కుల వివక్షను దునుమాడిన ‘కండిషన్స్ అప్లయ్’
ఒంగోలులో డాక్టర్ పసునూరు రవీందర్ కథల పుస్తకం ఆవిష్కరణ
ఒంగోలు , అక్టోబర్ 1(ప్రభ న్యూస్) : నగర జీవితంలో కొనసాగుతున్న కుల వివక్షను డాక్టర్ పసునూరి రవీందర్ రచించిన ఆధునిక దళిత కథల పుస్తకం కండిషన్స్ అప్లై దునుమాడిందని ఒక సాహితీవేత్త, హైదరాబాద్ సిటీ కాలేజ్ తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ కోయి కోటేశ్వరరావు పేర్కొన్నారు. జానుడి – సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఒంగోలు డాక్టర్ మల్లవరపు రాజేశ్వరరావు భవన్లో ప్రముఖ కథా రచయిత, ఉద్యమకారుడు డాక్టర్ పసునూరి రవీందర్ రచించిన’ కండిషన్స్ అప్లయ్’ ఆధునిక దళిత కథల పుస్తకం పరిచయసభ స్ఫూర్తివంతంగా సాగింది. ప్రఖ్యాత నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు అధ్యక్షతన జరిగిన ఈ పరిచయ సభలో ప్రముఖ సాహితీవేత్త, ఉపన్యాసకుడు డాక్టర్ కోయి కోటేశ్వరరావు మాట్లాడుతూ అర్బన్ దళితులు ఎదుర్కొంటున్న వివక్ష మీద రవీందర్ కథలు అక్రోశంతో మాట్లాడతాయని అన్నాడు.ప్రజాస్వామిక రచయితల వేదిక ఏపీ కన్వీనర్, బొమ్మరిల్లు ఆశ్రమ నిర్వాహకులు పూసపాటి రాజ్యలక్ష్మి, ప్రముఖ కవి కత్తి కళ్యాణ్ లు ప్రసంగిస్తూ గతంలో రవీందర్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా కూడా అర్బన్ దళితుల జీవితంలోని కష్టాలను కన్నీళ్ళను వ్యక్తీకరిస్తాయని తెలిపారు . కవిగా ,కథా రచయితగా ,సాహిత్య విమర్శకుడిగా, ఉద్యమకారుడిగా అనేక పాత్రలను స్ఫూర్తి వంతంగా నిర్వహిస్తున్న రవీందర్ అభినందనీయుడని అన్నారు.సభలో తొలుత వక్తలకు సాహిత్య పరిశోధకుడు నోసిన వెంకటేశ్వర్లు స్వాగతం పలుకగా, జానుడి సాహితీ సంస్థ డైరెక్టర్ డాక్టర్ నూకతోటి రవి కుమార్ సభా సంచాలకులుగా వ్యవహరించారు.ఈ సందర్భంగా పుస్తక రచయిత రవీందర్ ను, సమీక్ష చేసిన డాక్టర్ కోయి కోటేశ్వరావు లను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. సభలో ప్రముఖ రంగస్థల కళాకారుడు ఎం. శాంతారావు, అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ లెక్చరర్స్ అండ్ టీచర్స్ ప్రతినిధులు చంద్రశేఖర్, మహేశ్వర చారి సాల్మన్ నల్లగట్ల, మొగిలి దేవప్రసాద్, ధనరాజు, లెక్చరర్లు ఈశ్వరుడు, జయశీలరావు, వైయస్ .దిగ్విజయ్ పావులూరి అంజయ్యలతో పలువురు సాహిత్యకారులు అభిమానులు కళాకారులు పాల్గొన్నారు.