దళితులపై అమానుషం..28న తెనాలిలో సదస్సు
- తెనాలి యువకుల పట్ల పోలీసుల దాష్టీకానికి నిరసన
- గుంటూరులో కరపత్రం విడుదల చేసిన ప్రజా సంఘాలు
తెనాలిలో ముగ్గురు దళిత మైనారిటీ యువకుల పట్ల పోలీసులు బహిరంగంగా అరికాళ్ళపై లాఠీలతో దాడి చేసిన అరాచకత్వాన్ని నిలదీస్తూ, చట్టాన్ని తమ చేతిలో తీసుకోవటాన్ని ప్రశ్నిస్తూ ఈనెల 28న సాయంత్రం నాలుగు గంటలకు తెనాలి ఐతానగర్ కమ్యూనిటీ హాలులో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మానవ హక్కుల పరిరక్షణ సదస్సును నిర్వహించనున్నారు. ఈ సదస్సును విజయవంతం చేయాలని చేయాలని కోరుతూ గుంటూరులోని అంబేద్కర్ సెంటర్ లో మంగళవారం దళిత బహుజన ప్రజా సంఘాల సదస్సు కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో సీనియర్ న్యాయవాది, ఐ ఎల్ ఏ రాష్ట్ర అధ్యక్షుడు జి. శాంత కుమార్ మాట్లాడుతూ పోలీసులకు విచారణ చేసే అధికారం తప్ప శిక్షించే అధికారం లేదన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన తెనాలి సిఐ రాములు నాయక్, సీఐ రమేష్ బాబు లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యూడిషియల్ ఎంక్వయిరీ చేయించాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నేతాజీ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన పోలీసులు చట్టాన్ని అతిక్రమించి ముగ్గురు యువకుల్ని అరికాళ్ళపై లాఠీలు విరిగేటట్లుగా అమానుషంగా కొట్టడం అత్యంత దుర్మార్గమని అన్నారు. పోలీసులు చేసిన ఈ దుర్మార్గాన్ని జిల్లా ఎస్పీ, హోం మంత్రి సమర్థించడం చట్టాల పట్ల వారికున్న చిత్తశుద్ధి తెలియచేస్తుందన్నారు. దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరివి వినయ్ కుమార్ మాట్లాడుతూ తెనాలి పోలీసులు గంజాయి వ్యాపారాన్నీ, రౌడీయిజాన్ని కవల పిల్లలుగా పెంచి పోషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనాలిలో నిర్వహించనున్న మానవ హక్కుల పరిరక్షణ సదస్సు కు దళిత బహుజన ప్రజా సంఘాల తో పాటు రాజకీయ నాయకులు. మానవతవాదులు, ప్రజాస్వామికవాదులు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు నల్లపు నీలాంబరం, భూపతి సునీల్ కుమార్, చిన్నం డేవిడ్ విలియమ్స్, వీసీకే జయసుధ, కనకవల్లి వినయ్, బత్తుల అనిల్ , బండ్లమూడి స్టాలిన్ బాబు, లక్ష్మణరావు, షేక్ సిష్టి, బీఎస్పీ వాసు, శ్రీనివాస్,కమలకుమారి, చుక్కా దేవరాజ్, దార్ల అర్జున్, దొడ్డప్రసాద్ ,అడ్వకేట్ శిఖ సురేష్, పిల్లి రాజు, ఓర్సు ప్రేమ రాజు తదితరులు పాల్గొన్నారు.