ap news

వచ్చే నెల 6 నుంచి బీసీ హాస్టళ్లలో ‘ఫ్రెషర్స్ డే’ వేడుకలు

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అమరావతి : బీసీ హాస్టళ్లలో విద్యార్థుల మానసిక ఒత్తిడిని దూరం చేయడంతో పాటు వారి మధ్య స్నేహ పూర్వక వాతావరణం కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బీసీ హాస్టళ్లలోనూ ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. వచ్చే నెల 6, 7, 8 తేదీల్లో మూడ్రోజుల పాటు బీసీ హాస్టళ్లలో ఫ్రెషర్స్ డే నిర్వహించనున్నట్లు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆమె తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి ఇప్పటికే బీసీ హాస్టళ్లలో అడ్మిషన్ల ప్రక్రియ చివరి దశకు చేరుకుందన్నారు. వచ్చే నెల అయిదో తేదీలోగా అడ్మిషన్లు ముగించాలని బీసీ సంక్షేమ శాఖాధికారులను ఆదేశించామన్నారు. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే 6,7,8 తేదీల్లో ఫ్రెషర్స్ డే నిర్వహించాలని నిర్ణయించామన్నారు. అన్ని బీసీ హాస్టళ్లలోనూ ఈ వేడుకలు నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. అన్ని తరగతుల విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, విద్యా కమిటీల సభ్యులు, ప్రజాప్రతినిధులు ఈ ఫ్రెషర్స్ డే వేడుల్లో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వారితో పాటు జిల్లా కలెక్టర్లు, జేసీలు, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎమ్డీవోలు…ఇలా అన్ని స్థాయి అధికారులు కూడా ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారన్నారు. కొత్త ప్రాంతం, కొత్త మనుషుల కావడం వల్ల సహజంగానే విద్యార్థులు బిడియం, భయానికి లోనవుతారన్నారు. ఫ్రెషర్స్ డే నిర్వహణ వల్ల విద్యార్థుల మధ్య సుహృద్భాహ, స్నేహ పూర్వక వాతావరణం నెలకొంటుందన్నారు. కొత్త స్నేహితులతో విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని దూరం చేసి, నూతనోత్సాహం కలిగించడమే ఫ్రెషర్స్ డే లక్ష్యమని మంత్రి సవిత ఆ ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *