ప్రతి కుటుంబానికి రూ 2500 బీమా
ఏపీలో 1 కోటి 43 లక్షల కుటుంబాల్లోని 4 కోట్ల 30 లక్షల మంది పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేలా రూ.25 లక్షల వరకు వైద్య సాయం అందుతుందని వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. హైబ్రిడ్ విధానంలో బీమా, కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్, రాష్ట్రంలోని ఎన్టీఆర్ వైద్య సేవ అనుసంధానం కానున్నాయని చెప్పారు.
కొత్త విధానంలో పేదలకు నాణ్యమైన వేద్య సేవలు అందుతాయని అభయం ఇచ్చారు. ఆరోగ్య బీమా పథకాన్ని వీలైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరేలా రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. నిపుణులైన బీమా కంపెనీలను వైద్య సేవ కార్యక్రమంలో నిమగ్నం చేసి, పనితీరును మెరుగు పరిచేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆరోగ్య వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని కల్పించి, ఎక్కువ మంది పేద ప్రజలకు లబ్ధి చేకూరేలా హైబ్రిడ్ విధానాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి వివరించారు. హైబ్రిడ్ మోడల్ వల్ల రూ.2.5 లక్షల లోపల ఉచిత వైద్య సేవలు ఉండవని, పేదలకు అందించే వైద్య సేవలను ట్రస్ట్ మోడల్ నుంచి ఇన్సూరెన్స్ మోడల్‌లోకి మారుస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని సత్యకుమార్ యాదవ్‌చెప్పారు.
రూ.2.5 లక్షల లోపు క్లెయిమ్స్ కోసం బీమా పద్ధతిలోకి మారాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని 61 లక్షల కుంటుంబాలకు ఆయుష్మాన్ భారత్ ద్వారా రూ.5 లక్షల వరకకు వైద్య సేవ అందుతుంది కాబట్టి, దానిని అనుసంధానం చేసుకుంటూ, రూ.2.5 లక్షల నుంచి రూ.25 లక్షల వైద్య సేవల ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరించేలా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీనికోసం బీమా కంపెనీలు, ఆస్పత్రులతో మాట్లాడినట్లు వివరించారు.
ఉత్తమ వైద్య విధానాల పరిశీలన తర్వాతే నిర్ణయం
దేశంలో దాదాపు 10 రాష్ట్రల్లోని ఉత్తమ వైద్య విధానాలను పరిశీలించిన తర్వాతే హైబ్రిడ్ మోడ్‌లో వైద్య సేవలు అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. హైబ్రిడ్ మోడ్ వల్ల వైద్య సేవలు ఎక్కువ మంది ఉపయోగించుకుంటున్నారని, ఎక్కువ క్లెయిమ్స్ ఉంటున్నాయని WHO కూడా ఆరు రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే ద్వారా వెల్లడించిందని వివరించారు. ఈనేపథ్యంలో ఏపీలో కూడా హైబ్రిడ్ మోడ్ తీసుకొచ్చినట్లు తెలిపారు. వైద్య సేవల్లో 90 శాతం క్లెయిమ్స్ రూ.2.5 లక్షల లోపే ఉంటున్నాయని చెప్పిన మంత్రి, రూ.2.5 లక్షల వరకు బీమా సంస్థలు, ఆపై రూ.25 లక్షల వరకు ట్రస్ట్ భరించేలా నిర్ణయించామన్నారు.
ముందుగానే ప్రీమియం చెల్లింపు వల్ల మెరుగైన సేవలు
1.43 కోట్ల కుటుంబాలకు ముందుగానే ప్రీమింయ చెల్లించి కూటమి ప్రభుత్వం పేదలకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు వైద్య సేవలు అందించిన తర్వాత ఆసుపత్రులకు బిల్లులు చెల్లించేవాళ్లని, ముందుగానే బీమా ప్రీమియం చెల్లించడం వల్ల నెట్‌వర్క్ ఆసుపత్రులకు బిల్లులు పెండింగ్‌లో ఉంటాయన్న భయం కూడా ఉండదన్నారు.
ప్రస్తుతం ప్రి-ఆథరైజేషన్ కోసం 24 గంటలు పడుతోందని, దీనిని 6 గంటలకు కుదించేలా బీమా కంపెనీలతో మాట్లాడినట్లు వెల్లడించారు. ఇన్సూరెన్స్ కంపెనీల ప్యానెల్ డాక్టర్లు కూడా ఉంటారు కాబట్టి క్లెయిమ్‌లకు త్వరగా అప్రూవల్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఒకవేళ, ఏదైనా క్లెయిమ్‌ను తిరస్కరిస్తే అప్పీల్‌కు వెళ్లడానికి కూడా అవకాశం ఉందని సత్యకుమార్ యాదవ్ భరోసా ఇచ్చారు. చెల్లించిన ప్రీమియం మొత్తం కన్నా క్లెయిమ్ మొత్తం తక్కువగా ఉంటే, మిగిలిన డబ్బును రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేలా నిబంధనలు పెడుతున్నట్లు సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
కృత్రిమ మేథ సాయంతో జవాబుదారీతనం
గత ప్రభుత్వ హయాంలో, ఆసుపత్రుల్లో అనేక రకాల మోసాలు జరిగాయన్న మంత్రి, ఈసారి ఆ అవకాశం ఇవ్వకుండా, కృత్రిమ మేథ సాయంతో ఆసుపత్రుల్లో జవాబుదారీతనం పెంచుతాన్నారు. గత ప్రభుత్వంలో, అక్రమాలు చేసిన ఆసుపత్రులకు ఐదేళ్లలో రూ.16 కోట్ల పెనాల్టీలు వేసి కనీసం 1 శాతం రికవరీ కూడా చేయలేదన్న మంత్రి, ప్రస్తుతం రూ.22.70 కోట్ల జరిమానాలు విధించామని, నోటీసులు జారీ చేశామని చెప్పారు.
ఎన్టీఆర్ వైద్య సేవకు రూ.4 వేల కోట్లు
కూటమి ప్రభుత్వంలో, వైద్య సేవల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.18500 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవకు రూ.4 వేల కోట్లు కేటాయించినట్లు సత్యకుమార్ యాదవ్ చెప్పారు. తమకు చిత్తశుద్ధి లేకపోతే ఈ కేటాయింపులు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. గత ప్రభుత్వం మాటలు కోటలు దాటాయిగానీ, చేతలు గడప కూడా దాటలేదని ఎద్దేవా చేశారు.
గత ప్రభుత్వం హయాంలో ఆరోగ్య శ్రీ కోసం ఐదేళ్లలో ఖర్చు చేసిన మొత్తం రూ.9942 కోట్లు మాత్రమేనని, సగటున సంవత్సరానికి రూ.1,988 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. పైగా, ఆరోగ్య శ్రీ కింద రూ.2,225 కోట్లు బకాయిలను వారసత్వంగా వదిలి వెళ్లారని చెప్పారు. ఆ బకాయిల్లో కూటమి ప్రభుత్వం రూ.1350 కోట్లు చెల్లించినట్లు తెలిపారు.
గత ప్రభుత్వ యాహంలో 38 లక్షల కుటుంబాలు ఆరోగ్య శ్రీ కింద లబ్ధి పొందాయని, సగటున ఏడాదికి 7.60 కుటుంబాలు లబ్ధి పొందాయన్న మంత్రి, కూటమి హయాంలో జూన్ 06 నుంచి డిసెంబర్ 31 వరకు, కేవలం ఆరు నెలల్లోనే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 7.61 లక్షల కుటుంబాలు లబ్ధి పొందినట్లు చెప్పారు. హైబ్రిడ్ విధానంలోనూ 3,257 రకాల వైద్య చికిత్సలు పేదలకు అందుతాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టం చేశారు.