రాజధాని వివాదానికి స్వస్తి పలకండి
రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఐ(ఎం) విజ్ఞప్తి
రాజధానిపై హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఇకనైనా వివాదానికి స్వస్తి పలకాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. హైకోర్టు తీర్పు వెలువరించిన నేపత్యంలో రాష్ట్ర ప్రజలు ఆశించినదానికి భిన్నంగా శాసనసభలో ముఖ్యమంత్రి, పాలకపక్షం నేతలు వివాదాన్ని కొనసాగించే రీతిలో వ్యాఖ్యలు చేయటం ఏ మాత్రం సమంజసం కాదన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధికి, వికేంద్రీకరణకు పోటీ పెట్టడం సరికాదు. కోర్టులపట్ల గౌరవం ఉందదన్న ముఖ్యమంత్రి హైకోర్టు తీర్పును అమలు చేసి వివాదాలకు స్వస్తి చెప్పాలని కోరుతున్నాము.. పరిపాలన, శాసన రాజధానిగా అమరావతి కొనసాగించాలి.. శాసన, పరిపాలనా రాజధానికి న్యాయ వ్యవస్థకు సంబంధం లేదు. ఆ రీత్యా హైకోర్టు కర్నూలులో పెట్టవచ్చన్నది తమ పార్టీ అభిప్రాయమన్నారు. ఇప్పటికైనా రాజధానిపై న్యాయపరమైన, ఇతర వివాదాలు కొనసాగించకుండా, విభజన చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సాధించే విధంగా వత్తిడి తెచ్చి అటు రాజధాని అభివృద్ధికీ, ఇటు వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలని కోరారు. రాజధానికి భూములిచ్చిన రైతులు, ఉపాధి కోల్పోయిన పేదలు, కూలీలకు ఇచ్చిన చట్టబద్దమైన హామీలను నెరవేర్చాలన్నారు.