ap news

రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించండి

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం చంద్రబాబునాయుడు

పోలవరం రెండో దశ నిధులు విడుదల చేయండి

ఉద్యాన ఉత్పత్తుల రవాణాకు 50 శాతం రాయితీకి ఖాళీ రీఫర్ కంటైనర్లు

ఉత్తర-దక్షిణ భారత్ లను కలుపుతూ ఫ్రైట్ కారిడార్లు నిర్మించాలి

ఏపీలో మఖానా డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయండి

పూర్వోదయ సహా, కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధుల పై విజ్ఞాపన

రాష్ట్ర ప్రాజెక్టులు, కేంద్ర నిధులపై సహకారం కోరుతూ సీఎం వినతులు

హోంమంత్రి అమిత్ షా సహా ఏడుగురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస భేటీలు

ANDHRAVANI, DELHI : ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. వీటితో పాటు వివిధ అంశాల్లో రాష్ట్రానికి సహకారం అందించాలని కోరుతూ విజ్ఞాపన పత్రం అందించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మంగళవారం కేంద్ర హోం మంత్రి సహా ఏడుగురు కేంద్ర మంత్రులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు నిర్వహించారు. అమిత్ షాతో సహా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమైన సీఎం పూర్వోదయ పథకం ద్వారా రాయలసీమను ఉద్యాన హబ్ గా మార్చే ప్రణాళికకు నిధులు ఇవ్వాలని కోరారు. అలాగే వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్ర వాటాను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో భేటీ అయిన ముఖ్యమంత్రి ఏపీలో మఖానా డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని అభ్యర్ధించారు. మఖానా సాగుకు ఏపీలో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని సీఎం స్పష్టం చేశారు. కొల్లేరు ప్రాంతంలో 50వేల ఎకరాల్లో మఖానా సాగు చేసేందుకు ఆస్కారం ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో వ్యవసాయం సహా అనుబంధ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై కేంద్ర వ్యవసాయ మంత్రితో సీఎం చర్చించారు. పీఎం ప్రణామ్ పథకం కింద ఏపీలో సామూహిక సహజ వ్యవసాయాన్ని విస్తరించేందుకు నిధులు విడుదల చేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రిని కోరారు. ఈ పథకం కింద గత ఏడాది రసాయన ఎరువుల వాడకం తగ్గించిన రాష్ట్రంగా ఏపీకి రూ.216 కోట్ల మేర ప్రోత్సాహకాలను మంజూరు చేయాలని అడిగారు. ఏపీలో కొబ్బరి సాగు చేసేందుకు రూ. 200 కోట్ల మేర సాయం అందించాలని కూడా సీఎం కోరారు. కోకోనట్ ప్రాసెసింగ్ పార్కు ఏర్పాటు , కర్ణాటక తరహాలో ఆధునిక టెండర్ కోకోనట్ మార్కెట్ల ఏర్పాటు, కొబ్బరి రైతులకు అధునాతన పద్ధతులపై శిక్షణ, నర్సరీల విస్తరణకు సహకారం అందించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. వన్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద పెండింగ్ లో ఉన్న రూ.695 కోట్లను విడుదల చేయాలని విజ్ఞాపన పత్రం అందించారు. ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ సిస్టం కింద 2025-26 సీజన్ లో తోతాపురి మామిడి రైతులకు కేంద్ర వాటాగా ఇవ్వాల్సిన రూ.100 కోట్లను విడుదల చేయాలని సీఎం కోరారు.

ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తొో భేటీ అయిన చంద్రబాబు

పోలవరం రెండో దశకు రూ.32 వేల కోట్లు అవసరం

పోలవరం ప్రాజెక్టు రెండో దశలో భాగంగా తదుపరి భూసేకరణ, పునరావాసానికి నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ కు విజ్ఞప్తి చేశారు. దీని కోసం రూ.32 వేల కోట్లు అవసరం అవుతాయని తెలిపారు. ఏపీలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సాయం అందించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్టాప్ వర్క్ ఆర్డర్ శాశ్వతంగా ఎత్తివేసేలా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యం పెంపు కారణంగా పెరిగిన వ్యయాన్ని రీయింబర్సు చేయాలని విజ్ఞాపన పత్రం అందించారు. గోదావరి వరద జలాలను వర్షాభావ ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో పోలవరం–నల్లమల సాగర్ లింక్ ప్రతిపాదనలకు ఆమోదం తెలియచేయాలని అభ్యర్ధించారు. జాతీయ నదుల అనుసంధాన విధానంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసి, సాంకేతిక–ఆర్థిక సాయం ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్-ఒడిశా మధ్య వంశధార నీటి వివాదాన్ని పరిష్కరించేలా వంశధార నీటి వివాద ట్రిబ్యునల్ (వీడబ్ల్యుడీటీ) తుది నివేదిక గెజెట్‌లో ప్రచురించాలన్నారు. గోదావరి జలాల పంపకంపై ఏపీ-తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతోందని నదీ జలాల పంపకం కోసం గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. ఎగువ కృష్ణాపై ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపునకు కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన చర్యలపై సీఎం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే దిగువ ప్రవాహ జలాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి పాటిల్ కు వివరించారు.

సరకు రవాణా కారిడార్లు అవసరం

ఉత్తర- దక్షిణ భారత్ ను అనుసంధానిస్తూ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లను ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను ముఖ్యమంత్రి కోరారు. ఉత్తర- దక్షిణ భారత్ కలిపేలా ఇటార్సీ- విజయవాడ మధ్య ప్రత్యేక సరకు రవాణా కారిడార్ ఏర్పాటుకు సహకారం అందించాలని.. పోర్టులను అనుసంధానిస్తూ విజయవాడ మీదుగా ఖరగ్ పూర్- చెన్నై మధ్య ఈస్ట్ కోస్ట్ ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదించారు. రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయటంతో పాటు కొత్త రైలు మార్గాలు, సర్వీసులను నడపాలని విజ్ఞాపన పత్రం ఇచ్చారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యేలా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. ఇప్పటికే విశాఖలో తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటు అయ్యాయని.. జీఎం సహా ఇతర అధికారులు విధుల్లో ఉన్నారని తెలియచేశారు. అలాగే రాయలసీమలోని తాడిపత్రి నుంచి ముంబైలోని జేఎన్ పీటీ పోర్టుకు అరటి ఎగుమతులకు వీలుగా 50 శాతం రాయితీపై ఖాళీ రీఫర్ కంటైనర్లు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీలోనూ ఇదే తరహా రాయితీపై రీఫర్ కంటైనర్లను కేటాయిస్తున్నారని అదే రాయితీని ఏపీకి కూడా పొడిగించాలని కోరారు. విజయవాడ, విశాఖ, తిరుపతి, అమరావతిలలో గ్రీన్ ఫీల్డ్ మెగా కోచింగ్ టెర్మినళ్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అభ్యర్ధించారు. రాయలసీమ సహా గిరిజన ప్రాంతాలను కనెక్టు చేసేలా వివిధ కొత్త రైల్వేమార్గాల ప్రతిపాదనల్ని ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ-విజయవాడల మధ్య హైస్పీడ్, విజయవాడ-కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్, తిరుపతి-చిత్తూరు మధ్య హైస్పీడ్ లింక్ కారిడార్ మంజూరు చేయాలని సీఎం కోరారు. హైదరాబాద్- శ్రీశైలం- మార్కాపురం కొత్త రైల్వే లైన్ ద్వారా శ్రీశైల పుణ్యక్షేత్రానికి కనెక్టివిటీని పెంచాలని..తిరుపతి మీదుగా విజయవాడ-బెంగుళూరు మధ్య వందేభారత్ సర్వీసును నడపాలని రైల్వే మంత్రికి ఇచ్చిన లేఖలో సీఎం పేర్కొన్నారు. వివిధ ఎక్స్ ప్రెస్ రైళ్లకు కుప్పంలో స్టాపింగ్ ఇవ్వటంతో పాటు రైలు బోగీ నిర్వహణ టెర్మినల్ ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఇటీవల కేంద్ర బడ్జెట్టులో ప్రతిపాదించిన వివిధ హై స్పీడ్ రైళ్ల కారిడార్లల్లో ఏపీని కనెక్ట్ చేసేలా ప్రతిపాదించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే చెన్నై-బెంగళూరు హై స్పీడ్ రైల్ కారిడార్లో తిరుపతిని కనెక్ట్ చేసేలా చూడాలని అశ్వినీ వైష్ణవ్ ను సీఎం చంద్రబాబు విఙఫ్తి చేశారు.

జీరో ల్యాండ్ ఫిల్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సహకరించండి

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వేస్ట్ మేనేజ్మెంట్, జీరో ల్యాండ్ ఫిల్ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు వివరించారు. స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) 2.0 కింద రూ. 276 కోట్ల ఖర్చుతో జీరో ల్యాండ్ ఫిల్ స్టేట్ కు కార్యాచరణ రూపొందించినట్టు తెలిపారు. కేంద్ర వాటా కింద రూ. 105 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. అనంతరం కేంద్ర ఉక్కు శాఖా మంత్రి హెచ్ ‌డీ కుమారస్వామితో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించి ప్లాంట్ లాభాల బాట పట్టడంలో అందించిన సహకారానికి కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం అందించిన ఆర్ధిక సాయం, రాష్ట్ర ప్రభుత్వ మద్దతు, స్టీల్ ప్లాంట్ కార్మికులు-ఉద్యోగుల పట్టుదల, శ్రమతో ఈ లాభాలు సాధ్యం అయ్యాయని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ లాభాలు సాధించడంతో పాటు, పూర్తి స్థాయి సామర్ధ్యం మేర పనిచేస్తోందని సీఎం తెలిపారు. ఆర్ఐఎన్ఎల్ విషయంలో భవిష్యత్‌లోనూ ఇంతే తోడ్పాటు, సహకారాన్ని అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. సీఎం చంద్రబాబుతో పాటు వివిధ కేంద్ర మంత్రులను కలిసిన వారిలో కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *