రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెడదాం
– ప్రొ. ఎన్ రంగయ్య, న్యాయ శాస్త్ర నిపుణులు
ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా పేరుగాంచిన భారత రాజ్యాంగ స్ఫూర్తిని, నైతికతను నిలబెట్టాల్సిన అవశ్యకత ప్రధాన రాజకీయ పార్టీలు, మేధావులు, కోట్లాది ప్రజలపై ఉందని న్యాయ శాస్త్ర నిపుణులు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వ రిజిస్టార్ ప్రొ. ఎన్. రంగయ్య అన్నారు. ఈనెల 25వ తేదీన గుంటూరులోని జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనే అంశంపై జరిగిన చర్చా గోష్టిలో ప్రధాన వక్తగా పాల్గొని ప్రొ.ఎన్. రంగయ్య ప్రసంగించారు. 1946 లో 399 మందితో ఏర్పడిన రాజ్యాంగ పరిషత్ దేశ విభజన కారణంగా 285 మంది రాజ్యాంగ పరిషత్ లో భారతదేశానికి ప్రాతినిద్యం వహించి ,రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి, అత్యున్నత లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించుకున్నామని తెలిపారు. రాజ్యాంగంలో 395 నిబంధనలు, 8 షెడ్యూలు, 22 భాగాలతో ప్రారంభమై నేడు 106 రాజ్యాంగ సవరణలతో మరింత పరిపుష్ట చేసుకున్నామన్నారు. భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గాను, మరో నాలుగు కమిటీలలో సభ్యునిగా కృషిచేసి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని తెలిపారు. భారత రాజ్యాంగ మౌళిక స్వరూపానికి భిన్నంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించిన సందర్భాలలో సుప్రీంకోర్టు, హైకోర్టు లు జోక్యం చేసుకోవడాన్ని సమర్థించారు. రాజ్యాంగ ఆదేశక సూత్రాలలో పొందుపరిచిన ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు తగ్గించడానికి బదులు గత 75 సంవత్సరాల లో ఆర్థిక అసమానతలు పెరిగాయని, దేశ ప్రజలలో ఒక్క శాతం చేతిలో 50 శాతం సంపద కేంద్రీకృతమైందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రసంగిస్తూ వయోజనులందరికీ ఓటు హక్కు కల్పించటం, దళిత, గిరిజన, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తూ డా||బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచడం అభినందనీయమన్నారు. రాజ్యాంగ నైతికతను పాటిస్తూ రాజకీయవేత్తలు, అధికార యంత్రాంగం, న్యాయాధికారులు రోల్ మోడల్ గా ఉంటేనే భారతదేశం వికసించగలదన్నారు. శాసనమండలి సభ్యులు కె. యస్. లక్ష్మణరావు ప్రసంగిస్తూ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలకు పదవీ విరమణ కాగానే రాజకీయ పదవులు కడబెట్టే సాంప్రదాయం మంచిది కాదని, ఇది న్యాయవ్యవస్థ పై నమ్మకం సన్నగిల్లెలా చేస్తుందన్నారు. కొలీజియం పద్ధతిలో జడ్జీల నియమకాన్ని సమీక్షించుకోవాలని, జమినీ ఎన్నికలు సమైక్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ ఇటీవల కాలంలో ప్రభుత్వ అధినేతలు రాజ్యాంగబద్ధ పాలనకు బదులు రాజకీయ పాలన వైపు మొగ్గు చూపుతున్నారని, వ్యవస్థలను ధ్వంసం చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారన్నారు. న్యాయ వ్యవస్థ, కార్యనిర్వహక వ్యవస్థపై శాసన వ్యవస్థ పెత్తనం చేస్తూ అధికార విభజనకు విఘాతం కలిగి స్తున్నారన్నారు. ఈ చర్చా గోష్టిలో నేస్తం సహయ వ్యవస్థాపకులు టి.ధనుంజయ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర కార్యదర్శి పి. శేషుబాబు, రాజ్యాంగ చర్చా వేదిక కన్వీనర్ అవధానుల హరి, మానవత డైరెక్టర్ చావ శివాజీ, సామాజిక వేత్త బత్తుల కోటేశ్వరరావు తదితరులు ప్రసంగించారు.