అపార్థానికి గురైన కవి ఆలూరి బైరాగి
- సాహితీవేత్త ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
- విజయవాడ పుస్తక మహోత్సవంలో ఘనంగా ఆలూరి బైరాగి శతజయంతి సభ
![](https://andhravani.net/wp-content/uploads/2025/01/bairaagi-300x183.jpg)
విజయవాడ: ప్రజలకు అర్థమయినదానికన్నా అపార్థానికి గురైన కవి ఆలూరి బైరాగి అని సాహితీవేత్త, పద్మభూషణ్ , ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు . భైరాగిని సరిగ్గా అర్థంచేసుకోక నిరాశావాది, అరాచకవాది అని చిత్రీకరించారన్నారు. 35వ విజయవాడ పుస్తక మహోత్సవం ఆరవరోజు మంగళవారం రామోజీరావు సాహిత్యవేదిక మీద కవి ఆలూరి బైరాగి శతజయంతి సభ నిర్వహించారు. ఆచార్య యార్లగడ్డ ప్రధానవక్తగా మాట్లాడుతూ కవిత్వాన్నే శ్వాసగా జీవించిన బైరాగి తనదైన వ్యక్తీకరణ, పదవిన్యాసంతోబాటు చిక్కనైన మానవత్వ భావాలూ, సామాజిక స్పృహతో తెలుగు సాహితీ ప్రేమికుల హృదయాల్లో నిలిచిపోయారన్నారు. ఆ రోజుల్లోనే పర్యావరణ స్పృహ కనబరిచారన్నారు. నేటి యువత తప్పనిసరిగా బైరాగి కవిత్వాన్ని చదవాలని సూచించారు. బైరాగి కవిత్వాన్ని పునఃముద్రణ చేస్తామన్నారు. సభకు అధ్యక్షత వహించిన బండ్ల మాధవరావు మాట్లాడుతూ పాఠకుల హృదయాల్లో నిలిచిపోయే పదచిత్రాల సృష్టికర్తగా ఆలూరి బైరాగి గుర్తుండి పోతారన్నారు. బాలల పత్రిక చందమామ హిందీ సంచికకు కొంతకాలం పాటు సంపాదకులుగా వ్యవహరించారన్నారు. పిల్లల పత్రికల్లో పిల్లలకు అర్థమయ్యే సులువైన భాషలో రాసారని వివరించారు. జీవితాంతం కవిత్వం రాయడమే ప్రధాన వ్యాపకంగా జీవించాడని చెప్పారు. బైరాగి మరణానంతరం సంపుటీకరించిన ఆయన కవిత్వ సంకలనం ‘ఆగమగీతి’కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందన్నారు. బైరాగి వెళ్లిపోయినా ఆయన కవిత్వ సౌరభాలు పాఠకుల హృదయాలను విడిచిపోవన్నారు. గుమ్మా సాంబశివరావు తదితరులుకార్యక్రమంలో పాల్గొన్నారు.