వికేంద్రీకరణ..తగ్గేదే లేదు..
అసెంబ్లీలో కుండబద్దలు కొట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డి
వికేంద్రీకరణ మా హక్కు..మా విధానం
శాసనసభ అధికారాలను హరించవద్దు
‘‘వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం.. రాజధాని నిర్ణయం మా హక్కు, మా బాధ్యత. అందరికీ మంచి చేయడమే మా ప్రభుత్వం ముందున్న మార్గం. రాబోయే తరాలకు మంచి చేయడం మా ప్రభుత్వ లక్ష్యం’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు మూల స్తంభాలని, ఈ మూడు తమ పరిధిలోనే అధికారాలకు లోబడి మరో వ్యవస్థలో జోక్యం చేసుకోకుండా, పెత్తనం చేయకుండా పనిచేయాల్సి ఉంటుందని, దీన్ని రాజ్యాంగంలో స్పష్టంగా నిర్దేశించారని చెప్పారు. న్యాయ వ్యవస్థ మీద అంచంచలమైన విశ్వాసం, గౌరవం మా ప్రభుత్వానికి ఉందని, శాసనసభ హక్కులపై చర్చ జరగకపోతే భవిష్యత్తులో చట్టాలు ఎవరు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారిపోయే ప్రమాదం ఉంది కాబట్టే సభలో చర్చిస్తున్నామని సీఎం వైయస్ జగన్ తెలియజేశారు.
వికేంద్రీకరణపై అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం వైయస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..
రాజ్యాంగంలో ఎవరెవరి పరిధి ఏమిటీ..? న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు మూడు మూల స్తంభాలు ఒకరి పరిధిలోకి మరొకరు వెళ్లకూడదని, అలా జరిగినప్పుడే వ్యవస్థలు నడుస్తాయని రకరకాల సుప్రీం కోర్టు తీర్పులను వక్తలంతా వివరించారు. ఎందుకు ఈ ప్రస్తావన తీసుకువస్తున్నాం అంటే.. సభ ద్వారా ప్రజలకు కొన్ని విషయాలను తెలియజేయాలనే ఉద్దేశంతో చర్చ జరుపుతున్నాం.
మూడు రాజధానులను చేస్తూ ఒక చట్టాన్ని ఉపసంహరించుకున్న తరువాత తీర్పు ఎలా వస్తుంది..? భవిష్యత్తులో మూడు రాజధానులకు సంబంధించిన ఆలోచన ఇంకా మెరుగ్గా ముందుకువస్తుంది.. లా చేసే అధికారం శాసనసభకు మాత్రమే ఉంది. కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలకు లేదు. ప్రజలకు మంచి చట్టాన్ని తీసుకువస్తే.. ప్రజలు అదే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఒకవేళ ప్రజలకు ఈ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలు నచ్చకపోతే ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో ఇంటికి పంపిస్తారు. గత ప్రభుత్వం చేసిన పాలసీలు, చట్టాలు ప్రజలకు నచ్చలేదు కాబట్టే 175 అసెంబ్లీ స్థానాలకు 151 అంటే 86 శాతం సీట్లు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. గత ప్రభుత్వ పాలసీలు, చట్టాలను వ్యతిరేకించారు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. నెలరోజుల్లోపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేయాలి. ఆరు నెలల లోపు 5–6 లక్షల కోట్ల రూపాయలతో రాజధాని కట్టేయాలని సాధ్యం కాని టైమ్‌లైన్‌ను నిర్దేశించడం కరెక్టు కాదు అని సభ ద్వారా చెప్పడానికి చర్చిస్తున్నాం.
గౌరవ సభ ద్వారా ప్రజాప్రభుత్వంగా బాధ్యతగా అందరి ముందు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను..
మొదట తెలంగాణ ఉద్యమం అభివృద్ధి లేకపోవడం వల్ల వస్తే.. రెండో సారి ఉద్యమం రాష్ట్ర విభజనకు దారి తీసిన ఉద్యమం. అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం కావడం వల్ల ఉద్యమం వచ్చిందని 2010లో జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ చెప్పింది. వికేంద్రీకరణతోనే ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర పునర్విభజన చట్టం 2014ప్రకారం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మూడు రాజధానుల బిల్లులు ప్రవేశపెడుతున్న సమయంలో గతంలో ఇదే సభలో అందరి ముందు ఇవన్నీ ప్రస్తావించడం జరిగింది.
సభ అధికారాలను ప్రశ్నించేలా తీర్పు..
మూడు రాజధానుల బిల్లులు ప్రవేశపెడుతున్న సందర్భంలో మన ప్రభుత్వం చెప్పిన మాటలకు నేటికీ కట్టుబడి ఉంది. రాష్ట్ర రాజధాని సీఆర్‌డీఏ చట్టానికి సంబంధించి ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కొన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. రాష్ట్ర రాజధాని, సీఆర్‌డీఏ చట్టానికి సంబంధించి ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు గమనించినట్టయితే.. అటు రాజ్యాంగ పరంగానే కాకుండా ఇటు రాష్ట్ర శాసనసభకు ఉన్న అధికారాలను కూడా ప్రశ్నించే విధంగా తీర్పు ఉందని పరిగణలోకి తీసుకోవాలి.
మూడు వ్యవస్థలు మూల స్తంభాలు..
ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు మూల స్తంభాలు. ఈ మూడు కూడా తమ పరిధిలోనే అధికారాలకు లోబడి మరో వ్యవస్థలో జోక్యం చేసుకోకుండా, పెత్తనం చేయకుండా పనిచేయాల్సి ఉంటుంది. దీన్ని రాజ్యాంగంలో స్పష్టంగా నిర్దేశించారు. ఇటీవల రాష్ట్ర హైకోర్టు తన పరిధిని దాటినట్టుగా అందరి మనోభావాల్లో అనిపించింది కాబట్టే చట్టసభలో కూర్చొని చర్చిస్తున్నాం.
ఎలాంటి అధికారం కూడా లేదని తీర్పు ఇచ్చారు..
రాజధాని ఎక్కడ ఉండాలనే నిర్ణయంతో పాటు పరిపాలన వికేంద్రీకరణపై రాష్ట్ర శాసనసభకు ఎలాంటి అధికారం కూడా లేదని తీర్పు ఇచ్చారు. 2014 నాటి రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం.. ఆ నిర్ణయాధికారాలన్నీ కేంద్రం పరిధిలోనే ఉంటాయి తప్ప.. ఈ విషయంలో రాష్ట్ర శాసనసభకు ఏ అధికారం లేదని హైకోర్టు పేర్కొంది. ఆ మేరకు రాష్ట్ర రాజధానితో పాటు పరిపాలన వికేంద్రీకరణపై కేంద్రం నుంచి అనుమతి తీసుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది ఏమీ లేదని చెప్పింది.
అధికారులను హరించేలా తీర్పు ఉంది..
హైకోర్టు తీర్పు దేశ సమాఖ్య స్ఫూర్తికి, శాసనసభ అధికారులకు పూర్తి విరుద్ధంగా ఉంది. రాష్ట్ర శాసనసభ అధికారులను హరించేలా తీర్పు ఉంది. నిజానికి రాజ్యాంగం ప్రకారం చూసినా ఈ నిర్ణయంలో కేంద్రం పాత్ర ఉండదు. కేంద్రం తన పాత్ర ఉంటుందని, అది తన అధికారమని కేంద్రం కూడా ఎప్పుడూ చెప్పలేదు. ఏ కోర్టులోనూ కేంద్రం ఈ రకంగా వాధించనూ లేదు. ఇది సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారమేనని ఆర్టికల్ 3ని కూడా కోట్ చేస్తూ ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు నివేదించింది.
రాజధాని మా పరిధి కాదని కేంద్రం స్పష్టంగా చెప్పింది..
ఈ మధ్యకాలంలో రాష్ట్ర రాజధాని విషయంలో పార్లమెంట్‌లో కూడా తెలుగుదేశం పార్టీ సభ్యుడు కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్రం రాతపూర్వకంగా సమాధానమిచ్చింది. రాష్ట్ర రాజధానిని నిర్ణయించే అధికారం గౌరవ రాష్ట్ర ప్రభుత్వానిదేనని, దీంట్లో కేంద్రం పాత్ర ఏమీ లేదని పార్లమెంట్ సాక్షిగా క్లారిటీ ఇచ్చారు. ఇంకో అడిషనల్ అఫిడవిట్‌ను కేంద్రం హైకోర్టుకు ఇచ్చింది. హైకోర్టు ఎక్కడ ఉంటే అక్కడే క్యాపిటల్ అనే వాదనను కూడా కొట్టిపారేశారు. రాజధానితో పాటు పరిపాలన వికేంద్రీకరణలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం కూడా లేదని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి క్యాపిటల్ డిసైడ్ చేసే అధికారం లేదని హైకోర్టు చెబుతుంది. మరోవైపున కేంద్ర ప్రభుత్వం అది రాష్ట్ర ప్రభుత్వ అధికారమని క్లియర్‌గా రాతపూర్వకంగా అఫిడవిట్‌లు ఇస్తుంది. పార్లమెంట్‌ను సాక్షిగా చేస్తూ సమాధానమిస్తుంది. ఇటువంటి క్లియర్‌కట్‌గా ఈ అధికారం మీదని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం చెబుతున్నప్పుడు, కనిపిస్తున్నప్పుడు.. ఆ అధికారం లేదని చెప్పడం ఎంతవరకు సమంజసం అని సభ ద్వారా ఆలోచన చేయాలని కోరుతున్నాను.
అగౌరవ పర్చడానికి సభ నిర్వహించడం లేదు..
హైకోర్టును, దాని అధికారాలను అగౌరవ పర్చడానికి ఈ సభను నిర్వహించడం లేదు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి చాలా గౌరవం ఇస్తున్నాం. రాష్ట్ర అసెంబ్లీకి ఉన్న గౌరవాన్ని, అధికారాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత లెజిస్లేచర్‌పై కూడా ఉంది. సభ మనతో ఆగిపోయేది కాదు.. స్వతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు నడుస్తూనే ఉన్నాం. మూడు పిల్లర్స్‌గా లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ నడుస్తున్నాయి. సభకు రావడానికి ప్రజలంతా ఓటు ద్వారా ఫలానా ప్రభుత్వం మాకు కావాలని ఎన్నుకుంటూ ఇక్కడకు వచ్చాం. ఈ గౌరవాన్ని, అధికారాలను కూడా మనం కాపాడుకోలేకపోతే, మనం ప్రశ్నించలేకపోతే.. ఆ తరువాత లెజిస్లేచర్ అనేదానికి మీనింగ్ లేకుండా పోతుంది. చట్టాలు ఎవరు చేస్తారు అనే మాటకు పెద్ద ప్రశ్న భవిష్యత్తులో మిగిలిపోతుంది.
అవాంఛనీయమైన సంఘర్షణ..
ఏ వ్యవస్థ అయినా కూడా తన పరిధి దాటకుండా ఇతర వ్యవస్థలను గౌరవిస్తూ.. తన అధికారాలకు లోబడి పనిచేయాలని రాజ్యాంగంలో తేటతెల్లంగా రాసిన సందర్భాన్ని గుర్తుచేస్తున్నా. రాజధాని వికేంద్రీకరణ విషయంలో గౌరవ చట్ట సభకు అందుకు సంబంధించిన తీర్మానం కూడా చేసే అధికారం లేదని చెప్పారు. గౌరవ న్యాయస్థానం తన పరిధి దాటి వ్యవస్థలో కీలకమైన శాసన వ్యవహారాల్లోకి ప్రవేశించడం అవాంఛనీయమైన సంఘర్షణ అని తెలియజేస్తున్నా.
ఇది ఏమాత్రమైనా సాధ్యపడుతుందా..? ఆలోచన చేయాలి..
హైకోర్టు తీర్పులో.. రాజధానితో పాటు ఈ ప్రాంతంలో నిర్మాణాలన్నింటినీ ఒక నెలలోపు రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఆరు నెలల్లో మిగతావన్నీ పూర్తిచేయాలని ఆదేశాలిచ్చారు. ఇది ఏమాత్రమైనా సాధ్యపడుతుందా..? ఆలోచన చేయాలి. ఆచరణకు సాధ్యం కాని ఆదేశాలు జారీ చేయరాదంటూ గౌరవ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు హైకోర్టు తీర్పు పూర్తి భిన్నంగా ఉంది. రాజధాని నగరంతో పాటు ఈ ప్రాంతంలో చూపిన మాస్టర్ ప్లాన్ కేవలం కాగితాలపైనే, గ్రాఫిక్స్ రూపంలోనే ఉన్నాయి. మాస్టర్ ప్లాన్‌ను అప్పటి ప్రభుత్వం 2016 ఫిబ్రవరిలో నోటిఫై చేసింది. సీఆర్‌డీఏ చట్టం ప్రకారం మాస్టర్ ప్లాన్ కాలపరిమితి 20 ఏళ్లు కాగా, ప్రతి ఐదేళ్లకు ఒకసారి దాన్ని సమీక్షించాల్సి ఉందని కూడా రాశారు. ఇప్పటికే ఆరు సంవత్సరాలు గడిచిపోయింది. 6 ఏళ్ల క్రితం రూపొంది.. కేవలం గ్రాఫిక్స్‌కే ఇప్పటివరకు పరిమితమై.. పూర్తిగా పేపర్‌పైనే ఉన్న మాస్టర్ ప్లాన్ ప్రకారం కేవలం బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసమే (రోడ్లు, డ్రైనేజీ, వాటర్, ఎలక్ట్రిసిటీ వంటివి) వారు వేసిన అంచనా 54 వేల ఎకరాలు x రూ.2 కోట్ల పర్ ఎకరా కింద రూ.1.09 లక్షల కోట్లు. ఇప్పటికే 6 సంవత్సరాలు పూర్తయింది. గణనీయంగా పెరిగి ఉంటుంది.
అంత ఎక్కువ ఖర్చుపెట్టడం సాధ్యమయ్యే పనికాదు..
పెరుగుతున్న ధరలను తీసుకుంటే రాజధాని నిర్మాణం కోసం కనీసం 40 సంవత్సరాలు పడుతుంది. హైదరాబాద్ నుంచి మొదలుకొని ఏ రాష్ట్ర రాజధాని అయినా తీసుకోండి.. వందల సంవత్సరాల కృషితోనే అవి నిలబడగలిగాయి. 2016లో చంద్రబాబు అమరావతి అని చెప్పి.. 2019 వరకు తాను ఖర్చుపెట్టింది రూ.5 వేల కోట్లు ఖర్చుచేశాడు. ఏ ప్రభుత్వానికైనా అంతకంటే ఎక్కువ ఖర్చుపెట్టడం సాధ్యమయ్యే పనికాదు. అమరావతి కేవలం 0.00001 శాతం, 99.9999 శాతం మిగిలిన రాష్ట్రం. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమం, పనులు కూడా చూసుకుంటూ అమరావతిపై ఖర్చుపెట్టాలని ఏ ప్రభుత్వానికైనా ఏ మేరకు సాధ్యపడుతుందనేది ఆలోచన చేయాలి.
అమరావతి మీద ప్రేమ ఉంది కాబట్టే నా ఇల్లు ఇక్కడ కట్టుకున్నా..
అమరావతి ప్రాంతం మీద నాకు ప్రేమ ఉంది కాబట్టే నా ఇల్లు కూడా ఇక్కడే కట్టుకున్నా. చంద్రబాబుకు అమరావతిలో ఇల్లు లేదు. నాకు ప్రేమ ఉంది కాబట్టే అమరావతి శాసనరాజధానిగా ఉండాలని తాపత్రయపడుతున్నా. గత ప్రభుత్వం వేసిన లెక్కల ప్రకారమే రూ.1.09 లక్షల కోట్లు బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం అవుతుందంటే.. నిర్మించేందుకు 20 సంవత్సరాలు పట్టినా.. లక్ష కోట్ల రూపాయలు 20 సంవత్సరాలు అయ్యేసరికి ఎన్ని లక్షల కోట్లకు చేరుతుంది..? 15 నుంచి 20 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుంది. ఇది సాధ్యమేనా అని ఆలోచన చేయాలి. ఓట్ల కోసం, ఊహాజనితమైన గ్రాఫిక్స్ చూపించి భావోద్వేగాలను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తే పొలిటీషియన్ లీడర్ కాలేడు. లీడర్ కావాలంటే విజన్ ఉండాలి.. దాన్ని ప్రజలకు వివరించాలి.
బాబుకు అమరావతి మీద ప్రేమ లేదు
చంద్రబాబుకు నిజంగా అమరావతిపై ప్రేమ లేదు. నిజంగా ప్రేమ ఉంటే విజయవాడ లేదా గుంటూరులో పెట్టేవాడు. అలా చేస్తే 500–1000 ఎకరాల్లో నిర్మాణాలు చేస్తే క్యాపిటల్ దానంతట అదే పెరిగి ఉండేది. రోడ్లు, డ్రైనేజీ, కరెంటు ఉంటాయి కాబట్టి ఖర్చు అధికంగా పెట్టాల్సిన అవసరం ఉండదు. గుంటూరు, విజయవాడ కాకుండా.. 54 వేల ఎకరాలు తన బినామీల పేరుతో భూములు ముందుగానే కొనుగోలు చేసి.. అక్కడే రాజధాని అన్నాడు. ఇటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ, అసాధ్యమని తెలిసి కూడా ఈరకమైన తీర్పులు ఉన్నప్పుడు సభలో చర్చిస్తున్నాం.
ఆ బాధ్యత నెరవేర్చాలనేది మర్చిపోకూడదు..
రాష్ట్రం మొత్తం గమనిస్తే 54 వేల ఎకరాలు ఎంత శాతం..? ఆలోచన చేయాలి. మిగిలిన రాష్ట్రం 99.9999 శాతం ఉంది. ఆ ప్రాంతాలన్నీ సంక్షేమం, అభివృద్ధి వైపు చూస్తున్నాయి. వాటికి కూడా డబ్బులు ఖర్చుపెట్టాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని కూడా మర్చిపోకూడదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అజెండా ఇదొక్కటే కాదు.. ప్రభుత్వానికి ప్రజల పట్ల బాధ్యత ఉంది. ఆ బాధ్యత నెరవేర్చాలనేది మర్చిపోకూడదు. సాధ్యంకానివి.. సాధ్యం చేయాలని ఏ వ్యవస్థలు, న్యాయస్థానాలు నిర్దేశించలేవు. అందుకే వీటన్నింటిపై న్యాయసలహాలు తీసుకుంటున్నాం. రాజ్యాంగం ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తున్నాం.
అడ్డంకులు ఎదురైనా అదే సరైన మార్గం కాబట్టి..
రాష్ట్ర ప్రజలకు ఒక్కటే హామీ ఇస్తున్నా.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా.. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రక్రియను కొలిక్కి తీసుకురావడంతో పాటు రాజధాని ప్రాంతాల్లో భూములిచ్చిన రైతుల ప్రయోజనాలను కూడా కాపాడుతాం. వారి కూడా అండగా నిలుస్తాం. వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేయం. వికేంద్రీకరణకు అర్థం అన్ని ప్రాంతాల అభివృద్ధి కాబట్టి, అందరి ఆత్మగౌరవం అందులో ఉంది కాబట్టి, అడ్డంకులు ఎదురైనా అదే సరైన మార్గం కాబట్టి, అందరికీ మంచి చేసేందుకు మన ప్రభుత్వం ఉంది కాబట్టి, ఈ చట్టసభకు ఈ విషయంలో సర్వాధికారాలతో పాటు రాబోయే తరాల గురించి ఆలోచించాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి, వికేంద్రీకరణ బాటలో సాగడం మినహా మరో మార్గం లేదని సవినయంగా తెలియజేస్తూ.. న్యాయవ్యవస్థ మీద తిరుగులేని అంచంచలమైన విశ్వాసాన్ని మరోసారి ప్రకటిస్తూ. వికేంద్రీకరణ మా సిద్ధాంతం.. రాజధాని మీద నిర్ణయం మా హక్కు, మా బాధ్యత అని మరోసారి తెలియజేస్తున్నాను. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు కూడా మనందరి ప్రభుత్వానికి కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను.