్‌ హాల్‌లో పోలింగ్‌ ముగిసిన తర్వాత ఏజెంట్లు సంతకాలు చేసి స్టిక్కర్లు అతికించే’
ఫామ్‌ 17సి’ వెరిఫికేషన్‌ ప్రక్రియ అత్యంత కీలకం. ఆ సంతకాలు సరిపోల్చే ప్రక్రియలో ఎలాంటి
ఫోర్జరీలకు తావు లేకుండా సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్‌ చేసి చూపించాలి. 
ఈ డిమాండ్లపై గతంలోనే మా ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చారు.
ఇవాళ నేను కూడా స్వయంగా వచ్చి వీటిని అమలు చేయాలని గట్టిగా చెప్పాను.

**ఎస్‌ఈసీ చిత్తశుద్ధికి ఇదే పరీక్ష**

మేము అడిగిన వాటన్నింటికీ కమిషనర్‌ గారు తల ఊపారు. ఎస్‌ఈసీ నిజంగా ట్రాన్స్‌పరెంట్‌గా
ఉంటే ఇవన్నీ అమలవుతాయి. కమిషన్‌ పారదర్శకంగా లేకపోతే ఇవేవీ జరగవు. దీన్నిబట్టే వీళ్లు
నిష్పక్షపాతంగా ఉన్నారా లేదా అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమైపోతుంది. ప్రజాస్వామ్యంలో
ప్రజలకు నచ్చిన వారికి ఓటు వేసే స్వేచ్ఛ, నాయకులకు పోటీ చేసేందుకు నామినేషన్‌ వేసే 
హక్కు రాజ్యాంగబద్ధమైనవి. ఈ ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన ధర్మం ఎస్‌ఈసీపైనే ఉంది.

**చంద్రబాబు ప్రైవేట్‌ వాచ్‌మెన్లుగా మారిన పోలీసులు**

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీసు యంత్రాంగం చంద్రబాబునాయుడుగారికి ప్రైవేట్‌
వాచ్‌మెన్లుగా తయారైంది. ఒక ఐజీ, ఆయన కింద డీఎస్పీలు, సీఐలు ఒక సిండికేట్‌ మాఫియాగా
ఏర్పడ్డారు. సాధారణంగా ఏ అధికారైనా ఒకే చోట రెండేళ్లకు మించి ఉండకూడదన్న నిబంధన ఉన్నా,
రెండున్నరేళ్లుగా వాళ్లనే పాత స్థానాల్లో కొనసాగిస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా ఎన్నికలను
నడిపించేందుకే ఈ వ్యవస్థీకత మాఫియాను కంటిన్యూ చేస్తున్నారు. ఈ పోలీసు మాఫియా స్థానిక
ఎమ్మెల్యేలతో కుమ్మక్కై ఇసుక రీచ్‌ల నుంచి లిక్కర్‌ వ్యాపారం దాకా అందినకాడికి దోచుకుంటూ‘
చిన్నబాబుకు ఇంత.. పెద్దబాబుకు ఇంత’ అని వాటాలు పంచుకుంటూ రాష్ట్రాన్ని లూటీ చేస్తోంది.
ఇలాంటి వారి చేతుల్లోనే ఇవాళ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

**పచ్చి టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న డీఐజీ కోయ ప్రవీణ్‌**

డీఐజీ కోయ ప్రవీణ్‌ అచ్చం టీడీపీ కార్యకర్తలా మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన తీరును
చూస్తేనే ఐపీఎస్‌ అనే వృత్తి ధర్మాన్ని, యూనిఫాం టోపీపై ఉన్న మూడు సింహాల గౌరవాన్ని
సైతం గాలికొదిలేసి టీడీపీ తొత్తులా ఎలా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది.

**నిమ్మగడ్డ రమేష్‌ కమిషనర్‌గా ఉన్నా నాడు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపాం:**

గత మా ప్రభుత్వ హయాంలో స్థానిక ఎన్నికలు నిర్వహించినప్పుడు స్టేట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా
ఎవరున్నారు? చంద్రబాబుకు కరడు గట్టిన మద్దతుదారుడైన నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఉన్నారు.
2024 ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించండి అంటూ స్వయంగా బలపం కట్టుకుని తిరిగిన వ్యక్తి
ఆయన. అంతటి వ్యతిరేక వ్యక్తి కమిషనర్‌గా ఉన్నప్పటికీ మా హయాంలో ధైర్యంగా ఎన్నికలకు 
వెళ్లాం. నోటిఫికేషన్‌ రాగానే నిమ్మగడ్డ రమేష్‌ కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీలు, డీఎస్పీలు,
సీఐలను లెఫ్ట్, రైట్, సెంటర్‌ బదిలీలు చేసి ఎన్నికల విధుల నుంచి తప్పించారు. ఈరోజు 
అలాంటి చర్య ఒక్కటైనా జరుగుతోందా? మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేర్చి విద్య, వైద్యం,
వ్యవసాయం, గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు, మహిళా సాధికారత, పారదర్శక పాలన అందించాం కాబట్టే
ప్రజలు మాకు అఖండ విజయాన్ని కట్టబెట్టారు.

**హామీలు మోసాలని తేలడంతో ఎన్నికలు జరిపే ధైర్యం చాలని చంద్రబాబు:**

నేడు చంద్రబాబు ప్రభుత్వంలో సూపర్‌ సిక్స్‌లు లేవు, సూపర్‌ సెవెన్‌లు లేవు.. అన్నీ 
మోసాలుగా తేలిపోయాయి. ఎన్నికలప్పుడు ఇచ్చిన బాండ్లను చేతబట్టుకుని ప్రజలు ‘మాకు మూడేళ్లుగా
బాకీ పడ్డ సొమ్ము ఎప్పుడు ఇస్తారు?’ అని టీడీపీ నేతలను నిలదీస్తున్నారు. లా అండ్‌ ఆర్డర్,
సచివాలయాలు, వాలంటీర్‌ వ్యవస్థ, ఆరోగ్యశ్రీ, విద్యా దీవెన, వసతి దీవెన అన్నీ కుదేలైపోయాయి.
అందుకే చంద్రబాబుకు ఫ్రీ అండ్‌ ఫెయిర్‌ ఎన్నికలు జరిపే ధైర్యం లేక ఇలాంటి కుయుక్తులకు
పాల్పడుతున్నారు.

**మిథున్‌రెడ్డి వాహనంలో బోల్తా పడని మద్యం బాటిళ్లు..**

**పోలీసులే లేని ఆధారాలు సృష్టించారు:**

ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కి సీఆర్పీఎఫ్‌ సెక్యూరిటీ ఉంది. అక్కడ ఏం జరిగిందో
కేంద్ర ప్రభుత్వానికి సాక్ష్యాలతో సహా వాళ్లే ప్రత్యక్ష సాక్షులుగా రిపోర్టులు ఇస్తారు.
మిథున్‌రెడ్డి కేవలం నలుగురితో కలిసి నామినేషన్‌ కేంద్రానికి వెళ్తే, అప్పటికే వేలాదిగా
మోహరించిన టీడీపీ కార్యకర్తలు ఆయనపై దాడి చేశారు. మిథున్‌రెడ్డిని మూడు గంటల పాటు నిర్బంధించి,
నామినేషన్‌ పత్రాలను తీసుకోకుండా అడ్డుకుని, కార్లను ధ్వంసం చేసి హత్యాయత్నం చేశారు.
బోల్తా పడిన కార్లలో మద్యం బాటిళ్లు మాత్రం నిటారుగా నిలబడి ఉన్నాయి! కారు బోల్తా పడితే
మద్యం బాటిళ్లు పడకుండా నిటారుగా ఎలా ఉంటాయి? మద్యం అలవాటు లేని మిథున్‌రెడ్డి కారులో
పోలీసులే దగ్గరుండి బాటిళ్లు పెట్టి, తప్పుడు ఆధారాలు సృష్టించారు. డీఐజీ పరిధిలోనే
ఈ దారుణాలన్నీ జరిగాయి.

**అభ్యర్థులందరితో నామినేషన్లు వేయించే వరకు సమయం పొడిగించాల్సిందే:**

ఈ పరిస్థితుల్లో మధ్యాహ్నం 3:30 దాటినా, రాత్రి 8 గంటల వరకైనా సరే సమయం పొడిగించి అర్హులైన
వైయస్సార్‌సీపీ అభ్యర్థులందరితో నామినేషన్లు వేయించాలని కోరగా కమిషనర్‌ అంగీకరించారని
వైయస్‌.జగన్‌ తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటు హక్కును, పోటీ చేసే స్వేచ్ఛను పరిరక్షించాల్సిన
బాధ్యత కమిషన్‌పైనే ఉందని శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

## కంది రవిశంకర్ తో శ్రీశిల్ప దంపతుల భేటీ

- Link: https://andhravani.net/prakasam/ongole-mayor-tdp-candidate-srisilpa-met-janasena-leader-kandi-ravishankar-as-a-courtesy-call/7268/
- Published: 2026-10-18T13:37:24+00:00
- Author: andhravani

![](https://andhravani.net/wp-content/uploads/2026/10/ravi-300x225.jpg)

కంది రవిశంకర్ ను శాలువతో సత్కరిస్తున్న దృశ్యం

 * **అభినందనలు తెలిపిన రవిశంకర్ **
 * **గెలిపించి తీరుతామని భరోసా**

ప్రముఖ వ్యాపారవేత్త, జనసేన నాయకుడు కంది రవిశంకర్ ను టీడీపీ తరపున ఒంగోలు మేయర్ స్థానానికి
పోటీ చేస్తున్న నల్లమల్లి శ్రీశిల్ప మర్యాదపూర్తకంగా కలిశారు. ఆయనను కలిసిన వారిలో 
ఆమె భర్త నల్లమల్లి బాలు, మాజీ మున్సిపల్ చైర్మన్ యక్కల తులసీరామ్, మాజీ మున్సిపల్ 
వైస్ చైర్మన్ వేమూరి బుజ్జి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీవల్లికి రవిశంకర్ అభినందనలు
తెలిపారు. కలిసికట్టుగా ఎన్నికల్లో పనిచేసి కూటమి అభ్యర్ధి అయిన శ్రీశిల్పను గెలిపించి
తీరుతామని ఈ సందర్భంగా రవిశంకర్ వ్యాఖ్యానించారు.

![](https://andhravani.net/wp-content/uploads/2026/10/ravi-one-300x225.jpg)

## ఒంగోలులో త్రిముఖ పోటీ

- Link: https://andhravani.net/prakasam/triangle-fight-in-ongole-mayor-elections-edara-haribabu-contested-as-independent-candiate/7263/
- Published: 2026-10-18T13:02:28+00:00
- Author: andhravani

#### ![](https://andhravani.net/wp-content/uploads/2026/10/edara-two-300x240.jpg)

#### **రంగంలోకి ఈదర హరిబాబు **⏎  **ఆయన పోటీ ప్రభావం ఎంత..** **వైఎస్ఆర్సీపీ, కూటమిలో విస్తృతంగా చర్చ**

ఎవరూ ఊహించని విధంగా మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు ఈదర హరిబాబు ఒంగోలు మేయర్ ఎన్నికల
రంగంలోకి అడుగుపెట్టాడు. ఈ మేరకు ఎలాంటి హడావిడి లేకుండా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన
ఎన్నికల బరిలో నిలబడటంతో ఒంగోలు మేయర్ స్థానం కోసం త్రిముఖ పోటీ ఏర్పడ్డ వాతావరణం ఏర్పడింది.
కూటమి నిర్ణయించిన మేయర్ అభ్యర్ధిత్వంపై రగిలిపోతున్న ఒక బలమైన సామాజికవర్గం ఎన్నికల్లో
ఆయనకు అన్ని విధాలుగా అండదండలుగా ఉండేందుకు నిర్ణయించినట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్యేగా,
మాజీ జడ్ పి చైర్మన్ గా, సీనియర్ నాయకుడిగా ఈదర హరిబాబుకు గుర్తింపు ఉంది. ఒంగోలులోని
అన్ని సామాజికవర్గాల్లో ఆయన అనుచరులు, అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో హరిబాబు ఎన్నికల
బరిలో నిలవటంతో మేయర్ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో 
దిగుతున్న హరిబాబు ప్రభావం మేయర్ ఎన్నికల్లో ఏ మేరకు ఉంటుందన్న అంశంపై రాజకీయవర్గాల్లో
విస్తృతంగా చర్చ నడుస్తోంది. మరో వైపు ఆయనను ఎన్నికల బరి నుంచి తప్పించుకునేందుకు ఒక
ప్రధాన రాజకీయ పక్షం మంతనాలు సాగిస్తున్నట్టు తెలిసింది.

## శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు

- Link: https://andhravani.net/ap-news/cctv-cameras-at-nomination-centers-election-commissioner-anil-chandra-punetha/7256/
- Published: 2026-10-18T04:35:21+00:00
- Author: andhravani

![](https://andhravani.net/wp-content/uploads/2026/10/punetha-300x225.jpg)

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న అనిల్ చంద్ర పునేఠా

 * **నామినేషన్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు**
 * **నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు**
 * **విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై సస్పెన్షన్, బదిలీ వేటు**
 * **రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా**

ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు శాంతిభద్రతల
పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా
తెలిపారు. స్థానిక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల
సమావేశం లో **రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపునేఠా** శనివారం మాట్లాడుతూ.. ఎన్నికల
సమయంలో ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని
సంబంధిత అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో శాంతిభద్రతలకు 
సంబంధించిన సమస్యలు తలెత్తిన సందర్భాల్లో జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు(
ఎస్పీలు), పోలీసు కమిషనర్లను తక్షణమే అప్రమత్తం చేసి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు
చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల
అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. నామినేషన్ల స్వీకరణ
కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు, ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా
చూడాలని ఆదేశించినట్లు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు
తీసుకుంటామని స్పష్టం చేశారు.

**నామినేషన్ కేంద్రాల వద్ద సీసీ టీవీ కెమెరాలు**

నామినేషన్ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, హైకోర్టు
ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించినట్లు తెలిపారు. నామినేషన్ల దాఖలు సమయంలో నిర్దేశించిన
నిబంధనల ప్రకారం అభ్యర్థితో పాటు అనుమతించిన ముగ్గురు వ్యక్తులకు మాత్రమే ప్రవేశం కల్పించాలని
స్పష్టం చేశారు. ఈ నిబంధన అమలులో ఎలాంటి ఉల్లంఘనలకు అవకాశం ఇవ్వకూడదని అధికారులకు సూచించినట్లు
పేర్కొన్నారు.

## నల్లమల్లి శ్రీ శిల్పకు ‘మెగా’ మద్దతు..!

- Link: https://andhravani.net/ap-news/mega-support-for-nallamalli-sri-shilpa/7250/
- Published: 2026-10-18T03:21:32+00:00
- Author: andhravani

![](https://andhravani.net/wp-content/uploads/2026/10/Nallamalli-family-300x169.
jpg)

నల్లమల్లి బాలు, నల్లమల్లి శ్రీ శిల్ప

తెలుగుదేశం అభ్యర్ధిగా ఒంగోలు మేయర్ ఎన్నికల బరిలో నిలబడిన నల్లమిల్లి శ్రీ శిల్పకు
పరోక్షంగా మెగా కుటుంబం నుంచి కూడా మద్దతు ఉన్నట్టు రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. 
కాపు సామాజికవర్గానికి చెందిన శ్రీ శిల్పకు అల్లు కుటుంబంతో ఉన్న బంధుత్వం సీటు రావటానికి
అదనపు మద్దతుగా నిలిచినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కాపులకు మేయర్ సీటివ్వాలని ఒంగోలు
ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నిర్ణయించిన నేపధ్యంతో జనసేన పెద్దల నుంచి కూడా మద్దతు 
లభించింది. అందువల్లనే తెరమీదకు వచ్చిన ఇతర కాపు, వైశ్య నేతలను పక్కనపెట్టి శ్రీ శిల్పకు
సీటు కేటాయించినట్టు పొలిటికల్ సర్కిల్ టాక్. దామచర్ల జనార్దన్ కూడా వైశ్య సామాజికవర్గానికి
చెందిన నల్లమల్లి బాలు కంటే కాపు సామాజకవర్గానికి చెందిన శ్రీ శిల్పకు సీటివ్వటానికే
మొగ్గు చూపారు. వైసీపీ అభ్యర్ధిగా ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన కుప్పం ప్రసాద్
కు సీటివ్వటంతో శ్రీ శిల్పను అభ్యర్ధిగా నిలబెట్టటం ద్వారా ఒక వైపు కాపుల్లో అసంతృప్తి
రాకుండా, మరో వైపు వైశ్యుల మద్దతు కూడగట్టేందుకు అవకాశం ఉంటుందని భావించారు.

![](https://andhravani.net/wp-content/uploads/2026/10/nallamalli-mp-300x169.jpg)

ఒంగోలుఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని కలిసిన ఒంగోలు మేయర్ అభ్యర్ధి నల్లమల్లి శ్రీ 
శిల్ప, నల్లమల్లి బాలు, వేమూరి బుజ్జి తదితరులు

![](https://andhravani.net/wp-content/uploads/2026/10/IMG-20261018-WA0008-300x169.
jpg)

## అక్షర ప్రకాశం ఈ-పేపర్ 17.10.2026

- Link: https://andhravani.net/epaper/aksharaprakasam-digital-news-paper-15/7247/
- Published: 2026-10-17T16:36:06+00:00
- Author: andhravani

Loading Viewer...
